Sangareddy Crime : సంగారెడ్డిలో విషాదం.. భార్యపై అనుమానంతో కట్టుకున్నవాడే కడతేర్చాడు!
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే చంపేశాడు. టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా.. గుండె నొప్పితో చనిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆఖరికి పోలీసులకు చిక్కాడు.
సంగారెడ్డి జిల్లా అందోల్‌కు చెందిన వెండికోలు నర్సింలుకు, మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామానికి చెందిన ఇందిర ( 32)తో 13 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. నర్సింలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో గ్యాస్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. నర్సింలుకు వివాహమై చాలాకాలం అయినా సంతానం కలగలేదు. దీంతో 4 సంవత్సరాల కిందట కూకట్‌పల్లికి చెందిన లలితను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. నర్సింలు కూకట్‌పల్లి ప్రాంతంలోనే మూడంతస్థుల సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. అక్కడే ఇద్దరు భార్యలు, తల్లి లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అదే ఇంట్లో మొదటి భార్య ఇందిరా కిరణాషాపు నడుపుతుంది. ఇందిరా కొన్ని రోజులుగా ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఆదివారం ఇందిరకు, నర్సింలుకు మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన నర్సింలు టవల్‌ని గొంతుకు బిగించి ఇందిరను చంపేశాడు. అనంతరం బావమరిదికి ఫోన్ చేసి 'గుండె నొప్పితో మీ అక్క మరణించింది' అని చెప్పాడు. ఇందిరా మృతదేహాన్ని సొంత గ్రామం అందోల్‌కు తీసుకొచ్చాడు.
గొంతు, ముఖంపై గాయాలు..
ఆందోల్‌కు చేరుకున్న ఇందిరా కుటుంబీకులు మృతదేహాన్ని పరీక్షించగా గొంతు, ముఖంపై గాయాలున్నట్లు గుర్తించారు. వెంటనే నర్సింలును గట్టిగా నిలదీయడంతో.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. జోగిపేట సీఐ, ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందుతుడు నర్సింలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కూతురిని భర్త నర్సింలు తోపాటు రెండో భార్య లలిత, అత్త లక్ష్మి కలిసి హత్యా చేశారని మృతురాలి తల్లి మొగులమ్మ ఆరోపిస్తున్నారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)