APSRTC Specials : అమలాపురం నుంచి మన్యసీమ దర్శిని, పంచారామ క్షేత్రాలు, శబరిమలై యత్రకు ప్రత్యేక బస్సులు
30 October 2024, 22:43 IST
APSRTC Specials : ఏపీఎస్ఆర్టీసీ అమలాపురం జిల్లా మన్యసీమ, పంచారామాలు, శబరిమల ప్రత్యేక సర్వీసుల నడుపుతోంది. కార్తీకమాసంలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 7 గంటలకు అమలాపురం నుంచి పంచారామాల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
అమలాపురం నుంచి మన్యసీమ దర్శిని, పంచారామ క్షేత్రాలు, శబరిమలై యత్రకు ప్రత్యేక బస్సులు
భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బి.ఆర్ అంబేడ్కర్ జిల్లా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అమలాపురం డిపో నిర్ణయించింది. మన్యసీమ దర్శిని, ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. అలాగే శబరిమలకు కూడా ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
మన్యసీమ దర్శిని
మన్యసీమ దర్శినికి సంబంధించి నవంబర్ 3,10,17,24 తేదీల్లో బస్సులు అందుబాటులో ఉంటాయి. అమలాపురం బస్సు డిపో నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటాయి. ర్యాలి మోహిని అవతార కేశవస్వామి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి, సీతపల్లి బాపనమ్మ గుడి, రంప పురాతన శివాలయం, రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ ఆలయం, మారేడుమిల్లి కాఫీ తోటలు, రబ్బరు తోటలు, ఔషధ మొక్కలు, జలతరంగిణి జలపాతం, పాములేరే వాగు సందర్శన ఉంటుంది. మన్యసీమ దర్శిని ప్యాకేజీ ఒక్కొక్కరికి పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.350గా ఉంటుంది.
పంచారామాల దర్శన ప్రాంతాలు...ప్యాకేజీలు
ఈ బస్సులు కార్తీకమాసంలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 7 గంటలకు అమలాపురం నుండి బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను కార్తిక సోమవారం నాడు దర్శనం పూర్తి చేసుకుంటారు. సోమవారం రాత్రి 8 గంటలకు అమలాపురం కాంప్లెక్స్‌కు చేరుకుంటారు. ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ నెలలో ప్రతి ఆదివారం నవంబర్ 2, 3, 9, 10, 16, 17, 23, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
టిక్కెట్టు ధర సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు పెద్దలకు రూ.950, పిల్లకు రూ.720, అల్ట్రా డీలక్స్ సర్వీసుకు పెద్దలకు రూ.1,170, పిల్లలకు రూ.880, సూపర్ లగ్జరీ సర్వీసుకు పెద్దలకు రూ.1,2,20 , పిల్లలకు రూ.920గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను అమలాపురం బస్ డిపో ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే మీకు నచ్చిన సీటును రిజర్వేషన్ చేయించుకోవచ్చని అమలాపురం డిపో మేనేజర్ సీహెచ్ సత్యనారాయణ తెలిపారు.
శబరిమల యాత్రలు, ప్యాకేజీ
అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు సూపర్ లగ్జరీ, ఏసీ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రకు 6 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 12 రోజుల యాత్ర ప్రాకేజీలను డిపో మేనేజర్ సీహెచ్ సత్యనారాయణ ప్రకటించారు. సూపర్ లగ్జరీ యాత్ర బస్సుల్లో ఆడియో, వీడియో, పుష్‌బ్యాక్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆరు రోజుల ప్యాకేజీకి సంబంధించి ఒక్కొక్కరికి టిక్కెట్టు సూపర్ లగ్జరీకి రూ.5,000, ఇంద్ర ఏసీకి రూ.6,400 ప్యాకేజీ ప్రకటించారు. అయితే రోజులను బట్టీ ప్యాకేజీలో మార్పులు ఉంటాయని అమలాపురం డిపో మేనేజర్ సీహెచ్ సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, ఎరుమేలి, శబరిమలై, కంచి, తిరుపతి, విజయవాడ క్షేత్రాలను దర్శించుకుంటారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు