Delhi Liquor Scam : లిక్కర్‌ స్కాంలో కింగ్ పిన్‌ శరత్ చంద్రారెడ్డి…ఈడీ రిపోర్ట్-ed remand report says arabindo sarath chandra reddy is master mind in delhi liquor scam ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Liquor Scam : లిక్కర్‌ స్కాంలో కింగ్ పిన్‌ శరత్ చంద్రారెడ్డి…ఈడీ రిపోర్ట్

Delhi Liquor Scam : లిక్కర్‌ స్కాంలో కింగ్ పిన్‌ శరత్ చంద్రారెడ్డి…ఈడీ రిపోర్ట్

HT Telugu Desk HT Telugu
Nov 11, 2022 08:30 AM IST

Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సొంత సోదరుడిని మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీ ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నా అరబిందో శరత్ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం సిండికేట్లకు శరత్ చంద్రారెడ్డి సారథ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించడం కలకలం రేపింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఖజానాకు రూ.2631 కోట్ల రుపాయల నష్టం వాటిల్లినట్లు ఈడీ ఆరోపించింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దర్యాప్తులో దూకుడు
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దర్యాప్తులో దూకుడు (HT_PRINT)

Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో ఏపీలో రాజకీయ కలకలం రేగింది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డి అన్నను ఈడీ అరెస్ట్ చేసింది. అరబిందో గ్రూప్‌ సంస్థల డైరెక్టర్‌గా ఉన్న శరత్‌ చంద్రారెడ్డితో పాటు పెర్నాడ్ రికార్డ్ కంపెనీకి చెందిన బినోయ్ బాబును అరెస్ట్ చేసింది. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే అభియోగాలపై వారిని అరెస్ట్ ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి కీలక వ్యక్తి అని ఈడీ రిమాండ్‌లో అభియోగాలను మోపింది.

ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30శాతం దుకాణాలను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారని ఈడీ ఆరోపించింది. బినామీ కంపెనీలతో కలిసి 9జోన్లలో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అభియోగాలు మోపింది. శరత్‌ భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ సిండికేట్ రూ.100కోట్ల లంచాలను చెల్లించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది.

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌ రెడ్డి సోదరుడైన శరత్‌ చంద్రారెడ్డి గతంలో జగన్ ఆస్తుల కేసుల్లో కూడా సహనిందితుడిగా అభియోగాలను ఎదుర్కొన్నారు. అరబిందో గ్రూప్ డైరెక్టర్లుగా ఉన్న రోహిత్‌ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ఉన్నారు. ట్రైడెంట్ కెమ్‌ఫర్ సంస్థలో రోహిత్ రెడ్డి కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండు జోన్లకు మించి మద్యం వ్యాపారం చేయకూడదనే నిబంధన ఉన్నా శరత్ చంద్రారెడ్డి 30శాతం వ్యాపారాన్ని బినామీ కంపెనీల ద్వారా నియంత్రించారని ఈడీ ఆరోపించింది. శరత్ డైరెక్టర్‌గా ఉన్న ట్రైడెంట్ కెమ్‌ఫర్‌ ప్రైవేట్ లిమిటెడ్, బినామీ సంస్థలుగా ఉన్న ఆగ్రానోమిక్స్‌ ఎకో సిస్టమ్స్‌, శ్రీ ఆవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా ఐదు జోన్లలో మద్యం వ్యాపారాన్ని నియంత్రిస్తున్నారని ఈడీ ఆరోపించింది.

తన సొంత పెట్టుబడుల ద్వారా శరత్ చంద్రారెడ్డి వీటిని నియంత్రిస్తున్నారని ఈడీ అభియోగాల్లో పేర్కొంది. మద్యం తయారీదారులు, టోకు వ్యాపారులు, చిల్లర వ్యాపారులతో కలిసి సౌత్ గ్రూప్‌ పేరుతో ఏర్పాటైన మద్యం సిండికేట్‌లో శరత్‌ చంద్రారెడ్డి అతిపెద్ద భాగస్వామిగా ఉన్నారు. ఈ సిండికేట్‌లో మద్యం తయారీ వ్యాపారంలో ఉన్న సమీర్‌ మహీంద్రుతో పాటు దేశంలో అతిపెద్ద మద్యం తయారీ సంస్థ పెర్నాడ్ రికార్డ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నాయి. ఇండో స్పిరిట్స్‌ సంస్థను హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గా పిఆర్‌ఐ నియమించినట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌ సంస్థలో సమీర్ మహీంద్రూ, అరుణ్‌ పిళ్లై, ప్రేమ రాహుల్ మండూరిలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ సంస్థల్లో శరత్‌ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టి నడిపిస్తున్నారని ఈడీ ఆరోపించింది.

శరత్ చంద్రారెడ్డి నిర్వహిస్తున్న సౌత్ గ్రూప్ బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్ జోన్లను తన ఆధీనంలో ఉంచుకుని మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. మూడు కంపెనీల ద్వారా 5 జోన్లలో నేరుగా వ్యాపారాన్ని నడిపిస్తుండగా మరో నాలుగు జోన్లలో బినామీలతో మద్యం వ్యాపారాన్ని నడుపుతున్నారని ఈడీ ఆరోపించింది. అక్రమ పద్ధతుల్లో మద్యం వ్యాపారాన్ని నిర్దేశించడం ద్వారా ఢిల్లీలో 30శాతం మద్యం వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారని అభియోగాల్లో పేర్కొన్నారు. ఇలా వ్యాపారం చేయడం కోసం విజయ్ నాయర్‌ ద్వారా రూ.100కోట్ల రుపాయల్ని ముడుపులుగా చెల్లించినట్లు గుర్తించారు.

ఈ చెల్లింపులకు అవసరమైన నగదును రిటైల్ జోన్లు, ఇండో స్పిరిట్స్‌ నుంచి సేకరించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దర్యాప్తు ప్రాంభమయ్యాక సర్వర్లను ధ్వంసం చేయడం, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు. ఆవంతిక, ట్రైడెంట్ సంస్థలకు చెందిన రెండు రిటైల్ జోన్లకు సంబంధించిన సమాచారం సర్వర్ల నుంచి సేకరించారు. శరత్ ఆదేశాలతోనే కంప్యూటర్ సర్వర్లను తమ కార్యాలయాల నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించారని ఈడీ ఆరోపించింది. ట్రైడెంట్ మినహా మిగిలిన సంస్థలతో తనకు సంబంధం లేదని శరత్ చంద్రారెడ్డి చెప్పినా కంప్యూటర్ల విశ్లేషణలో వాటి మధ్య సంబంధాలు బయటపడ్డాయని ఈడీ స్పష్టం చేసింది.

169 చోట్ల సోదాలు….. 140 సెల్‌ఫోన్లు ధ్వంసం…..

లిక్కర్‌ స్కాంలో ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.2631 కోట్ల రుపాయల నష్టం వాటిల్లినట్లు ఈడీ ఆరోపించింది. ఇప్పటి వరకు 169 సోదాల ద్వారా భారీగా డిజిటల్, ఫిజికల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తు కోసం శరత్ చంద్రారెడ్డి ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరడంతో వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను చెరిపివేయడానికి రూ.1.20 కోట్ల రుపాయల విలువైన 140ఫోన్లను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితులు, బడా మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు, ఢిల్లీ ఎక్సైజ్ మంత్రితో పాటు ఇతర అనుమానితులు ఉన్నారని ఆరోపించింది. 34మంది వ్యక్తులకు చెందిన సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించారని ఈడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది

IPL_Entry_Point