Periods: ప్రతినెలా పీరియడ్స్ రాకపోతే తేలికగా తీసుకోకండి, ఈ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం
Periods: ప్రతినెలా పీరియడ్స్ వస్తేనే ఆ మహిళ ఆరోగ్యంగా ఉన్నట్టు. లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.
Periods: ప్రతినెలా నెలసరి కావడం అనేది మహిళా ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి ఒక సంకేతం. ముఖ్యంగా ఆమె పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచించేవి నెలసరులే. కొంతమందికి రెండు మూడు నెలలకి ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. వీటిని క్రమ రహిత పీరియడ్స్ అంటారు. ఇలా పీరియడ్స్ రావడం మంచిది కాదు. ప్రతి నెలా తప్పనిసరిగా నెలసరి కావాల్సిందే. లేకపోతే పునరుత్పత్తి వ్యవస్థలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా పీరియడ్స్ ప్రతినెలా రాకపోవడానికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణం అవుతాయి.
సాధారణంగా ఆడపిల్లలు పదేళ్ల నుంచి పదహారేళ్ల లోపు తొలిసారి రజస్వలా అవుతారు. నెలసరి మొదలైన రెండు మూడేళ్ల వరకు పీరియడ్స్ కొంతమందిలో సక్రమంగా రావు. దానికి కారణం నెలసరినే నియంత్రించే హైపోథాలమిక్ పిట్యూటరీ ఓవేరియన్ గ్రంథి పరిణతి చెందడానికి సమయం పట్టడమే. పద్దెనిమిదేళ్లు దాటాక మాత్రం కచ్చితంగా నెలసరి ప్రతినెలా రావాల్సిందే. అలా రాకపోతే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలి.
హార్మోన్ల అసమతుల్యత
హార్మోన్ల అసమతుల్యత అనేది వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి వల్ల కూడా ఈ హార్మోన్ల అసమతుల్యత రావచ్చు. గర్భాశయ లైనింగ్‌ను నియంత్రించే ప్రొజెస్టరాన్ లేదా ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
దీన్ని PCOS అంటారు. అండాశయంలో అధిక సంఖ్యలో ఆండ్రోజన్లు ఉత్పత్తి అయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఆండ్రోజెన్లు అనేవి మగ హార్మోనులు. అండాశయంలో చిన్న తిత్తుల్లాగా ఏర్పడతాయి. ఇవి అండోత్సర్గము జరగకుండా అడ్డుకుంటాయి. అండోత్సరము జరగకపోవడం వల్ల పీరియడ్స్ రావు.
ఒత్తిడి
బరువు ఒకేసారి పెరగడం లేదా హఠాత్తుగా తగ్గడం, ఆహారాన్ని అధికంగా తినడం వంటి జీవనశైలి మార్పుల వల్ల కూడా పీరియడ్స్ క్రమ రహితంగా మారుతాయి. శారీరక శ్రమ అధికంగా పడినా, ప్రయాణాలు చేస్తున్నా, అనారోగ్యంగా ఉన్నా, మానసిక ఒత్తిడి బారిన పడినా కూడా అవి పీరియడ్స్ ను ప్రభావితం చేస్తాయి.
ఫైబ్రాయిడ్లు
గర్భాశయ గోడ లోపల పెరిగే కణితులు ఫైబ్రాయిడ్లు. ఇవి ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. వీటి పరిమాణం ఆపిల్ గింజ నుండి ద్రాక్ష పండు వరకు ఎదుగుతాయి. ఇవి ప్రాణాలు తీసే అంత ప్రమాదకరం కానప్పటికీ, ఈ ఫైబ్రాయిడ్లు ఉంటే పీరియడ్స్ రాకపోవడం లేదా అధికంగా రక్తస్రావం కావడం వంటివి జరుగుతాయి.
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌ను PID అని పిలుస్తారు. ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తుంది. అలాగే లైంగిక సంపర్కం సమయంలో ఆ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది గర్భాశయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ కలిగి పొత్తికడుపు నొప్పి, జ్వరం వంటివి వస్తాయి. అలాగే పీరియడ్స్ కూడా క్రమరహితంగా మారుతాయి.
నెలసరి ప్రతినెలా రాకుండా రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చినట్లయితే పైన చెప్పిన సమస్యల్లో ఏదో ఒకటి దానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
టాపిక్