హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, నాలాలను అక్రమించి నిర్మించిన పలు భవనాలను కూడా కూల్చివేసింది. మరికొన్నింటినికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని చెబుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో హైడ్రాపై లోతుగా చర్చ జరిగింది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి... ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించి ఉంటుంది.
హైడ్రా కు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్ కి కూడా ఇందులో చోటు కల్పించారు. హైడ్రాకు ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు వంటివి కూడా హైడ్రా కిందకే వచ్చాయి. ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా… చాలాచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి.
కొద్దిరోజుల కిందటే ఎంట్రీ ఇచ్చిన హైడ్రా... మొదటగా అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝలిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటిని పరిశీలిస్తోంది. గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది...? ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించే పని పెట్టుకుంది. ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవలే ప్రభుత్వానికి హైడ్రా ఓ నివేదికను కూడా సమర్పించింది. మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. జూన్ 27 నుంచి పలు నిర్మాణాలను తొలగించినట్లు వివరించింది. గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్‌లో 54 నిర్మాణాలు కూల్చగా… రాజేంద్రనగర్ 45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను తొలగించినట్లు ప్రస్తావించింది.
సంబంధిత కథనం