Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో కుండపోత వర్షం, వాహనదారులకు తప్పని తిప్పలు
Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మరో గంట పాటు వర్ష సూచన ఉండడంతో జీహెచ్ఎంసీ ప్రజల్ని అలర్ట్ చేసింది. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
Hyderabad Heavy Rain :హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, నాచారం, ఉప్పల్, రామంతాపూర్, తార్నాక, మేడిపల్లి, కోఠి, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఎల్బీనగర్, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షానికి రోడ్డన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఐటీ కారిడార్‌తోపాటు సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా ట్రాఫిక్ జామ్
భారీ వర్షం దాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిస్తోంది. వర్షం ధాటికి రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్, అబిడ్స్, నారాయణగూడ, ముషీరాబాద్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, కంటోన్మెంట్, తార్నాక, నాగోల్, లక్డీ కపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ మరో గంట పాటు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా రోడ్లపై నీళ్లు చేరి ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. ప్రజలు బయటికి రావద్దంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బయటకు రావొద్దు
నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. అతి ముఖ్యమైన పని ఉంటేనే బయటకు రావాలన్నారు. బలమైన గాలులు, మెరుపులతో వర్షం కురుస్తున్నందున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే చర్యలు చేపడుతున్నారన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, చెరువులు, కుంటలు, నాలాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెం. 040-2111 1111, డీఆర్ఎఫ్ 9000113667 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. మాన్ హోల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్పపీడనం ఎఫెక్ట్
ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మరో ఆవర్తనం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సంబంధిత కథనం