itching in diabetes: డయాబెటిస్ ఉండి దురద పెడుతోందా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి
itching in diabetes: డయాబెటిస్ ఉన్నప్పుడు చర్మం దురద పెడుతున్నట్టయితే అది కొన్ని ముప్పులకు సంకేతంగా గుర్తుంచుకోవాలి.
itching in diabetes: డయాబెటిస్ పేషెంట్లు తరచుగా దురదతో బాధపడుతుంటారు. ఒక్కోసారి ఈ దురద బాధ భరించలేక గోకుతుండడం వల్ల అది ఇన్ఫెక్షన్లకు, అసౌకర్యానికి దారితీస్తుంది.
డయాబెటిస్ పేషెంట్లలో ఈ దురదకు కారణం డయాబెటిక్ పాలీన్యూరోపతి లేదా పెరిఫెరల్ న్యూరోపతి అనే పరిస్థితి. కొన్ని నరాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. రక్తంలో గ్లూకోజు అధిక స్థాయిలో ఉన్నప్పుడు నరాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా చేతులు, పాదాల్లో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నరాలు దెబ్బతినడానికి ముందు శరీరంలో అధిక స్థాయిలో సైటోకీన్లు ప్రసరిస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కారణంగా ఇలా జరిగి అంతిమంగా దురద పెడుతుంది. సైటోకీన్లు పెరగడం వల్ల క్రమంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని అధ్యయనాలు నిరూపించాయి.
అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో కిడ్నీ జబ్బులు, లివర్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలు కూడా దురదకు కారణమవుతాయి.
అలాగే కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా చర్మంపై దురదకు కారణం అవుతాయి. మందుల వల్ల ఏర్పడే అలర్జీ ఇందుకు కారణమవుతుంది. ఒకవేళ ఇదే కారణమైతే మందులు రాసిన వైద్యుడికి విషయం చెప్పి మందులు మార్పించుకోవచ్చు.
శరీరంలో రక్త సరఫరా తగ్గిన ప్రాంతాల్లో కూడా దురద మొదలవుతుంది. ముఖ్యంగా కాళ్లలో ఈ సమస్య ఏర్పడుతుంది.
కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు, పర్‌ఫ్యూమ్స్, డై, ఘాటైన వాసన గల సబ్బులు చర్మం పొడిబారేలా చేస్తాయి. ఇది కూడా దురదకు కారణమవుతుంది.
చలి వాతావరణం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది.
ఇదే కాకుండా కొన్నిసార్లు చర్మ సంబంధిత అనారోగ్యాలు కూడా ఈ దురదకు కారణమవుతాయి.
అయితే డయాబెటిస్ పేషెంట్లు ఈ దురదను నిర్లక్ష్యం చేయరాదు. చర్మం పొడిబారడం, దురదగా ఉండడం ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. డయాబెటిస్ ఉన్నప్పుడు శరీరం ఇన్ఫెక్షన్లపై పోరాడలేని నిస్సహాయత ఏర్పడుతుంది.
డయాబెటిస్ పేషెంట్లలో దురద వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు
కొన్నిసార్లు చర్మ సంబంధిత వ్యాధుల వల్ల వచ్చే దురద ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లలో ఈ పరిస్తితి ఎక్కువగా ఉంటుంది. అథ్లెట్ ఫుడ్, జాక్ ఇచ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు దురదకు దారితీస్తాయి. చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. వాపు కనిపిస్తుంది. కొన్నిసార్లు బుగ్గలు ఏర్పడి ద్రవం కారుతుంటుంది.
ఇక నెక్రోబయోసిస్ లైపోడికా డయాబెటికోరం (ఎన్ఎల్‌డీ) అనే అరుదైన ఇన్ఫెక్షన్ కాళ్లు, శరీరంలోని ఇతర అవయవాల్లో ఏర్పడుతుంది. ఒక ఎర్రని మచ్చలాగా ఏర్పడి విస్తృతమవుతూ చుట్టూ ఒక నల్లని వలయం ఏర్పడుతుంది. ఇది నొప్పికి, దురదకు దారితీస్తుంది.
అలాగే టైప్ 1 డయాబెటిస్ పేషెంట్లలో ఎరప్టివ్ జాంతోమాటోసిస్ అనే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఒక వేరుశనగ కాయ సైజులో వాపులా కనిపిస్తుంది. కొలెస్టరాల్ అధికంగా ఉండడం కూడా ఈ పరిస్తితికి కారనమవుతుంది. కాళ్లు, పాదాలు, చేతులు, పిరుదులపై ఇవి ఎక్కువగా అవుతాయి.
దురద నుంచి డయాబెటిస్ పేషెంట్లకు ఉపశమనం ఇలా
డయాబెటిస్ పేషెంట్లు తమ చర్మం దురద బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- రక్తంలో గ్లూకోజు స్తాయి తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.
- బాగా వేడి నీటితో స్నానం చేయరాదు. వేడి నీటి కారణంగా చర్మంలో తేమ తగ్గుతుంది.
- ఘాటైన వాసనలు గల మాయిశ్చరైజర్లు వాడకూడదు. అలాగే ఘాటైన హెయిర్ డై కూడా వాడకూడదు. జెంటిల్, హైపోఅలెర్జెనిక్ అని రాసి ఉన్న లోషన్లు మాత్రమే వాడాలి.
- రెండు వారాలైనా దురద తగ్గనప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
- చర్మం బాగా దురద పెడుతున్నప్పుడు మీ రక్తంలో గ్లూకోజు స్థాయిలో ఎక్కువగా ఉన్నాయని సంకేతాలిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. నరాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవడంపై దృష్టి పెట్టాలి.
సంబంధిత కథనం