Monday Motivation: మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. అవసరాల కోసం ఎంత కిందకైనా దిగి ఉంటారు. అదే వారికిక మనతో అవసరం లేదని తెలిసిన సందర్భంలో ఎంతకైనా దిగజారుతారు. వారి మాట, వారి ప్రవర్తన చూస్తే ఇంతకాలం ఇలాంటి వారితోనా మనం సావాసం చేసింది అనిపిస్తుంది. ఇలాంటి వారి కోసమా మన అమూల్యమైన సమయం, సంపద కేటాయించింది అనిపిస్తుంది, నిజం చెప్పాలంటే నిజంగా బాధనిపిస్తుంది. ఒక్కసారిగా వారు చేసిన నమ్మకద్రోహంతో గుండె ముక్కలవుతుంది. ఎవరితో మన బాధ పంచుకోలేము, ఆ క్షణం నుంచి ఎవరినీ నమ్మలేము. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఈ బ్రతుకు అని, మనుషులుగా పుట్టడం కంటే ఏదైనా జంతువుగా పుడితే ఈ భావోద్వేగాల దవాగ్ని నుంచి చల్లగా బ్రతకగలం అనిపిస్తుంది.
నేటి సమాజంలో మంచివాళ్లుగా ఉందామనుకున్నా ఉండలేని పరిస్థితి. మనం ఒకరికి సహాయపడినపుడే వారు మనల్ని మంచివాళ్లుగా చూస్తారు, ఏదో ఒక సందర్భంలో సహాయం చేయలేని పరిస్థితి ఉన్నా దానిని అర్థం చేసుకోరు. మనం ఎందుకు ఉపయోగపడనివారిగా భావిస్తారు, శత్రువుల కంటే హీనంగా చూస్తారు. మనం ఇంతకాలంగా వారికి ఎన్నిసార్లు సహాయపడ్డామో అవేవి వారికి గుర్తుండవు.
నేటి సమాజంలో ఇలాంటి మనుషులు చాలా మంది ఉంటారు, మన జీవితంలో ప్రతీ సందర్భంలో ఇలాంటి విశ్వాసం లేని వ్యక్తులు తారసపడతారు. అసలు మనిషికి విశ్వాసం ఉంటుంది అనేదే ఒక పెద్ద భ్రమ. నిజమైన ప్రేమలు, నిజమైన అప్యాయతలు అనేవి ఏవీ లేవు. అవన్నీ అవసరాలకు పుట్టుకొచ్చేవే. జీవితంలో హీరోలు, విలన్లు అంటూ ఎవరూ లేరు. అవసరాల కోసం పుట్టుకొచ్చే పాత్రలు తప్ప.
మరి ఇలాంటి వ్యక్తుల నుంచి దూరం జరగడం, లేదా మనల్ని మనం దూరం చేసుకోవడం జరగని పని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవితం, మన కోసం జీవించాలి. ఎవరికోసమో మన జీవితం అన్నట్లు ఉండకూడదు. అనుభవాలనే జీవిత పాఠాలుగా అభ్యాసం చేస్తూ ముందుకు సాగాలి, మరింత ఉన్నతంగా, మరింత ఎత్తుకు ఎదగాలి. ఇందుకోసం మన మంచితనాన్ని, మన వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పనిలేదు. అందరూ ఏదో ఒకరోజు పోయే వారే, ఆస్తులు ఎన్ని కూడబెట్టిన చివరికి ఆరడుగుల భూమిలో, గాలిలో ధూళిలో కలిసి పోవాల్సిందే. కానీ ఆ రోజు వచ్చే రోజు మనమేంటో ఈ సమాజానికి తెలిసిరావాలి. మన జీవితం పది మందికి ఆదర్శం కావాలి.
మీరు వ్యక్తిగా ఎదగడానికి మీకు ఇంకొకరు తోడు ఉన్నా, లేకపోయినా. మిమ్మల్ని మీరే ప్రేరణగా తీసుకోండి. అద్దం ముందు నిల్చుండి ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకుంటే, మీరేంటో మీకే తెలుస్తుంది. పుట్టిన నాటి నుంచి నేటి వరకు జీవితంలో మీరు ఎన్నో చూసి ఉంటారు. ఎన్నో బాధలు, సంతోషాలు అనుభవించి ఉంటారు. ఎంతో కష్టపడితే గానీ మీరు ఈ స్థాయికి వచ్చి ఉండరు. అద్దంలో కనిపించే నిలువెత్తు మీ ప్రతిబింబమే అందుకు నిదర్శనం. కాబట్టి భయమెందుకు, వేయండి అడుగు ముందుకు. ఏదైతే అదవుతుంది, మీ జీవితాన్ని మనసారా గడిపేయండి. Live Life To The Fullest!!