తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Directs Police Recruitment Board To Consider Home Guards As Special Category

AP Constable Recruitment :కానిస్టేబుల్ కొలువుల్లో హోంగార్డులకు ఊరట..

HT Telugu Desk HT Telugu

03 March 2023, 6:56 IST

    • AP Constable Recruitment ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ నియామక మండలి చేపట్టిన  కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ హైకోర్టు పోలీసు నియామక బోర్డును   ఆదేశించింది.  రిక్రూట్‌మెంట్‌లో తమకు అన్యాయం జరుగుతోందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

AP Constable Recruitment ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో హోంగార్డు అభ్యర్థులకు ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి, ప్రాథమిక రాతపరీక్ష మెరిట్‌ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును హై కోర్టు ఆదేశించింది.

కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులను ప్రత్యేకంగా గుర్తించాలంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌, డీజీపీలకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటరు దాఖలుచేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. పోలీసు కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించకపోవడాన్ని సవాలుచేస్తూ సీహెచ్‌ గోపి, మరో ముగ్గురు హోం గార్డులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీస్ నియామకాల్లో భాగంగా సాధారణ అభ్యర్థులతో సమానంగా తమకు కూడా కటాఫ్‌ మార్కులు నిర్ణయించడం సరికాదని పిటిషనర్లు వాదించారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించ లేదని తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించలేదని చెప్పారు. పిటీషనర్ల తరఫున న్యాయవాది జి.శీనకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కటాఫ్‌ మార్కుల విషయంలో సాధారణ అభ్యర్థులతో సమానంగా హోంగార్డులను పరిగణించడం వల్ల నష్టపోయారని వివరించారు. వారి వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం హోంగార్డులను ప్రత్యేక క్యాటగిరీగా గుర్తించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

రాత పరీక్ష సమాధానాలపై న్యాయపోరాటం….

కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో ఎనిమిది ప్రశ్నలకు జవాబులు సక్రమంగా నిర్ణయించలేదని ఆరోపిస్తూ 80 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థుల వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు నిర్ణయించే అంశాన్ని నిపుణుల కమిటీకి పంపేలా పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించాలని కోరారు. జవాబులపై తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్ధులు కోరారు.

తమను కూడా దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. గుంటూరు జిల్లాకు చెందిన జగం సహజతో పాటు మరో 79 మంది తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది.