తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Universities Vc Resigns : ఏపీలో కొనసాగుతున్న వీసీల రాజీనామాలు- పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్

AP Universities VC Resigns : ఏపీలో కొనసాగుతున్న వీసీల రాజీనామాలు- పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్

HT Telugu Desk HT Telugu

28 June 2024, 17:29 IST

google News
    • AP Universities VC Resigns : ఏపీ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. వీరిపై వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏపీలో కొనసాగుతున్న వీసీల రాజీనామాలు- పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్
ఏపీలో కొనసాగుతున్న వీసీల రాజీనామాలు- పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్

ఏపీలో కొనసాగుతున్న వీసీల రాజీనామాలు- పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్

AP Universities VC Resigns : రాష్ట్రంలో యూనివ‌ర్సిటీల వైస్ ఛాన్సల‌ర్లు రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు వీసీలు రాజీనామా చేయ‌గా, మ‌రికొంత మంది వీసీలు రాజీనామా చేసే యోచ‌నలో ఉన్నారు. అలాగే ఇంకొంత మందిపై రాజీనామా చేయాల‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వైస్ ఛాన్సలర్లను ప్రభుత్వమే తొల‌గించాల‌ని ఆ రెండు పార్టీల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీసీలు రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అయితే బహిరంగంగానే వైసీపీ కార్యకర్తగా వ్యవహరించారని టీడీపీ, జనసేన ఆరోపించింది.

విశాఖ‌ ఆంధ్ర యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌స‌న్ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. తిరుపతి శ్రీ వెంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి రాజీనామా చేశారు. అనంత‌పుర‌ం జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ) వైస్ ఛాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ శ్రీ‌నివాస‌రావు కూడా రాజీనామా చేశారు. అనంత‌పురం జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ శ‌శిధ‌ర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. వీరు త‌మ రాజీనామా లేఖ‌ల‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యద‌ర్శికి పంపారు. అనంతపురం శ్రీ‌కృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ (ఎస్‌కేడీ) వైస్ ఛాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ హుస్సేన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. అలాగే ఈ యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ ఎంవీ ల‌క్ష్మయ్య కూడా రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా లేఖ‌ను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యద‌ర్శికి పంపారు.

అలాగే క‌ర్నూల్ రాయ‌ల‌సీమ యూనివ‌ర్సిటీ వీసీ ప్రొఫెస‌ర్ సుధీర్ ప్రేమ్ కుమార్ కూడా రాజీనామా చేశారు. ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ వీసీ పి. రాజ‌శేఖ‌ర్‌పై రాజీనామా చేయాల‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్రొఫెస‌ర్ పి. రాజ‌శేఖ‌ర్ వీసీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని రాజ‌ధాని రైతులు యూనివ‌ర్సిటీలోనే ఆందోళ‌న చేప‌ట్టారు.

రాష్ట్రంలో అధికార మార్పడి జ‌రిగిన త‌రువాత యూనివ‌ర్సిటీల వీసీలపై చ‌ర్చ మొదలైంది. వీసీలను మార్చాలని గతంలో ఉన్న వారంతా వైసీపీకి అంటకాగార‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అలాగే యూనివ‌ర్సిటీల వీసీల‌పై టీడీపీ, జ‌న‌సేన చేసిన ఆరోప‌ణ‌ల‌తో పాటు రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం వ‌చ్చిన త‌రువాత కొన్ని ప‌త్రిక‌లు యూనివ‌ర్సిటీల‌పైనే క‌థ‌నాలు రాస్తున్నాయి. అందులో యూనివ‌ర్సిటీలు రాజ‌కీయమ‌యం అయ్యాయ‌ని, వైసీపీ అనుకూలుర‌కే ఉద్యోగాలు ఇచ్చార‌ని అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సల‌ర్ల రాజీనామాలపై ఒత్తిడి పెరిగింది.

