Spicy oats pancake: స్పైసీ ఓట్స్ పాన్‌కేక్ రెసిపీ, బరువు తగ్గడానికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్-spicy oats pancake recipe in telugu best breakfast recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Oats Pancake: స్పైసీ ఓట్స్ పాన్‌కేక్ రెసిపీ, బరువు తగ్గడానికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

Spicy oats pancake: స్పైసీ ఓట్స్ పాన్‌కేక్ రెసిపీ, బరువు తగ్గడానికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

Haritha Chappa HT Telugu
Feb 07, 2024 06:00 AM IST

Spicy oats pancake: బరువు తగ్గాలనుకున్నవారు ఓట్స్ తో చేసే ఆహారాలను అధికంగా తింటారు. ఎప్పుడు ఒకేలాంటి ఓట్స్ బ్రేక్ ఫాస్ట్‌లు బోర్ కొడితే ఒకసారి స్పైసీగా ఓట్స్ పాన్ కేక్ వండుకోండి. ఇది రుచిగా ఉంటుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడా.

ఓట్స్ పాన్ కేక్ రెసిపీ
ఓట్స్ పాన్ కేక్ రెసిపీ (pixabay)

Spicy oats pancake: స్పైసీ ఓట్స్ పాన్ కేక్ రెసిపీ అల్పాహారానికి బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిలో ఓట్స్, కూరగాయలు ఉంటాయి. కాబట్టి అల్పాహారంలో దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది మంచి బ్రేక్ ఫాస్ట్. దీని చేయడం కూడా చాలా సులువు. స్పైసీ ఓట్స్ పాన్ కేక్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

స్పైసీ ఓట్స్ పాన్ కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఓట్స్ - ఒక కప్పు

గోధుమపిండి - అర కప్పు

మజ్జిగ - అరకప్పు

గుడ్డు - ఒకటి

ఉల్లిపాయలు - ఒకటి

క్యారెట్ - ఒకటి

క్యాప్సికం - ఒకటి

బేకింగ్ పౌడర్ - ఒక స్పూను

బేకింగ్ సోడా - అర స్పూన్

ఉప్పు- రుచికి సరిపడా

జీలకర్ర పొడి - అర స్పూను

పచ్చిమిర్చి - రెండు

నూనె -వేయించడానికి సరిపడా

స్పైసీ ఓట్స్ పాన్ కేక్ రెసిపీ

1. ముందుగా ఓట్స్ ని పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

2. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి కొట్టాలి.

3. ఒక గిన్నెలో ఈ ఓట్స్ పిండిని వేయాలి.

4. అందులోనే గోధుమపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం తరుగు, క్యారెట్ తరుగు వేసి బాగా కలపాలి.

5. ఇప్పుడు మజ్జిగను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

6. గుడ్డును పగలగొట్టివేసి బాగా కలుపుకోవాలి. మీకు గుడ్డు వేసుకోవడం ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు.

7. దీన్ని బాగా కలిపాక అవసరమైతే నీళ్లు పోసుకోవాలి. లేకుంటే అలానే పాన్ కేక్ వేసుకోవాలి.

8. స్టవ్ మీద కళాయి పెట్టి లేదా పెనం పెట్టి నూనె వేయాలి.

9. ఈ మిశ్రమాన్ని కాస్త మందంగా ఊతప్పాల్లా వేసుకోవాలి.

10. రెండు వైపులా బంగారు రంగులోకి మారేవరకు కాల్చుకోవాలి.

11. అంతే స్పైసి ఓట్స్ పాన్ కేక్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

12. మీకు మరింత స్పైసీగా తినాలనిపిస్తే పచ్చిమిర్చి తరుగును ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.

ఓట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఓట్స్ తినడం వల్ల గుండెకు ఎంతో ఆరోగ్యం. పిల్లలు, పెద్దలు అందరూ ప్రతిరోజూ ఓట్స్ తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. ఓట్స్ వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరదు. కాబట్టి గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిరోజూ అల్పాహారంలో ఓట్స్ ను ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహం బారిన పడినవారు తినడం అలవాటు చేసుకుంటే వారికి ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఓట్స్ ఎవరు తిన్నా ఆరోగ్యమే. మసాలా ఓట్స్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా బ్రేక్ ఫాస్ట్ లతో పోలిస్తే దీని రుచి కాస్త తక్కువే అయినా ఆరోగ్యపరంగా మాత్రం ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి.

Whats_app_banner