Vja To Srisailam: డిసెంబర్‌ 9 నుంచి కృష్ణానదిలో సీప్లేన్ సర్వీసులు, విజయవాడ- శ్రీశైలం మధ్య సర్వీసులు-from december 9 seaplane services in krishna river services between vijayawada and srisailam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vja To Srisailam: డిసెంబర్‌ 9 నుంచి కృష్ణానదిలో సీప్లేన్ సర్వీసులు, విజయవాడ- శ్రీశైలం మధ్య సర్వీసులు

Vja To Srisailam: డిసెంబర్‌ 9 నుంచి కృష్ణానదిలో సీప్లేన్ సర్వీసులు, విజయవాడ- శ్రీశైలం మధ్య సర్వీసులు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 28, 2024 01:10 PM IST

VjaTo Srisailam: విజయవాడ వాసులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న సీ ప్లేన్ సర్వీసులకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి కృష్ణానదిలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2019లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో మరుగున పడిన సీప్లేన్ సర్వీసుల్ని ప్రయోగాత్మకంగా నడుపనున్నారు.

విజయవాడ-శ్రీశైలం మధ్య త్వరలో సీ ప్లేన్ సర్వీసులు
విజయవాడ-శ్రీశైలం మధ్య త్వరలో సీ ప్లేన్ సర్వీసులు

VjaTo Srisailam: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కృష్ణా నదిలో సీ ప్లేన్ సర్వీసులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. విజయవాడ నగరంలో సీ ప్లేన్‌ సర్వీసుల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కొద్ది నెలల క్రితమే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2014619 మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజీ ఎగువున సీ ప్లేన్ సర్వీసుల్ని నడిపేందుకు అనుమతులిచ్చినా కార్యరూపం దాల్చలేదు.

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో, ప్రకాశం బ్యారేజీలో మళ్లీ సీ ప్లేన్‌ అంశం జీవం పోసుకుంది. కేంద్రం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో విజయవాడకు పర్యాటకం ఉండే అనుకూలతల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి తొలి సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబర్ 9 నుంచి ఈ విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 9న ప్రారంభించనుంది. భవిష్యత్తులో మరిన్ని రూట్లకు ఈ సర్వీసులను విస్తరించనుంది.

ప్రకాశం బ్యారేజీ ఎగువున ఏర్పాట్లు…

ప్రకాశం బ్యారేజీ ఎగువున విస్తరించిన కృష్ణా జలాల్లో సీ ప్లేన్‌ సర్వీసులు విజయవాడ వాసులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు తొలి దశలో సీ ప్లేన్‌ సర్వీసును ప్రారంభించనున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ సర్వీసులను మరిన్ని పెంచుతారు. ఇతర పర్యాటక ప్రాంతాలకు సర్వే చేపట్టి అయా ప్రాంతాలకు విస్తరిస్తారు.

ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర వాటర్‌ ఏరోడ్రమ్‌ ఏర్పాటు చేస్తారు. సీ ప్లేన్‌‌లోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా వాటర్‌ వే కూడా ఏర్పాటు చేస్తారు. వాటర్‌ ఏరో డ్రమ్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే పౌర విమానయాన సంస్థ అధికారులు సర్వే చేపట్టారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దిగువున దుర్గాఘాట్‌ సమీపంలో ఫ్లైఓవర్‌ దిగువన ఉన్న స్థలంలో వాటర్‌డ్రోమ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇక్కడ చేస్తారు.

దుర్గాఘాట్‌లో వాటర్‌ డ్రోమ్…

సీప్లేన్ సర్వీసుల ద్వారా విజయవాడ - శ్రీశైలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం సులువు కానుంది. విజయవాడలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుని శ్రీ శైలంలోని శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జులను కూడా దర్శించుకునే భాగ్యం ప్లేన్‌ ద్వారా కలగనుంది. రెండు ప్రాంతాల మధ్యన టెంపుల్‌ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

సీ ప్లేన్‌ ల్యాండింగ్‌ కోసం ఒక వాటర్‌ వే ఏర్పాటు చేస్తారు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత, టేకాఫ్‌ తీసుకునే ముందు ప్రయాణికులను ఎక్కించుకోడానికి వాటర్ వే నిర్మాణం చేపడతారు. వాటర్‌ వే కోసం జెట్టీల నిర్మాణం చేపడతారు. ఈ జెట్టీ సమీపంలోకి విమానం వస్తుంది. ప్రయాణికులు జెట్టీ ద్వారా బోటులోకి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

భవిష్యత్తులో సేవల విస్తరణ

విజయవాడ నుంచి బయలుదేరిన సీ ప్లేన్‌ నేరుగా శ్రీశైలంలో పాతళగంగ దగ్గర కృష్ణానదిలో ల్యాండ్‌ అవుతుంది. సీప్లేన్ సర్వీసుల్ని ఇంకా ఖరారు చేయలేదు. విజయవాడ-శ్రీశైలం సర్వీస్ విజయవంతం అయితే భవిష్యత్తులో హైదరాబాద్‌‌లోని హుస్సేన్ సాగర్‌, విశాఖపట్నంలకు కూడా సీప్లేన్ సర్వీసులు విస్తరిస్తారు. శ్రీశైలం రూట్‌కు లభించే ఆదరణ బట్టి మిగిలిన సర్వీసులను నిర్వహిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం