పీరియడ్స్‌లో అమ్మాయిలు ఇంకా క్లాత్ వాడుతున్నారు: ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌ సర్వే-nfhs 5 says women aged 15 24 years still use cloth for menstrual protection ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పీరియడ్స్‌లో అమ్మాయిలు ఇంకా క్లాత్ వాడుతున్నారు: ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌ సర్వే

పీరియడ్స్‌లో అమ్మాయిలు ఇంకా క్లాత్ వాడుతున్నారు: ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌ సర్వే

HT Telugu Desk HT Telugu
May 11, 2022 01:58 PM IST

న్యూఢిల్లీ, మే 11: తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక ప్రకారం.. 15-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 50 శాతం మంది ఇప్పటికీ రుతుక్రమం (పీరియడ్స్)లో రుతుస్రావం నుంచి రక్షణ కోసం వస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అవగాహన లేకపోవడం , కట్టుబాట్లు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు ఇటీవల ముంబైలో రుతుక్రమానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో విద్యార్థునులతో చర్చిస్తున్న దృశ్యం
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు ఇటీవల ముంబైలో రుతుక్రమానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో విద్యార్థునులతో చర్చిస్తున్న దృశ్యం (Girish Srivastav)

అయితే పీరియడ్స్ సమయంలో అపరిశుభ్రమైన గుడ్డను మళ్లీ ఉపయోగించినట్లయితే, అది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని నిపుణులు తెలిపారు.

ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)-5లో భాగంగా 15-24 సంవత్సరాల వయస్సు గల స్త్రీలను రుతుక్రమంలో రక్షణ కోసం ఏ పద్దతి ఉపయోగిస్తున్నారని అడిగారు.

భారత్‌లో 64 శాతం మంది శానిటరీ నాప్‌కిన్‌లు, 50 శాతం మంది వస్త్రం, 15 శాతం మంది స్థానికంగా తయారు చేసిన నాప్‌కిన్‌లను ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. మొత్తంమీద ఈ వయస్సులో ఉన్న స్త్రీలలో 78 శాతం మంది ఋతు క్రమం విషయంలో పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు.

స్థానికంగా తయారుచేసిన నాప్‌కిన్‌లు, శానిటరీ న్యాప్‌కిన్‌లు, టాంపాన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు పరిశుభ్రమైన రక్షణ పద్ధతులుగా పరిగణనలో ఉన్నాయి.

అపరిశుభ్రమైన రుతుక్రమాల వల్ల ఇన్ఫెక్షన్లకు గురికావడంపై గురుగ్రామ్‌లోని సికె బిర్లా హాస్పిటల్‌లోని ప్రసూతి, స్త్రీ జననేంద్రియ విభాగానికి చెందిన డాక్టర్ అస్తా దయాల్  మాట్లాడుతూ, "చాలా అధ్యయనాలు బ్యాక్టీరియల్ వాజినోసిస్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) వంటి పునరుత్పత్తి మార్గం అంటువ్యాధులు సంభవించవచ్చని చూపించాయి. అవి పెల్విక్ ఇన్ఫెక్షన్‌లుగా మారతాయి..’ అని తెలిపారు.

‘ఈ అంటువ్యాధులు పెల్విస్ వరకు ప్రయాణించగలవు కాబట్టి అవి గర్భాన్ని పొందడంలో ఇబ్బందులు లేదా ముందస్తు ప్రసవం వంటి గర్భధారణ సమస్యలను కలిగిస్తాయి’ అని ఆమె చెప్పారు.

అంతేకాకుండా అపరిశుభ్రత దీర్ఘకాలంలో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ఈ క్యాన్సర్‌కు ప్రమాద కారకాల్లో ఒకటి అపరిశుభ్రత అని దయాల్ చెప్పారు.

12 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాఠశాల విద్యను కలిగి ఉన్న స్త్రీలు పరిశుభ్రత పద్ధతిని ఉపయోగించుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక వెల్లడించింది.

‘అత్యధిక సంపద వర్గంలో ఉన్న స్త్రీలు దాదాపు రెండు రెట్లు ఎక్కువ(95 శాతం) పరిశుభ్రత పద్ధతిని ఉపయోగించే అవకాశం ఉంది. తక్కువ సంపదలో ఉన్న స్త్రీలు 54 శాతం మాత్రమే పరిశుభ్ర పద్ధతి పాటిస్తున్నారు. 73 శాతం గ్రామీణ మహిళలు ఋతు క్రమంలో పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. పట్టణ మహిళల్లో ఇది 90 శాతంగా ఉంది..’ అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక పేర్కొంది.

బీహార్‌లో 59 శాతం, మధ్యప్రదేశ్‌లొ 61 శాతం, మేఘాలయలో 65 శాతం మంది మహిళలు మాత్రమే ఋతు రక్షణలో పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. 

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా మాట్లాడుతూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక విద్య, సంపద, ఋతు రక్షణ పరిశుభ్రమైన పద్ధతుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని చూపుతుందని అన్నారు.

సామాజిక నేపథ్యం సరైన ఋతు పరిశుభ్రతకు దోహదపడుతుందని ముత్రెజా చెప్పారు.

‘పీరియడ్స్ గురించి మాట్లాడడంపై ఉన్న అప్రకటిత నిషేధం స్త్రీలను ఆయా రక్షలు పొందకుండా నిరుత్సాహపరుస్తుంది. రుతుక్రమ పరిశుభ్రతను మెరుగుపరచడానికి సామాజిక నిబంధనలు, ప్రవర్తనలను మార్చడానికి విస్తృతమైన సామాజిక, ప్రవర్తన మార్పు ప్రచారాలతోపాటు, బాలికల విద్యలో పెట్టుబడి పెట్టడం అవసరం..’ అని ఆమె చెప్పారు.

సామాజిక కార్యకర్త, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ రంజనా కుమారి మాట్లాడుతూ.. ‘ఋతుస్రావం విషయంలో రెండు అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకటి ఋతుస్రావం అవమానంగా భావించడం. అమ్మాయిలు దానిని ఎవరితోనూ పంచుకోకపోవడం..’ అని అన్నారు.

ప్రధాన మంత్రి భారతీయ జనౌష్టి పరియోజనా కింద దేశవ్యాప్తంగా ఆయా కేంద్రాలలో శానిటరీ న్యాప్‌కిన్‌లను ప్రతి ప్యాడ్‌కి కనీసం 1 రూపాయికి అందుబాటులో ఉంచడం గురించి ఆమె ప్రస్తావిస్తూ.. ‘చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే పీరియడ్స్ సమయంలో 12 న్యాప్‌కిన్‌లు అవసరం అయినందున అమ్మాయిలు తల్లిదండ్రుల నుండి రూ. 12 అడగాలి. అయితే వారికి తెలియజేయడానికి అమ్మాయిలు సిగ్గుపడతున్నారు..’ అని ఆందోళన వ్యక్తంచేశారు.

‘అలాగే తల్లిదండ్రులు దీనిని పనికిరాని ఖర్చుగా భావిస్తారు. కాబట్టి బాలికలకు ఆరోగ్యం అవసరం అని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం కూడా అవసరం. ప్రభుత్వం అందజేయడమే కాకుండా.. అవి లబ్ధిదారులకు చేరేలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది..’ అని కుమారి చెప్పారు.

ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-5 సర్వేను దేశంలోని 707 జిల్లాల్లో సుమారు 6.37 లక్షల కుటుంబాల్లో నిర్వహించారు. 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులను సర్వే చేశారు.

IPL_Entry_Point

టాపిక్