Shivratri Story : భోళాశంకరుడి విశిష్ట మహాశివరాత్రి కథ ఇదిగో..
Maha Shivratri 2023 : శివుడి అనుగ్రహం కోసం.. భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. శివరాత్రి పూజ ప్రత్యేకమైనది. సాక్షత్తూ.. ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి పూజ గురించి చెప్పాడు.
శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమి జరగదని.. చెబుతారు. పరమేశ్వరుడి అనుమతి లేకుండా.. ఏం జరగవు అని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన.. పరమేశ్వరుడి కోసం ప్రత్యేక పూజలు చేస్తే.. మంచిదని అంటుంటారు. అయితే పూజను పవిత్రంగా చేయాలి. ఏదో చేశామంటే.. చేశాం అన్నట్టుగా ఉండకూడదు. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. దేవదేవుడికి ఇష్టమైన రోజు వెనక ఓ కథ ఉంది.
పూర్వం ఓ బోయవాడు.. పర్వత ప్రాంతాల్లో నివసించే వాడు. అతడు ఉదయాన్నే లేచి.. వేటకు వెళ్లి.. జంతువులను చంపి తెచ్చేవాడు. ఓ రోజు మాత్రం.. అతడికి వేటలో ఏ జంతువు లభించలేదు. దీంతో నిరాశగా ఇంటివైపు బయలుదేరాడు. వస్తూ ఉంటే.. ఒక మంచి నీటి సరస్సు కనిపించింది. ఆ సరస్సు దగ్గరకు రాత్రి సమయంలో జంతువులు వస్తాయని, అప్పుడు వాటిని చంపి.. తినొచ్చని భావిస్తాడు. అందులో భాగంగా.. సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చొంటాడు.
అతడికి శివశివ అంటూ శివుడి పేరును స్మరించడం అలవాటు. ఆ రాత్రంతా.. చెట్టు మీద కూర్చొని శివుడి నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఆరోజున శివరాత్రి.. ఆ విషయం బోయవాడికి తెలియదు. ఇదే సమయంలో ఆ సరస్సు దగ్గరకు నీళ్లు తాగేందుకు ఓ జింక వస్తుంది. దానిని చూసిన బోయవాడు.. బాణాన్ని ఎక్కుపెడతాడు. ఆ విషయం జింక గమనిస్తుంది. తాను గర్భంతో ఉన్నానని, చంపడం ఆధర్మమని చెబుతుంది. జింక మనిషిలా మాట్లాడటం.. ఏంటని ఆ జింకను చంపకుండా వదిలేశాడు.
అది అక్కడ నుంచి వెళ్లిపోగానే.. ఆ సరస్సు దగ్గరకు మరో ఆడ జింక వస్తుంది. ఈసారి దాన్ని చంపాలనుకున్న బోయవాడు.. దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ జింక కూడా.. నేను నా భర్తను వెతకాడానికి వచ్చానని, బక్క చిక్కిన శరీరంతో ఉన్నానని, తనను చంపినా.. మీ కుటుంబం ఆకలి తీరదని చెబుతుంది. ఏ జంతువు కనిపించకుంటే.. తర్వాత.. తిరిగి వస్తానని చెప్పింది. దీంతో బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేస్తాడు.
ఆ తర్వాత.. కాసేపటికి సరస్సు దగ్గరకు మరో మగ జింక వస్తుంది. ఆ మగ జింక ఇటు వైపు ఏమైనా.. రెండు ఆడ జింకలు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. దీంతో అతడు జింకలు తనతో చెప్పిన విషయాలను మగ జింకకు వివరిస్తాడు. నేను ఒకసారి వాటిని చూసుకొని వస్తానని.. చెప్పి వెళ్తుంది. దీంతో బోయవాడు అక్కడే కాచుకుని కూర్చొంటాడు. ఉదయం కాగానే.. అటుగా ఒక జింగ, దాని పిల్ల రావడాన్ని బోయవాడు గమనించి.. వాటిని చంపేందుకు బాణాన్ని ఎక్కుపెడతాడు. తన పిల్లలను వదిలేసి వస్తానని తెలుపుతుంది.
ఇచ్చిన మాట ప్రకారం.. ఆ బోయవాడి దగ్గరకు నాలుగు జింకలు ఒకేసారి వస్తాయి. నన్ను చంపు.. అంటూ ముందుకు వస్తాయి. ఆ జింకలను చూసిన బోయవాడు ఆశ్చర్యపోతాడు. అతడిలో మార్పు వస్తుంది. జంతువుల కోసం కాచుకుని.. ఉన్న బోయవాడు.. ఆ రాత్రంతా.. మారెడు చెట్టు మీదే ఉంటాడు. రాత్రంతా.. శివ శివ అంటూ.. దేవదేవుడిని స్మరిస్తూ ఉంటాడు. తన చూపునకు అడ్డంగా వస్తున్న మారెడు దళాలను కోసి కిందపడేస్తుంటాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే.. ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది. కింద పోసిన మారెడు దళాలన్నీ శివలింగంపై అభిషేకంలా పడుతాయి.
మారెడు దళం కారణంగా శివ పూజా ఫలితం వస్తుంది. రాత్రి అంతా.. బోయవాడు శివ శివ అంటూ.. మారెడు దళాలతో శివుడిని తలుస్తూ.. తెల్లవారుజాము వరకూ మెళకువగానే ఉంటాడు. అతడికి జాగరణ ఫలితం దక్కుతుంది. అతడిలో మార్పు వస్తుంది. ఇక ఆ జింకలు సత్య నిష్ఠతో ఉండటంతో ఈశ్వరుడి అనుగ్రహంతో మృగశిర నక్షత్రంగా ఆకాశంలో చేరిపోయాయి. బోయవాడు ఈ నక్షత్రానికి వెనుకగా.. ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయే.. లుబ్ధక నక్షత్రంగా నిలిచిపోయాడని పురాణాలు చెబుతాయి.
సంబంధిత కథనం