Wednesday Motivation | లైఫ్ అంటే ఒక రేస్.. ఆగిపోతే ముందుకు సాగలేవు!
Wednesday Wisdom: జీవితం అనే ఆటలో పరుగెత్తాలి. ఆగిపోతే ముందుకు సాగలేవు. మీకు ప్రేరణను అందించే ఈ చిన్న కథను చదవండి.
Wednesday Wisdom: జీవితం అంటే ఒక పరుగుపందెం లాంటిదే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ వ్యక్తి తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు పరుగులు తీయాల్సిందే. ఇక్కడ గెలుపు ఓటములు ముఖ్యం కాదు, జీవితం అనే ఆట ఆడటం ముఖ్యం. మీ తోటి వారిని ఎదుగుదలను చూసి ఆందోళన చెందకుండా నీ ఆటను నువ్వు ఆడాలి. ప్రతీచోట పోటీతత్వం అనేది ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే ఆ ఆటకు అర్థం ఉంటుంది. నీ చుట్టూ ఉన్న పోటీదారులను చూసి నువ్వు భయపడాల్సిన పనిలేదు. వారితో సమానంగా నువ్వు పోటీపడటం లేదని మధ్యలో ఆటను వదిలివేయకూడదు. ఎక్కడ ఏ మలుపు దాగి ఉంటుందో ఎవరికి తెలుసు? ఏటికి ఎదురీదైనా, నువ్వు ముందుకు సాగుతూపోతుంటే ఏదో ఒక చోట నీకోసం ఒక అవకాశం వేచి చూస్తూ ఉంటుంది. ఆ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ఎత్తుకు ఎగరేందుకు ప్రయత్నించాలి. అలాకాకుండా మధ్యలో ఆగిపోతే అందరికంటే వెనకబడిపోతావు, నీ వెనక ఉన్నవారు నిన్ను దాటుకొని వెళ్తారు. కాబట్టి వేగంగా పరుగెత్తు, వీలైతే అడుగులో అడుగేస్తూ నడువు, కానీ ఉన్నచోట ఉండకుండా ముందుకు కదులుతూ ఉండూ అదే నీ జీవితానికి ముందడగు అవుతుంది.
చిన్నతనంలో మనందరం ఒకే తరగతిలో ఉంటాం. మనలోనే కొందరు బాగా చదివేవారు ఉంటారు, మన స్నేహితులు మనకంటే చదువులో వెనకబది ఉంటారు. కానీ అందరూ పెరిగి పెద్దగా అయినపుడు ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో ఎంచుకొని జీవిత ప్రయాణం కొనసాగిస్తారు. అప్పుడు బాగా చదివిన వారు మంచి ఉద్యోగం సాధించి ప్రస్తుతం గొప్ప స్థానంలో ఉండి ఉండవచ్చు. సరిగా చదవని వారు కూడా ఇంకొకరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో బాగా స్థిరపడి ఉండవచ్చు. ఇలా స్థిరపడిన వారిలో మీ స్నేహితులు కూడా ఉండవచ్చు. అందుకే భయపడకూడదు, నాకు చదువు లేదులే అని ఆగిపోకూడదు. జీవితాన్ని నీదైన శైలిలో సాగించటమే నీ విజయానికి మార్గం.
ఇక్కడొక చిన్న కథ చెప్పుకుందాం. ఒక బాలుడు వేగంగా పరుగెత్తగలడు, ఎలాంటి పరుగులోనైనా విజయం సాధించేవాడు. అందరూ తన పరుగును చూసి చప్పట్లు కొట్టేవారు, ప్రశంసలు అందించేవారు. తనలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఒకరోజు వేరొక చోట పరుగుపందెం పెట్టారు. ఈ బాలుడు తాను వేగంగా పరుగెత్తగలను అనుకుంటాడు, కానీ ఆ పందెంలో తనను మించి పరుగెత్తేవారు ఉంటారు, తాను ఓడిపోతాడు. ఇలా రెండు మూడు రౌండ్లు పందెలు జరిగితే అన్నింటిలో ఓడిపొతాడు. మరోసారి పందెం జరుగుతుంది, ఎలాగూ ఓడిపోతాను కదా అని తాను పరుగెత్తకూడదని నిర్ణయించుకుంటాడు. ఇది చూసిన ఒక పెద్దాయన ఆ బాలుడికి ధైర్యం చెప్పి, ఇప్పుడు జరిగే పోటీలో నువ్వే గెలుస్తావు అంటాడు. తనకంటే బలహీనులు, నడవలేని వారిని పోటీలో ఉంచుతాడు. ఇక ఆ పందెంలో ఊహించినట్లుగానే బాలుడు గెలుస్తాడు. ఆ బాలుడు ఆనందంతో పొంగిపోయి విజేతను అంటూ చేతులు పైకెత్తుతాడు. కానీ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు, ప్రశంసించరు. దీంతో ఆ బాలుడికి గెలిచిన ఆనందం కూడా ఉండదు. అప్పుడు ఆ పెద్దాయన చెబుతాడు. పోటీలేని పందెంలో గెలిచినా ఎలాంటి అర్థం ఉండదు, పోటీ ఉన్న పందెంలో ఓడినా ఒక గర్వం ఉంటుంది. కాబట్టి పరుగు పెట్టు.. గెలుపుకోసం కాదు, నీ ఆట కోసం. నీ జీవితం కోసం అని చెప్తాడు.
ఇప్పుడు అర్థం అయ్యిందికదా... జీవితం అంటేనే రేస్.. గెలుపు ముఖ్యం కాదు, పరుగు ముఖ్యం. ఆగిపోతే ముందుకు సాగలేవు!
సంబంధిత కథనం
టాపిక్