రాష్ట్రంలో మొత్తం 23 ప్రభుత్వ యూనివ‌ర్సిటీలు ఉన్నాయి. వీటికి గ‌వ‌ర్నర్ ఛాన్సల‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తారు. వైస్ ఛాన్సల‌ర్లు ఒక్కో యూనివ‌ర్సిటీకి ఒక్కొక్కరు ఉంటారు. అయితే వీసీ అవ్వాలంటే అర్హత ప్రొఫెస‌ర్‌గా ప‌దేళ్ల స‌ర్వీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఎస్‌వీయూ వీసీ ప్రొఫెస‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి నియామకం అయిన‌ప్పుడు ఆయ‌న ప్రొఫెస‌ర్ ప‌దేళ్లు స‌ర్వీసు లేదు. అందుకే అప్పుడు ఆయ‌న నియామ‌కంపై విమ‌ర్శలు వెల్లువెత్తాయి. ఇలానే రాష్ట్రంలో నిబంధ‌న‌లకు విరుద్ధంగా వీసీల నియామకాలు జరిగాయని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే గత ప్రభుత్వం తాము యూజీసీ నిబంధ‌న‌ల‌కు అనుకూలంగానే నియామ‌కం చేస్తున్నామ‌ని చెప్పింది.

యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సల‌ర్ నియామ‌కం ఎలా?

యూనివ‌ర్సిటీ ప‌ద‌వీకాలం మూడేళ్లు ఉంటుంది. ఆ తరువాత ఆ ప‌ద‌వి నుంచి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఖాళీ అయిన యూనివ‌ర్సిటీల‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచ‌న మేర‌కు గ‌వ‌ర్నర్ వీసీలను నియ‌మిస్తారు. అయితే అందుకు ఒక ప్రక్రియ ఉంది. ముందు ముగ్గురి స‌భ్యుల‌తో సెర్చ్ క‌మిటీ వేస్తారు. ఈ సెర్చ్ క‌మిటీలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి త‌ర‌పున ఒక‌రు, యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) త‌ర‌పున ఒక‌రు, రాష్ట్రంలోని ఏదో ఒక యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఒకరు ఉంటారు. ఈ సెర్చ్ క‌మిటీ సీనియారిటీ, అర్హత‌లు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ముగ్గురు పేర్లను సూచిస్తుంది. ఆ ముగ్గురు పేర్లలో ఒక దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక చేసి, గ‌వ‌ర్నర్‌కు పంపుతారు. దాన్ని గ‌వ‌ర్నర్ ఆమోదించొచ్చు. లేక‌పోతే తిప్పి పంపొచ్చు. ఆమోదిస్తే ఆ వ్యక్తే వైస్ ఛాన్సల‌ర్ అవుతారు. ఒక వేళ గ‌వ‌ర్నర్‌ తిప్పి పంపితే సీఎం ఆ పేరును మార్చి సెర్చ్ క‌మిటీ సూచించిన మూడు పేర్లలో మ‌రొక దాన్ని ఎంపిక చేయొచ్చు, లేక ఎటువంటి మార్పు చేయ‌కుండా మొద‌ట పంపిన పేరునే మ‌ళ్లీ గ‌వ‌ర్నర్‌కు పంపొచ్చు. అయితే ఈసారి గ‌వ‌ర్నర్ తిప్పి పంప‌డానికి ఉండ‌దు. త‌ప్పనిస‌రిగా ఆమోదం తెల‌పాల్సిందే.

ఏఎన్‌యూ, ఏయూ వీసీల‌పై ఎందుకు చ‌ర్చ?

