Hydra Demolition : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా.. కూకట్‌పల్లి నల్లచెరువు ఏరియాలో భారీగా కూల్చివేతలు
Hydra Demolition : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. కూకట్‌పల్లి నల్లచెరువు ప్రాంతంలో భారీగా కూల్చివేతలు ప్రారంభించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. భారీగా పోలీసులు మోహరించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలకు చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఇటీవల సర్వే చేసి నోటీసులు ఇచ్చిన అధికారులు.. ఆదివారం ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. నల్ల చెరువు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను హైడ్రా కూల్చివేసింది.
16 నిర్మాణాలకు నోటీసులు..
నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఇటీవల 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. వాటిని కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు రెండు వారాల తర్వాత హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. నివాసం ఉన్న భవనాలు మినహా.. నిర్మాణంలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
7 ఎకరాలు కబ్జా..
హైదరాబాద్ నగరం పరిసరాల్లో మొత్తం మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. కూకట్‌పల్లి నల్ల చెరువులో ఎఫ్‌టీఎల్ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. నల్ల చెరువు విస్తీర్ణం మొత్తం 27 ఎకరాలు ఉండగా.. అందులో 7 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులు గుర్తించారు. బఫర్ జోన్‌లో 25 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఆక్రమణదారులకు హైడ్రా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అటు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ఏరియాలోని కృష్ణారెడ్డిపేటలోనూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
సంగారెడ్డి జిల్లాపై ఫుల్ ఫోకస్..
సంగారెడ్డి జిల్లాలోని చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెంచింది. జిల్లాలోని అమీన్‌పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా బృందం పరిశీలించింది. కృష్టారెడ్డిపేటలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 భవనాలను అధికారులు పరిశీలించారు. పూర్తి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.
పరిశీలించిన తర్వాతిరోజే..
అటు పటేల్‌గూడలోని సర్వే నంబర్ 12లో ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఐలాపూర్ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. భారీ అపార్ట్‌మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని శంభునికుంటలోనూ ఆక్రమణలను హైడ్రా బృందం పరిశీలించింది. చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల హద్దులను గుర్తించింది. హైడ్రా అధికారులు పరిశీలించిన తర్వాతి రోజే.. కూల్చివేత చర్యలు ప్రారంభమయ్యాయి.