APSRTC Special Buses : శ్రీకాకుళం నుంచి శబరిమల, పంచారామాలకు స్పెషల్ బస్ సర్వీసులు-ప్యాకేజీలు ఇవే
28 October 2024, 19:53 IST
APSRTC Special Buses : ఏపీఎస్ఆర్టీసీ కార్తీక మాసం సందర్భంగా శ్రీకాకుళం నుంచి శబరిమల, పంచారామాలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతోంది. నవంబర్ 3, 10,17, 24 తేదీల్లో పంచారామాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
శ్రీకాకుళం నుంచి శబరిమల, పంచారామాలకు స్పెషల్ బస్ సర్వీసులు-ప్యాకేజీలు ఇవే
భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ శ్రీకాకుళం డిపో నిర్ణయించింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. భక్తుల కోసం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుపుతున్నారు. అలాగే శబరిమలకు కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చారు.
దర్శన ప్రాంతాలు...ప్యాకేజీలు
ఈ బస్సులు కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్ నుండి బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను కార్తిక సోమవారం నాడు దర్శనం పూర్తి చేసుకుంటారు. అనంతరం మళ్లీ తిరిగి మంగళవారం తెల్లవారుజామున శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు బస్సులు చేరుకుంటాయి. ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ నెలలో ప్రతి ఆదివారం నవంబర్ 3, 10,17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
టిక్కెట్టు ధర సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.2,000, అల్ట్రా డీలక్స్ సర్వీసుకు రూ.2,350, సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.2,400గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను రాజమండ్రి బస్టాండ్, గోవకవరం బస్టాండ్, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే మీకు నచ్చిన సీటును రిజర్వేషన్ చేయించుకోవచ్చని శ్రీకాకుళం ఆర్టీసీ డీపీటీవో విజయ్ కుమార్ తెలిపారు.
శబరిమల యాత్రలు, ప్యాకేజీ
అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రకు ఆరు రోజులు, ఏడు రోజుల యాత్ర ప్రాకేజీలను డిపో మేనేజర్ ఎస్‌కే షబ్నం ప్రకటించారు. సూపర్ లగ్జరీ యాత్ర బస్సుల్లో ఆడియో, వీడియో, పుష్‌బ్యాక్ సౌకర్యం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలో సంప్రదించి ప్యాకేజీలు గురించి తెలుసుకోవచ్చయని విజయ్ కుమార్ తెలిపారు. భక్తులను రూట్లను బట్టీ ప్యాకేజీల్లో మార్పు ఉంటుందని, కనుక భక్తులు డిపోను సంప్రదించాలని సూచించారు. శ్రీకాకుళం డీపో అందిస్తోన్న ఈ అవకాశాన్ని భక్తులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు