Fast food linked to liver disease: ఫాస్ట్ ఫుడ్‌తో ఈ లివర్ డిసీజ్.. తేల్చిన స్టడీ-study reveals fast food consumption linked to liver disease ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fast Food Linked To Liver Disease: ఫాస్ట్ ఫుడ్‌తో ఈ లివర్ డిసీజ్.. తేల్చిన స్టడీ

Fast food linked to liver disease: ఫాస్ట్ ఫుడ్‌తో ఈ లివర్ డిసీజ్.. తేల్చిన స్టడీ

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 06:31 PM IST

Fast food linked to liver disease: ఫాస్ట్ ఫుడ్ మితంగా తీసుకున్నా సరే.. మీ లివర్ ప్రాణాంతక వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనం తేల్చింది.

ఫాస్ట్‌ఫుడ్‌తో ప్రాణాంతక లివర్ వ్యాధి
ఫాస్ట్‌ఫుడ్‌తో ప్రాణాంతక లివర్ వ్యాధి (Shutterstock)

ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో లివర్ వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. కెక్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయన ఫలితం క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఫాస్ట్ ఫుడ్ వినియోగం తగ్గించకపోతే ప్రమాదంలో పడకతప్పదని ఈ స్టడీ హెచ్చరించింది.

ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కారణంగా ఏర్పడే ఈ వ్యాధి ప్రాణాంతకమైందని స్టడీ స్పష్టం చేసింది.

ఒబెసిటీ, డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధులతో బాధపడే వారు రోజువారీగా అవసరమైన క్యాలరీల కంటే ఫాస్ట్ ఫుడ్ ద్వారా 20 శాతం అధికంగా తీసుకోవడం వల్ల లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు స్టడీ గమనించింది. ఫాస్ట్ ఫుడ్ తీసుకోని వారిలో ఇలాంటి పరిస్థితి లేదని తేల్చింది. ఇక జీవనశైలి వ్యాధులు లేనివారు తమ రోజువారీ డైట్‌లో 20 శాతం ఫాస్ట్ ఫుడ్ రూపంలో తీసుకునే వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమైందని వివరించింది.

‘ఆరోగ్యకరమైన కాలేయం కొంత మొత్తంలో కొవ్వును కలిగి ఉంటుంది. ఇది ఏమాత్రం పెరిగినా అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు దారితీస్తుంది..’ అని కెక్ మెడిసిన్ హెపటాలజిస్ట్ అని కర్దాషియన్ వివరించారు. ‘ఒబెసిటీ, డయాబెటిస్ ఉన్న వారిలో కాలేయంలో కొవ్వు పెరిగిపోవడానికి ఫాస్ట్ ఫుడ్ కారణమవుతుంది..’ అని వివరించారు.

ఒబెసిటీ, డయాబెటిస్‌లకు ఫాస్ట్ ఫుడ్‌తో ఉన్న సంబంధాన్ని గత అధ్యయనాలు తేల్చగా, ఇప్పుడు వారి లివర్ హెల్త్‌పై కూడా ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తేల్చింది.

అధికంగా కార్బొహైడ్రేట్లు, కొవ్వులు ఉండే ఫాస్ట్ ఫుడ్ మితంగా తీసుకున్నా సరే లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఈ స్టడీ తేల్చింది. ‘ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో రోజుకు ఒక పూట తిన్నా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది..’ అని కర్దాషియన్ చెప్పారు. ‘అది రోజువారి ఆహారంలో ఐదో వంతు అయినప్పటికీ వారి ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేసినట్టే అవుతుంది..’ అని అధ్యయనంలో తేలినట్టు చెప్పారు.

లివర్ స్టెటొసిస్‌గా పిలిచే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లివర్ సిరోసిస్‌కు దారి తీస్తుంది. కాలేయాన్ని గాయపరుస్తుంది. అంతిమంగా లివర్ క్యాన్సర్‌కు, లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. అమెరికా జనాభాలో దాదాపు 20 శాతం జనాభాపై ఈ లివర్ స్టెటొటిస్ ప్రభావం చూపిస్తోంది.

అమెరికా వార్షిక న్యూట్రిషనల్ సర్వే ఫలితాల ఆధారంగా లివర్ స్టిటోటిస్‌పై ఫాస్ట్ ఫుడ్ వినియోగ ప్రభావాన్ని ఈ అధ్యయనంలో నిర్ధారించారు. పిజాతో సహా విభిన్న రకాల ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని విశ్లేషించారు. దాదాపు 4 వేల మంది వయోజనులపై ఈ అధ్యయనం జరిపారు. వీరిలో 52 శాతం ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నట్టు చెప్పారు. 29 శాతం మంది తమ రోజువారీ క్యాలరీల వినియోగంలో ఐదో వంతు ఫాస్ట్ ఫుడ్ ద్వారా సమకూర్చుకున్నట్టు తెలిపారు. ఈ 29 శాతం మందిలో ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అధ్యయనం గ్రహించింది.

ఒబెసిటీ, డయాబెటిస్ వంటి వ్యాధులతో పోరాడుతున్న వారిలో పోషకాహార అవగాహనను పెంచేలా హెల్త్ కేర్ ప్రొవైడర్లను ఈ అధ్యయనం ప్రోత్సహిస్తుందని అధ్యయన కర్తలు ఆకాంక్షించారు. లివర్ స్టిటోటిస్‌కు ప్రస్తుతం డైట్‌లో మార్పులు ఒక్కటే చికిత్స అని నిపుణులు చెబుతున్నారు.

Whats_app_banner