Bandi Sanjay : హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రామా, బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు- బండి సంజయ్
Bandi Sanjay : హైడ్రా పేరుతో కాంగ్రెస్ హైడ్రామా ఆడుతుంనది కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. పెద్దల అక్రమ కట్టడాలు కూల్చితే సమర్థించామని, పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోమన్నారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు.
Bandi Sanjay : హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా ఆడుతుందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆరు గ్యారెంటీలపై చర్చ జరగకుండా ఉండేందుకు హైడ్రాతో ప్రజల దృష్టిని మళ్లిస్తుందని విమర్శించారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. పెద్దలవి కూల్చిన పర్వాలేదు... కానీ పేదల ఇళ్లు కూల్చి ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
కరీంనగర్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి పాల్గొన్న బండి సంజయ్ కాంగ్రెస్ తీరు, బీఆర్ఎస్ వైఖరిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలయ్యిందని, అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రా పేరుతో డైవర్ట్ చేస్తూ హైడ్రామాలాడుతుందని విమర్శించారు. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించానని, కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తుండడం సరికాదన్నారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు. అక్రమ భవనాలకు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ దశమ గ్రహ యాగం చేయాలి
వర్షం వరదలతో జనం చస్తుంటే పట్టించుకోని కేసీఆర్.. బిడ్డ జైలు నుంచి రాగానే యాగాలు మొదలు పెట్టారని బండి సంజయ్ విమర్శించారు. నవగ్రహ యాగం చేస్తున్న కేసీఆర్, తెలంగాణకు పట్టిన పదో గ్రహమని ఆరోపించారు. కేసీఆర్ దశమ గ్రహ యాగం చేస్తే బాగుంటుందని వ్యంగ్యంగా విమర్శించారు. బీఆర్ఎస్ ఔట్ డేడ్ పార్టీ అని, రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని తెలిపారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. చేతనైతే వరదలవల్ల నష్టపోయిన వారి కోసం యాగాలు చేయాలని కోరారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎంతో మాట్లాడారని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అందుకే ప్రజలంతా ఆయనకు నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారని తెలిపారు.
సభ్యత్వంలో ప్రతిభ కనబర్చిన వారికే స్థానిక సంస్థల టికెట్
దేశం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు బండి సంజయ్. 18 కోట్ల సభ్యత్వ నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన బీజేపీ, ఈసారి మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించిందన్నారు. తెలంగాణలో 77 లక్షల మంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారని, వాళ్లందరినీ బీజేపీ సభ్యలుగా చేర్చాలిన అవసరం ఉందన్నారు. అదే విధంగా సభ్యత్వ నమోదులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అగ్రభాగాన ఉండాలి...అది జరగాలంటే ప్రతి పోలింగ్ బూత్ లోనూ అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేయాలని కోరారు. అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసిన పోలింగ్ బూత్ కమిటీలను తాను సన్మానిస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే... అత్యధికంగా బీజేపీ సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వం ఎవరు ఎక్కువ చేస్తే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తామని తెలిపారు. పోటీ చేసి గెలవాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశమన్నారు. పార్టీ కోసం పని చేసే వారికే టికెట్లు ఇస్తామని, ఈ విషయంలో నా దగ్గర పైరవీలు నడవవని స్పష్టం చేశారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు? ఎవరు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలోస్తున్నాయని తెలిపారు.
రిపోర్టింగ్: కేవీ రెడ్డి , ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం