తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  It In Ap : విశాఖలో త్వరలో ఇన్ఫోసిస్.. 60 ఐటీ సంస్థల ఆసక్తి... మంత్రి అమర్నాథ్

IT in AP : విశాఖలో త్వరలో ఇన్ఫోసిస్.. 60 ఐటీ సంస్థల ఆసక్తి... మంత్రి అమర్నాథ్

HT Telugu Desk HT Telugu

21 January 2023, 19:58 IST

    • IT in AP : మరో రెండు నెలల్లో విశాఖ నగరం పరిపాలన రాజధానిగా మారుతుందని.. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. వైజాగ్ సిటీ ఐటీ హబ్ గా మారుతోందని.. త్వరలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభించనుందని తెలిపారు. మరో 60 సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని.... విశాఖ ఇన్ఫినిటి సమ్మిట్ 2023 లో పాల్గొన్న సందర్భంగా వివరించారు.
ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్
ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్

IT in AP : మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ నగరం పరిపాలన రాజధాని కాబోతోందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. వైజాగ్ సిటీని ఐటీ హబ్ గా చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం అని పునరుద్ఘాటించారు. విశాఖ ఇన్ఫినిటి సమ్మిట్ 2023 రెండోరోజు సదస్సులో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. అందిస్తోన్న ప్రోత్సాహకాలు, విశాఖ కేంద్రంగా ఐటీ సంస్థల స్థాపనకు ఉన్న అనుకూలతలను వివరించారు. బీచ్ ఐటీ డెస్టినేషన్ నినాదంతో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థలను ప్రభుత్వం విశాఖకు ఆహ్వానిస్తోందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

భారత దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదవ స్థానంలో ఉందన్నారు మంత్రి అమర్నాథ్‌. అతి త్వరలో విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. అదానీ డేటా సెంటర్ కూడా త్వరలో ఏర్పాటు కాబోతోందని వివరించారు. విప్రో వారితోకూడా సమావేశాలు జరగనున్నాయని... రాన్ స్టాంట్ లాంటి కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు మొదలు పెట్టాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని... మరో 60 సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి అమర్నాథ్ వివరించారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఆపిల్ తో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు.

హైదరాబాద్ ఐటీకి గమ్యస్థానంగా ఎదిగేందుకు 3 దశాబ్దాల సమయం పట్టిందన్న మంత్రి అమర్నాథ్.. విశాఖను అత్యంత వేగంగా ఐటీ డెస్టినేషన్ గా మార్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దేశంలోని టాప్ 10 నగరాల్లో ఒకటిగా ఉన్న విశాఖ నగరాన్ని ఐటీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వారే ఉన్నారని... ఐటీ పరంగా పుష్కలమైన మానవ వనరులు రాష్ట్రానికి ఉన్నాయని చెప్పారు.

ఇన్ఫినిటి వైజాగ్ సదస్సుకి మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సెయింట్, బాష్, టెక్ మహీంద్రా, సైబర్ సెక్యూరిటీ, ఐశాట్, తదితర 60 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 12 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. తొలి రోజు సమావేశాల్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు ఎలాంటి సాయం అవసరమైనా.. అందించేందుకు కేంద్రం ముందుంటుందని.. విస్తరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రెండోరోజు మంత్రి అమర్నాథ్ తోపాటు ప్రముఖ ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖలో పెట్టుబడులకు ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ ఎంతో ఉపయోగపడిందని ఐటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైజాగ్ ఆసియాలోనే డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.