తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cid, Which Has Stepped Up Its Aggression In The Guide Case, Is The Investigating Agency That Has Collected Key Inform

Margadarsi Chits: మార్గదర్శి వ్యవహారంలో దూకుడు పెంచిన సిఐడి.. 8గంటల పాటు విచారణ

HT Telugu Desk HT Telugu

07 June 2023, 8:02 IST

    • Margadarsi Chits: మార్గదర్శి చిట్స్‌ వ్యవహారంలో పట్టు బిగించేందుకు ఏపీ సిఐడి విశ‌్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక అవకతవకల నేపథ్యంలో  మార్గదర్శిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి  మార్గదర్శి ఉపశమనం పొందినా, సిఐడి మాత్రం ప్రయత్నాలను వీడటం లేదు. 
మార్గదర్శి చిట్స్‌ నిర్వహణపై సిఐడి అనుమానాలు
మార్గదర్శి చిట్స్‌ నిర్వహణపై సిఐడి అనుమానాలు

మార్గదర్శి చిట్స్‌ నిర్వహణపై సిఐడి అనుమానాలు

Margadarsi Chits: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో ఏపీ సిఐడి దూకుడు కొనసాగిస్తోంది. మంగళవారం ఏకబిగిన ఎనిమిది గంటల పాటు మార్గదర్శి ఎండి శైలజాకిరణ్‌ను సిఐడి అధికారుల బృందం ప్రశ్నించింది. నిధులు మళ్లింపుపైనే ప్రధానంగా దృష్టి సారించింది.

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న ఆ సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్‌ను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లో విచారించారు. సీఐడీ ఎస్పీలు అమిత్‌ బర్దర్, హర్షవర్థన్‌రాజు, విచారణ అధికారి రవికుమార్‌తోపాటు 30 మందితో కూడిన సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శైలజ నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు గేటు తాళం తీయలేదు.

మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. 'మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ హోదాలో చెక్‌ పవర్‌ కూడా ఉండటంతో నిధుల మళ్లింపుపై ఆధారాలు చూపించి, వాటిపై సమాధానాలు కోరినట్టు తెలుస్తోంది.

మరోవైపు సిఐడి విచారణ సందర్భంగా తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేసినట్లు తెలుస్తోంది. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వడంతో ఆమెను పరీక్షించిన డాక్టర్‌ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పడంతో సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని తెలుసుకోవడంపై సీఐడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం రూ.వేల కోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్లు తేలిందని, బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన రూ.793.50 కోట్లను అటాచ్‌ చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్లించారనే దానిపై తాజా దర్యాప్తు కొనసాగింది.

రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి అనుమానిస్తోంది. సీఐడీ అధికారులు అదే విషయంపై శైలజా కిరణ్‌ను ప్రశ్నించడంతో ఆమె సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలోని 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా వసూలు చేసిన చందా నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని పేర్కొనట్లు మాత్రమే తెలిపారు. నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నది మాత్రం వెల్లడించలేదు. దీనిపై సీఐడీ అధికారులు ఎంత ప్రశ్నించినా తనకేమీ తెలియదని శైలజా కిరణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందని సీఐడీ అధికారులు శైలజా కిరణ్‌ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారని సిఐడి వర్గాలు చెబుతున్నాయి. చందాదారుల సొమ్ము భద్రంగా ఉందంటూ విచారణ నుంచి తప్పించుకునే యత్నం చేశారు. అదే నిజమైతే చిట్టీల మొత్తం ఎందుకు చెల్లించలేకపోతున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె స్పందించలేదు.

విచారణకు శైలజా కిరణ్‌ పూర్తిగా సహకరించక పోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తరువాత ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావును కూడా మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తోంది.

చట్టాన్ని ఉల్లంఘించి... నిధులు కొల్లగొట్టారని ఆరోపణలు…

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ ద్వారా రామోజీరావు, శైలజ భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి ఆర్థిక అక్రమాలను నిర్ధారించారు. కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం-1982 ప్రకారం చందాదారుల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత బ్రాంచీ కార్యాలయాలున్న నగరాలు/పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాల్సి ఉంటుంది.

అందుకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ రూ.వేల కోట్లను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించింది. చిట్‌ఫండ్స్‌ సంస్థలు తమ నిధులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మాత్రం తమ చందాదారుల నిధులను అత్యంత మార్కెట్‌ రిస్క్‌ ఉంటే మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్‌లోకి మళ్లించింది. తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టింది.

చిట్‌ఫండ్స్‌ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదనే నిబంధన ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ చందాదారుల చిట్టీల మొత్తాన్ని పూర్తిగా వారికి ఇవ్వకుండా డిపాజిట్ రశీదులిస్తూ 4 - 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నల్లధననాన్ని తమ సంస్థ ముసుగులో చలామణిలోకి తెస్తున్నట్లు కూడా సీఐడీ గుర్తించింది.

గత ఏడాది డిసెంబర్‌ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కొత్త చిట్టీలు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్‌ నిలిచిపోయింది. చందాదారుల సొమ్మును గుర్తు తెలియని సంస్థల్లో పెట్టుబడిగా పెట్టిందని ఆ నిధులు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. దీంతో చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేకపోతోందని సిఐడి వర్గాలు చెబుతున్నాయి. దీంతో శైలజా కిరణ్‌ను మరోసారి విచారించాల్సి ఉందని సీఐడీ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే నోటీసులిస్తామని సీఐడీ డీఎస్సీ రవికుమార్‌ తెలిపారు.

మంగళవారం జరిగిన విచారణలో కొంతమేర సమాధానాలు మాత్రమే ఇచ్చారని, అందుచేత మరోసారి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యం సమస్య ఉందనడంతో శైలజాకిరణ్‌ను వైద్యులు పరీక్షించారని సీఐడీ డీఎస్పీ పేర్కొన్నారు.