తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Government Teachers Transfer Schedule Released

Teacher Transfers : ఏపీలో ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన్ సిగ్నల్…

HT Telugu Desk HT Telugu

10 December 2022, 11:13 IST

    • Teacher Transfers : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బదిలీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి  ఐదేళ్ల సర్వీసు, టీచర్లకు ఎనిమిదేళ్ల సర్వీసు ఉంటే బదిలీలకు అనుమతించనున్నారు. జీరో సర్వీసు ఉన్న వారిని కూడా బదిలీలకు అనుమతించనున్నారు. 
మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

Teacher Transfers ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలపై దాదాపు ఏడెనిమిది నెలలుగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే బదిలీలు చేపడతారని భావించినా రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించడానికి ప్రభుత్వం అమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీలపై వరుసగా సమావేశాలు నిర్వహించిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 12న ఉపాధ్యాయుల బదిలీలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జనవరిలోగా బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2020 అక్టోబర్‌లో వైసీపీ ప్రభుత్వం బదిలీలు నిర్వహించింది. 2021 జనవరి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. మళ్లీ బదిలీలు నిర్వహించాలా వద్దా అనే విషయాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఉద్యోగ సంఘాలు మాత్రం ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వానికి పలుమార్లు డిమాండ్ చేశాయి. దీంతో ఉపాధ్యాయ బదిలీలకు అమోదం తెలిపింది. జూన్‌ నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించినా ఆచరణలో మాత్రం చేయలేకపోయింది. గత ఆగష్టులో బదిలీ నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రచారం జరిగినా ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయింది.

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ బదిలీలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదేళ్ల సర్వీసు పూర్తైన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ చేస్తారు. ఎలాంటి సర్వీసు లేని వారికి కూడా బదిలీ అవకాశం కల్పించనున్నారు. జీరో సర్వస్‌ ఉపాధ్యాయుల్ని కూడా ఈ దఫా బదిలీల్లో అవకాశం కల్పిస్తారు. స్పాజ్ కేసులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర సర్వీస్ పాయింట్లు, పాఠశాల స్టేషన్ పాయింట్ల ఆధారంగా బదిలీలకు అవకాశం కల్పిస్తారు.

మరోవైపు ఏపీలో పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉండటంతో ఉపాధ్యాయుల్ని తాత్కలికంగా సర్దుబాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 3-10 తరగతులకు 6578 మంది ఉపాధ్యాయులు, 6-10 తరగతులకు 1350మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరమని గతంలో అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయనున్నారు. తగినంత మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోతే అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. స్కూళ్లను రేషనలైజ్ చేయడం ద్వారా మిగిలిపోయిన సెకండరీ గ్రేడ్ టీచర్లను అవసరమైన పాఠశాలలకు పంపాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 3,4,5 తరగతుల విద్యార్ధుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లను వాటికి బదిలీ చేశారు. తాజా బదిలీల్లో వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో గతంలో చేసిన అడ్జస్ట్‌మెంట్‌ కొనసాగుతుందో లేదోనని ఉత్కంఠ నెలకొంది. ఉపాధ్యాయుల బదిలీ పూర్తైన తర్వాత జిల్లా విద్యాధికారుల బదిలీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నాలుగు డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్త వారిని డిఈఓలుగా నియమించనున్నారు. మరోవైపు డిఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు కూడా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తైన తర్వాత చేపడతారు. బదిలీల్లో పోస్టింగులు పూర్తైన తర్వాత ఏర్పడే ఖాళీల ఆధారంగా 98 డిఎస్సీ అభ్యర్థులను పాఠశాలలకు కేటాయించనున్నారు.