తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special Buses : గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి శ్రీశైలం, శబరిమల, అరుణాచలానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు

APSRTC Special Buses : గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి శ్రీశైలం, శబరిమల, అరుణాచలానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు

HT Telugu Desk HT Telugu

31 October 2024, 21:08 IST

google News
    • కార్తీకమాసం వేళ ఏపీఆర్టీసీ శుభవార్తం చెప్పింది. విజయవాడ నుంచి త్రిలింగ దర్శిని, అరుణాచలం, శ్రీశైలం, పంచారామాలు, శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. తక్కువ ధరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…
ప్రత్యేక బస్సు సర్వీసులు
ప్రత్యేక బస్సు సర్వీసులు

ప్రత్యేక బస్సు సర్వీసులు

భక్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుండి ప్రత్యేక బస్సులు న‌డిపేందుకు ఆర్టీసీ విజయవాడ డిపో నిర్ణ‌యించింది. త్రిలింగ దర్శిని, శ్రీ శైలం, ప్ర‌సిద్ధ శైవ‌క్షేత్రాలైన పంచారామాల‌ యాత్ర, అరుణాచలం గిరి ప్రదర్శన, శబరిమల యాత్రకు ప్ర‌త్యేక స‌ర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చింది.

త్రిలింగ దర్శిని ప్యాకేజీ

త్రిలింగ దర్శిని ప్యాకేజీలో భాగంగా యాగంటి, మహానంది, శ్రీశైలం శైవ క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవచ్చు. ఇందుకోసం సూపర్ లగ్జరీ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రతి కార్తిక శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం విజయవాడకు చేరుతుంది.‌ ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.1,800గా నిర్ణయించింది.

గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు

అరుణాచలం, గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. సూపర్ లగ్జరీ సర్వీసులు నడపనున్నారు. అరుణాచలం, గిరి ప్రదక్షిణకు పౌర్ణమి రెండు రోజుల ముందుగా విజయవాడ నుంచి బయలుదేరి శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ పుణ్య క్షేత్రాలను దర్శించుకుని పౌర్ణమికి అరుణాచలం చేరి గిరి ప్రదక్షిణ అనంతరం విజయవాడ చేరుతుంది. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.2,500గా నిర్ణయించినట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై.దానం తెలిపారు.

పంచారామాల ద‌ర్శన ప్యాకేజీలు

ఈ బస్సులు కార్తీక మాసంలో ప్రతి శ‌నివారం, ఆదివారం, సోమవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.‌ నవంబర్ 2, 3, 4, 9, 10, 11, 15, 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఆయా తేదీల్లో ఉదయం‌ 4 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి పంచారామాలైన అమ‌రావ‌తి (అమ‌రేశ్వ‌రుడు), భీమ‌వ‌రం (సోమేశ్వ‌రుడు), పాల‌కొల్లు (క్షీర‌రామ‌లింగేశ్వ‌రుడు), ద్రాక్షారామం (భీమేశ్వ‌రుడు), సామ‌ర్ల‌కోట (కొమ‌ర లింగేశ్వ‌రుడు) పుణ్య‌క్షేత్రాల‌ను దర్శించుకుని అదే రోజు రాత్రి విజయవాడకు చేసుకుంటారు. టిక్కెట్ ధర సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ. 1,120గ నిర్ణయించినట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై.దానం తెలిపారు.

శ్రీశైలం యాత్రకు ప్రత్యేక సర్వీసులు

శ్రీశైలం యాత్రకు ప్రత్యేక సర్వీసు అందుబాటులోకి తెచ్చారు. శ్రీశైలానికి ప్రతి ఆదివారం, ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చినట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై.దానం తెలిపారు. దీనికి సాధారణ ఛార్జీలే ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు శబరిమలై యాత్రకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీలకు సంబంధించి మరిన్ని వివరాలకు ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని సూచించారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం