KiranKumar Reddy : కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి.. కమలం గూటికేనా ?
KiranKumar Reddy : కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ పంపారు. ఆయన బీజేపీలో చేరతరానే ప్రచారం జరుగుతోంది.
KiranKumar Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ఈ మాజీ సీఎం.. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. కొంతకాలంగా పాలిటిక్స్ కి దూరంగా ఉంటోన్న ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోన్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పెద్దలు ఆయనతో మాట్లాడారని.. పార్టీలోకి ఆహ్వానించారనే టాక్ నడుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి కమలం పార్టీలో చేరితో... ఏపీ లేదా జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి... 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ... కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పేరిట సొంత పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లోనే పోటీ చేసినా... ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆయన 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి హస్తం కండువా కప్పుకున్నారు. అన్నీ కుదిరితే ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారని జోరుగా చర్చ నడిచింది. అయితే అనూహ్యంగా ఆయన అడుగులు బీజేపీ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది. కమలం పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపారని... ఢిల్లీ నుంచి స్పష్టమైన హామీ లభించాకే ముందడుగు వేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరితో... కమలం పార్టీ పెద్దలు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగా మారింది. ఏపీ రాజకీయాల కోసం అయితే.. రాయలసీమకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయన భుజాలపై వేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండటం.. ఇక ఏడాదే తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో... తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. అయితే.. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. సీఎంగా ఉండి... తెలంగాణకు నిధుల కేటాయింపుపై చేసిన వ్యాఖ్యలు... లాస్ట్ బాల్ కి సిక్స్ కొడతా... విభజనను ఆపుతా అంటూ చేసిన స్టేట్ మెంట్స్ పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.... ఒక వేళ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరితే.. కమలం పెద్దలు ఆయనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.