Marburg Virus Symptoms : గబ్బిలాల నుంచి మార్బర్గ్ వైరస్, లక్షణాలు ఎలా ఉంటాయి?
Marburg Virus : కరోనా వ్యాధితో ప్రపంచం అల్లకల్లోలమైంది. వైరస్ అనే మాట వింటేనే ప్రజలు వణికే పరిస్థితి ఉంది. అయితే ఈక్వటోరియల్ గినియాలో ఎబోలా మాదిరి ప్రాణాంతకమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దీనిద్వారా మరణాలు సంభవిస్తున్నాయి.
ఎబోలా లాంటి మార్బర్గ్ వైరస్(Marburg Virus) గినియాలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఈ నెల ప్రారంభంలో గినియాలోని ఈక్వటోరియల్ ప్రాంతంలో (ఒక చిన్న పశ్చిమ ఆఫ్రికా దేశం) మార్బర్గ్ వైరస్ కారణంగా కనీసం 9 మంది మరణించారు. అదే ప్రాంతంలో వైరస్‌తో సంబంధం ఉన్న మరో 16 కేసులు బయటపడ్డాయి. తర్వాత పరిస్థితిని గ్రహించి, UN ఆరోగ్య సంస్థ అంటువ్యాధిని నిర్ధారించింది.
ఇది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తుల శారీరక ద్రవాలు లేదా బెడ్‌షీట్‌ల వంటి వాటి నుంచి వ్యక్తుల మధ్య వ్యాపిస్తుంది. మార్బర్గ్ రక్తస్రావ జ్వరంలా అనిపిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది ఎబోలా వైరస్ లాగే.. సంక్రమించే RNA వైరస్ ద్వారా పుట్టింది. ఈ వైరస్ చరిత్రను పరిశీలిస్తే, జర్మనీ, సెర్బియాలోని బెల్‌గ్రేడ్ ల్యాబ్‌లలో 1967లో మొదటిసారిగా గుర్తించారు. నివేదికల ప్రకారం, కోతులపై పరిశోధన చేస్తున్నప్పుడు ఈ వైరస్ బారిన పడి 7 మంది మరణించారు.
ప్రతి వైరస్(Virus).. ప్రత్యేక సంకేతాలు, లక్షణాలతో వస్తుంది. మార్బర్గ్ వైరస్ ఇన్ఫెక్షన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రోగులలో ప్రస్తుతం గమనించిన లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, చలి, అనారోగ్యం. కొంతమంది రోగులు వికారం, కామెర్లు, కడుపు నొప్పి, అతిసారం వంటి లక్షణాలను కూడా అనుభవించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(world health organization) తెలియజేసింది. కండరాల తిమ్మిరి, వెన్నునొప్పి, కండరాల నొప్పులు కూడా ఈ వైరస్ కు సంబంధించి కొన్ని సాధారణ లక్షణాలు.
వైరస్ వచ్చాక ఐదో రోజు ఛాతీ, వీపు లేదా కడుపుపై దురద లేని దద్దుర్లు కనిపించవచ్చని CDC తెలియజేసింది. చాలా మంది రోగులు అనారోగ్యానికి గురైన ఏడు రోజులలో తీవ్రమైన రక్తస్రావ లక్షణాలు కలిగి ఉంటారు. ఇది ఆకస్మిక లక్షణాలకు దారి తీస్తుంది. వాటిలో కొన్ని టైఫాయిడ్, మలేరియా మాదిరిగా ఉంటాయి. ప్రారంభంలో గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఈ లక్షణాలలో ఏవైనా కనిపించినప్పుడు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు(Health Experts) అంటున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని సందర్భాలలో రోగి మరణానికి కూడా కారణం కావచ్చు. ఇది ప్రాథమికంగా వ్యాధి లక్షణాలు కనిపించిన ఎనిమిది మరియు తొమ్మిది రోజుల మధ్య జరుగుతుంది. రోగి తీవ్రమైన రక్తస్రావం, అలాగే అవయవాలు పనిచేయకపోవడాన్ని కూడా గమనించవచ్చు. మార్బర్గ్ వైరస్(Marburg Virus) సంక్రమణ తీవ్రత గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ..తీవ్రమైన రక్తస్రావ సందర్భాలలో రోగులు వాంతి లేదా మలంలో రక్తం కలిగి ఉండవచ్చు. తరచుగా ముక్కు, చిగుళ్ళు, యోని నుండి కూడా రక్తస్రావం ఉంటుంది.