Samantha On Konda Surekha : నా విడాకుల్లో రాజకీయ ప్రమేయం లేదు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత
Samantha On Konda Surekha : హీరో నాగచైతన్య-సమంత విడాకులను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులు పరస్పర అంగీకారంతో జరిగాయన్నారు. ఎటువంటి రాజకీయ కుట్ర లేదన్నారు.
హీరో నాగ చైతన్య-సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను హీరో నాగార్జున ఖండించారు. సినీ ప్రముఖుల జీవితాలను రాజకీయాలకు వాడుకోవద్దని కోరారు. ఈ వివాదంపై నటి సమంత స్పందించారు.
"నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి....చాలా ధైర్యం, బలం కావాలి. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను" అని హీరోయిన్ సమంత సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు.
హీరో నాగార్జున స్పందన
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగ చైతన్య సైతం స్పందించారు. తన తండ్రి ట్విట్టర్ లో పోస్టు చేసిన పోస్టును రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై హీరో నాగార్జున స్పందించారు. "మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను" - అని హీరో నాగార్జున ట్వీట్ చేశారు.
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె… చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
"కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాడు. నాగచైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లడానికి కూడా కారణం కేటీఆర్. ఈ విషయం అందరికీ తెలుసు" అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
సింగర్ చిన్మయి ఏమన్నారంటే
దురదృష్టవశాత్తూ అనేక మంది వ్యక్తులు, తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లు, మీడియా వ్యక్తులు తమ సొంత మైలేజ్, ఎజెండా కోసం, క్లిక్స్ , వ్యూస్ ద్వారా డబ్బు సంపాదించడం కోసం సమంత పేరును ఉపయోగించడం చాలా బాధాకరమని సింగర్ చిన్మయి అన్నారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి సమంత పేరు వాడడం సరికాదన్నారు. నెటిజన్లను ఆకర్షించడానికి వీళ్లందరికీ ఆమె పేరు కావాలన్నారు. కలలో కూడా ఆమెను వీళ్లు అందుకోలేరని చిన్మయి అన్నారు. వీళ్ల కర్మకాలిపోవడానికి నవరాత్రిని మించిన మంచి సమయం మరొకటి లేదన్నారు.
"తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై ప్రత్యేకించి సమంతపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖపై బీఆర్ఎస్ అనుయాయులు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన కొండా సురేఖ అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది. మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం ఆ పని మహిళే చేయటం మరింత బాధిస్తోంది" - సినీ నటి ఆర్కే రోజా
సంబంధిత కథనం