Rahul Gandhi Disqualification: బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి - సీఎం కేసీఆర్
CM KCR On Rahul Gandhi's Disqualification: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హత వేటుపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ చీకటిరోజుగా అభివర్ణించారు.
CM KCR On Rahul Gandhi's Disqualification Issue: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం సంచలనంగా మారింది. బీజేపీ టార్గెట్ గా ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రధానమంత్రి మోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
"భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బిజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి" అంటూ ఓ ప్రకటనలో కేసీఆర్ పిలుపునిచ్చారు.
రాహుల్ పై వేటు.. ఏం జరిగిందంటే…?
పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు పడింది. ఫలితంగా.. రాహుల్ గాంధీ తన వయనాడ్ సీటును కోల్పోయారు. లోక్‌సభ సెక్రటేరియట్.. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్‌కు అతిపెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.
"వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నాము. పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే ఇందుకు కారణం. ఆయన దోషిగా తేలిన రోజు.. అంటే 2023 మార్చ్ 23 నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు అమల్లోకి వస్తుంది. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్టికల్ 102 (1)(ఈ) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాము," అని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటనలో పేర్కొంది.
Rahul Gandhi latest news : 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్ గాంధీ. కోలర్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో.. 2019లో గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది.
ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్‌లోని జిల్లా కోర్టు. రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల బెయిల్‌తో పాటు తీర్పును సవాలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది.
రాహుల్ గాంధీకి శిక్షపడటం, అనర్హత వేటుకు గురవడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. కాగా.. రాహుల్ గాంధీపై వచ్చిన తీర్పును ఎగువ కోర్టులో కాంగ్రెస్ సవాలు చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా సానుకూలంగా తీర్పు రాకపోతే.. సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు ఘాటుగా స్పందిస్తున్నాయి. రాహుల్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. బీజేపీ అధికార దురంహంకారానికి పరాకాష్ట అంటూ మండిపడుతున్నాయి.
సంబంధిత కథనం