తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Maha Shivratri 2023 : మహాశివరాత్రికి ఏపీఎస్ ఆర్టీసీ 3,800 ప్రత్యేక బస్సులు

Maha Shivratri 2023 : మహాశివరాత్రికి ఏపీఎస్ ఆర్టీసీ 3,800 ప్రత్యేక బస్సులు

HT Telugu Desk HT Telugu

17 February 2023, 15:34 IST

    • Maha Shivratri 2023 : మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పలు ప్రాంతాల నుంచి 3800 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కోటప్పకొండకు 675, శ్రీశైలానికి 650 ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపింది. మరోవైపు... శివరాత్రి వేళ భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ 2,427 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఏపీఎస్ ఆర్టీసీ
ఏపీఎస్ ఆర్టీసీ (Hindustan times)

ఏపీఎస్ ఆర్టీసీ

Maha Shivratri 2023 : మహా శివరాత్రికి తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. శైవక్షేత్రాలన్నీ కళకళలాడుతున్నాయి. శివరాత్రి రోజు... భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలు, నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేపడతారు. సాయంత్రం వేళ శివయ్యను దర్శించుకుంటారు. శివాలయాలకు వెళ్లి.. పరమేశ్వరుడిని దర్శించుకుని ఉపవాస దీక్షలను విరమిస్తారు. ఈ నేపథ్యంలో... మహాశివరాత్రి రోజు శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోతాయి. ఇక ఈ సారి శివరాత్రి పర్వదినం వారాంతంలో (ఫిబ్రవరి 18న - శనివారం) వస్తుండటంతో.... చాలా మంది ప్రముఖ శైవక్షేత్రాలకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

PV Ramesh On Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నేను బాధితుడినే అన్న పీవీ రమేష్, పేర్నినాని కౌంటర్

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

ఈ నేపథ్యంలో.. శైవక్షేత్రాలకు వెళ్లాలని అనుకునే భక్తుల కోసం .. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. మహాశివరాత్రికి 3,800 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 101 శైవక్షేత్రాలకు బస్సు సర్వీసులు నడపనున్నామని తెలిపింది. కోటప్పకొండ.. శ్రీశైలం.. పొలతల.. పట్టిసీమ.. తదితర శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. శివరాత్రికి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలి అని అనుకుంటున్న వారి కోసం ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి 650 ప్రత్యేక బస్సులు... పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు 675... కడప జిల్లా పొలతలకు 200.... ఏలూరు జిల్లాలోని పట్టసీమకు 100 బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాష్ట్రంలోని 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని... శైవక్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడుపుతామని... ఘాట్‌రోడ్లలో నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు... మహాశివరాత్రి వేళ... తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కూడా 2,427 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 40 శైవక్షేత్రాలకు బస్సు సర్వీసులు నడపనున్నామని తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులను తిప్పనుంది. శ్రీశైలానికి 578 ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొంది. ఏడుపాయలకు 497 ప్రత్యేక బస్సులు... వేములవాడకు 481 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కీసరగుట్టకు 239... వేలాలకు 108... కాళేశ్వరానికి 71.. కొమురవెల్లికి 52.. రామప్ప ఆలయానికి 15 బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈల్‌ పాయింట్లతో పాటు నగరంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు నడపనున్నారు. ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది.