First Period: ఆడపిల్లలు పదహారేళ్లు దాటినా రజస్వల కాకపోతే ఏం చేయాలి? ఇది ప్రమాదకరమైన సమస్యా?
First Period: ఆడపిల్లలకు 12 ఏళ్ళు వస్తే చాలు... మొదటి పీరియడ్స్ మొదలైపోతాయి. దీన్ని రజస్వల అంటారు. రజస్వల కాకపోతే ఆడపిల్లల జీవితంలో వచ్చే మార్పులు ఏంటో చూద్దాం.
First Period: ఆడపిల్లలకు ఒకప్పుడు పన్నేండేళ్లు దాటితే చాలు... ఎప్పుడు రజస్వల అవుతారా అని ఇంట్లో వారు ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వయసు 10 ఏళ్లకే వచ్చేసింది. కొంతమంది ఆడపిల్లలు తొమ్మిదేళ్లకే మొదటి పీరియడ్స్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా ఆడపిల్లలు పదహారేళ్ళ లోపు రజస్వలవుతారు. అప్పటినుంచి మెనోపాజ్ వచ్చే వరకు వారికి ప్రతినెలా పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. అయితే కొంతమంది ఆడపిల్లలకు 16 ఏళ్ళు నిండినా కూడా మొదటి పీరియడ్స్ కనిపించవు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు.
మొదటి పీరియడ్స్ ఎప్పుడు?
జీవితంలో పీరియడ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సాధారణంగా 12 నుంచి 16 ఏళ్ల లోపు ఇవి కచ్చితంగా రావాలి. ఒకవేళ 16 ఏళ్లు దాటినా పీరియడ్స్ రాలేదంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొన్ని రకాల పరీక్షల ద్వారా వారికి ఎందుకు పీరియడ్స్ రాలేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వైద్యులు. హార్మోన్ల లోపం వల్ల, థైరాయిడ్ సమస్యలు, జన్యుపరమైన సమస్యలు, అండాశయాలు లేకపోవడం, గర్భాశయం లేకపోవడం వంటి అనేక కారణాలవల్ల పీరియడ్స్ సరైన సమయంలో రాకపోవచ్చు.
కొన్ని రకాల సమస్యలకు చికిత్సలు ఉన్నాయి. పుట్టుకతో వచ్చిన లోపాలకు, జన్యుపరమైన వాటికి మాత్రం చికిత్స ఉండదు. పుట్టుకతోనే కొందరికి గర్భాశయం లేకపోవడం వంటివి జరుగుతాయి. అలాంటి వాటికి చికిత్స ఇంతవరకు కనిపెట్టలేదు .
ఆడపిల్లలకు పీరియడ్స్ రాకుండా బరువు పెరిగిపోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్లు అసమతుల్యత వల్ల పీరియడ్స్ రాకపోవచ్చు. కాబట్టి మీ పిల్లల్లో సరైన వయసులో పీరియడ్స్ రాకపోతే దాన్ని తేలికగా తీసుకోకండి వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేపించండి.
టర్నర్ సిండ్రోమ్
పీరియడ్స్ రాకుండా అడ్డుకునే మరో కారణం టర్నర్ సిండ్రోమ్. ఇది కొంతమంది మహిళల్లో ఉండే వ్యాధి. సాధారణంగా మహిళల్లో XX అని రెండు క్రోమోజోములు ఉంటాయి. అయితే టర్నర్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల్లో మాత్రం రెండు X క్రోమోజోములకు బదులుగా ఒకే ఒక్క X క్రోమోజోమ్ ఉంటుంది. దీని వల్ల వారి శారీరక పెరుగుదల సరిగా ఉండదు. హార్మోనల్ సమస్యలు ఉంటాయి. పీరియడ్స్ రాకపోవడం వచ్చినా చాలా ఆలస్యంగా రావడం జరుగుతూ ఉంటాయి.
వీరు చూడడానికి కూడా కాస్త భిన్నంగా ఉంటారు. వయసుకు తగ్గ ఎత్తు వీరిలో ఉండదు. మెడ పొడవుగా ఉంటుంది. చెవులు చిన్నగా ఉంటాయి. రొమ్ములు పెద్దవిగా పెరుగుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి ఆ సిండ్రోమ్ ఉందో లేదో వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆధునిక ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దీనివల్ల కూడా ఆడపిల్లల్లో పీరియడ్స్ త్వరగా రావడం లేదా చాలా ఆలస్యంగా రావడం వంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఆడపిల్లలకు పెట్టే ఆహారం పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
టాపిక్