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ప్రధానంగా ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ వీసీ పి. రాజ‌శేఖ‌ర్‌, ఆంధ్ర యూనివ‌ర్శిటీ (ఏయూ) వీసీ ప్రొఫెస‌ర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డిలను పదవుల నుంచి తప్పించాలని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు డిమాండ్ చేశారు. ఏఎన్‌యూ ప్రొఫెస‌ర్ పి. రాజ‌శేఖ‌ర్ ఇన్‌ఛార్జ్ వీసీగా నియామకం అయిన‌ప్పటి నుంచే వివాదం చెల‌రేగింది. ఆయ‌న‌పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు అవినీతి చేశార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌లపై మాజీ ఐఏఎస్ అధికారి చ‌క్రపాణితో రాష్ట్ర ప్రభుత్వం క‌మిటీ కూడా వేసింది. క‌మిటీ అక్రమాలు జ‌రిగాయ‌ని ఆధారాల‌తో కూడిన దాదాపు 180 పేజీల రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆయ‌న‌కు భ‌విష్యత్తులో ఎటువంటి కీల‌క ప‌ద‌వులు ఇవ్వకూడద‌ని కూడా పేర్కొంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వ‌చ్చిన త‌రువాత పి. రాజ‌శేఖ‌ర్‌ను న‌వంబ‌ర్ 5న ఇన్‌ఛార్జ్ వీసీగా నియ‌మించారు. దీనిపై యూనివ‌ర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెస‌ర్, యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ అండ్ కామ‌ర్స్ కాలేజీ ప్రిన్సిప‌ల్‌ ర‌త్నాషీలా మ‌ణి ఆయ‌న‌కు రెగ్యుల‌ర్ వీసీ పోస్టు ఎలా ఇస్తార‌ని, ఆయ‌న ప‌ని విధానం బాగోద‌ని రాష్ట్ర ఉన్నత విద్యా మండ‌లికి ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు మ‌రికొంత మంది ప్రొఫెస‌ర్లు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంతో ప్రొఫెస‌ర్ ర‌త్నాషీలా మ‌ణి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీంతో 2021 జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీ వేసింది. ఆదిక‌వి న‌న్నయ్య యూనివ‌ర్శిటీ మాజీ వీసీ ప్రొఫెస‌ర్ కె.నిరుప‌మరాణి అధ్యక్షత‌న రాయ‌లసీమ యూనివ‌ర్సిటీ వీసీ కె.ఆనంద‌రావు, మాజీ సంయుక్త కార్యద‌ర్శి జి. క‌న్నం దాస్ స‌భ్యులుగా క‌మిటీ నియ‌మించి, 90 రోజుల్లో విచార‌ణ రిపోర్టు అంద‌జేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి స‌తీష్ చంద్ర ఆదేశాలు ఇచ్చారు. ఈ క‌మిటీ నిర్ణీత గ‌డువులోనే రిపోర్టు ప్రభుత్వానికి స‌మ‌ర్పించింది. ఈ రిపోర్టులో యూనివ‌ర్సిటీలో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై లోతైన విచార‌ణ జ‌ర‌పాల‌ని సూచించింది. అంతే త‌ప్ప ప్రొఫెస‌ర్ రాజ‌శేఖ‌ర్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అయిన‌ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజ‌శేఖ‌ర్‌ను వీసీగా నియ‌మించింది. ఇలా ప్రొఫెస‌ర్ రాజ‌శేఖ‌ర్ నియామకం చుట్టూ వివాదాలే ఉన్నాయి. ఆయ‌న‌పై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మ‌రోవైపు నాటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వ హ‌యంలో మూడు రాజ‌ధానుల‌పై యూనివ‌ర్సిటీలో చ‌ర్చా వేదిక‌లు పెట్టించారు. దీంతో ఆయ‌న‌పై టీడీపీ శ్రేణులకు కోపం ఉంది. అందువ‌ల్లనే ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఏయూ వీసీ ప్రొఫెస‌ర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించారని, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ప్రచారం చేశార‌ని టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే వైసీపీ ఏజెంట్‌గా వ్యవ‌హ‌రించార‌ని టీడీపీ శ్రేణులు విమ‌ర్శిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు కూడా ఏయూను రాజ‌కీయ కేంద్రంగా మార్చార‌ని విమ‌ర్శించారు. వీసీ కార్యాల‌యాన్ని వైసీపీ కార్యాల‌యంగా మార్చార‌ని విమ‌ర్శించారు. అలాగే ఆయ‌న నియామకం నుంచి ఆయ‌న చుట్టూ కూడా వివాదాలే నెల‌కొన్నాయి. ఈ ర‌కంగా వీరిద్దరిపై టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు కోపంగా ఉన్నారు. ఒక‌టి వీరిద్దరు రాజీనామా అయినా చేయాలి, లేక‌పోతే రాష్ట్ర ప్రభుత్వమైనా వీరిని త‌ప్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వీరిని త‌ప్పించ‌డం అంత సులువు కాదు. ఎందుకంటే వీసీలను గవర్నర్ నియ‌మిస్తారు క‌నుక‌, త‌ప్పించాల్సి వ‌స్తే గ‌వ‌ర్నరే త‌ప్పించాలి. అంతేత‌ప్ప ప్రభుత్వం త‌ప్పించ‌లేదు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం