Delhi Liquor Scam Case: శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్
Delhi Liquor Scam Case Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డికి ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Bail Granted to Sarath Chandra Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. శరత్‌చంద్రారెడ్డి నానమ్మ అంత్యక్రియల దృష్ట్యా బెయిల్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈడీ రిపోర్టులో కీలక విషయాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు చెందిన మూడు కంపెనీల ద్వారా 64 కోట్లకు పైగా ఇప్పటికే అక్రమంగా సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 60కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించినట్లు విచారణలో బయటపడినట్లు తెలిపింది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసేందుకు .. డిజిటల్ సర్వర్లలోని సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. ట్రైడెంట్ ఛాంపర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్గనోమిక్స్ ఎకోసిస్టమ్స్, శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా శరత్ నేరుగా కార్యకలాపాలు జరిపినట్లు ఈడీ వెల్లడించిన రిపోర్టులో చెప్పుకొచ్చింది.
ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30శాతం దుకాణాలను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారని ఈడీ ఆరోపించింది. బినామీ కంపెనీలతో కలిసి 9జోన్లలో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అభియోగాలు మోపింది. శరత్ భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ సిండికేట్ రూ.100కోట్ల లంచాలను చెల్లించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి గతంలో జగన్ ఆస్తుల కేసుల్లో కూడా సహనిందితుడిగా అభియోగాలను ఎదుర్కొన్నారు. అరబిందో గ్రూప్ డైరెక్టర్లుగా ఉన్న రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ఉన్నారు. ట్రైడెంట్ కెమ్‌ఫర్ సంస్థలో రోహిత్ రెడ్డి కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండు జోన్లకు మించి మద్యం వ్యాపారం చేయకూడదనే నిబంధన ఉన్నా శరత్ చంద్రారెడ్డి 30శాతం వ్యాపారాన్ని బినామీ కంపెనీల ద్వారా నియంత్రించారని ఈడీ ఆరోపించింది. శరత్ డైరెక్టర్‌గా ఉన్న ట్రైడెంట్ కెమ్‌ఫర్ ప్రైవేట్ లిమిటెడ్, బినామీ సంస్థలుగా ఉన్న ఆగ్రానోమిక్స్ ఎకో సిస్టమ్స్, శ్రీ ఆవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా ఐదు జోన్లలో మద్యం వ్యాపారాన్ని నియంత్రిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
తన సొంత పెట్టుబడుల ద్వారా శరత్ చంద్రారెడ్డి వీటిని నియంత్రిస్తున్నారని ఈడీ అభియోగాల్లో పేర్కొంది. మద్యం తయారీదారులు, టోకు వ్యాపారులు, చిల్లర వ్యాపారులతో కలిసి సౌత్ గ్రూప్ పేరుతో ఏర్పాటైన మద్యం సిండికేట్‌లో శరత్ చంద్రారెడ్డి అతిపెద్ద భాగస్వామిగా ఉన్నారు. ఈ సిండికేట్‌లో మద్యం తయారీ వ్యాపారంలో ఉన్న సమీర్ మహీంద్రుతో పాటు దేశంలో అతిపెద్ద మద్యం తయారీ సంస్థ పెర్నాడ్ రికార్డ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నాయి. ఇండో స్పిరిట్స్ సంస్థను హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గా పిఆర్‌ఐ నియమించినట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ సంస్థలో సమీర్ మహీంద్రూ, అరుణ్ పిళ్లై, ప్రేమ రాహుల్ మండూరిలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ సంస్థల్లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టి నడిపిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
ఈ చెల్లింపులకు అవసరమైన నగదును రిటైల్ జోన్లు, ఇండో స్పిరిట్స్ నుంచి సేకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు ప్రాంభమయ్యాక సర్వర్లను ధ్వంసం చేయడం, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు. ఆవంతిక, ట్రైడెంట్ సంస్థలకు చెందిన రెండు రిటైల్ జోన్లకు సంబంధించిన సమాచారం సర్వర్ల నుంచి సేకరించారు. శరత్ ఆదేశాలతోనే కంప్యూటర్ సర్వర్లను తమ కార్యాలయాల నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించారని ఈడీ ఆరోపించింది. లిక్కర్ స్కాంలో ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.2631 కోట్ల రుపాయల నష్టం వాటిల్లినట్లు ఈడీ ఆరోపించింది. ఇప్పటి వరకు 169 సోదాల ద్వారా భారీగా డిజిటల్, ఫిజికల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. దర్యాప్తునకు సహకరించనందునే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపిన సంగతి తెలిసిందే.