తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Go Number 1 Issue : జీవో నంబర్ వన్ పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు...

GO Number 1 Issue : జీవో నంబర్ వన్ పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు...

HT Telugu Desk HT Telugu

24 January 2023, 16:50 IST

    • GO Number 1 Issue : జీవో నంబర్ వన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ అంశంలో పిటిషనర్లు, ప్రభుత్వం తరపున వాదనలు విన్న సీజే ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది.
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

GO Number 1 Issue : ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ అంశంలో పిటిషనర్లు, ప్రభుత్వం తరపున వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం... తీర్పుని రిజర్వ్ చేసింది. జీవో నంబర్ వన్ ను సవాలు చేస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఇదే అంశంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేయగా.. వాటిపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ముందుగా ఆయా పార్టీల తరపున న్యాయవాదులు ప్రభుత్వ ఉత్తర్వులపై తమ అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం... ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. వీటికి సమాధానంగా... పార్టీల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అందరి వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే.. జీవో నంబర్ వన్ తీసుకొచ్చిందని... విచారణలో భాగంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటికే సెక్షన్ 30 ప్రకారం.. పోలీసుల అనుమతి తీసుకొనే పార్టీలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయని.. ఈ ప్రక్రియ నిరంతరం సాగుతోందని చెప్పారు. అయితే.. ప్రత్యేకంగా మరో జీవో తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను నియంత్రించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ తరపు న్యాయవాది.. 2008లో ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. ఆనాడు చిరంజీవి చేపట్టిన సమావేశంలో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందారని.. దీంతో అప్పటి ప్రభుత్వం... పాదయాత్ర, బహిరంగ సమావేశాలు, ర్యాలీల కోసం విధి విధానాలు, నిబంధనలు రూపొందించిందని చెప్పారు. ఆ నివేదికను ఉమ్మడి హైకోర్టులో సమర్పించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ నివేదికలో ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నారని... అవి అమల్లో ఉండగా.. మళ్లీ కొత్త ఆంక్షలు విధిస్తూ జీవో తీసుకురావడం సరికాదని.. కాంగ్రెస్ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు.

అయితే... పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ర్యాలీలు, సమావేశాలకు సంబంధించిన ఏ అంశంలోనూ నిషేధం విధించలేదని... సెక్షన్ 30 లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే నియంత్రణకు ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం తరపున ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీల ర్యాలీలు, సమావేశాలను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది.

కాగా... ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై హైకోర్టు జనవరి 23 వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. అయితే.. జీవో నంబర్ 1 పై తాము జోక్యం చేసుకోలేమని... ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.