Thursday Thoughts | బంధుగణం సంఖ్య ఎంతైతే ఏం.. కష్టకాలంలో ఒంటరిగానే నీ పయనం!-thursday thoughts never depend on anyone in your life learn to walk alone ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Thursday Thoughts Never Depend On Anyone In Your Life, Learn To Walk Alone

Thursday Thoughts | బంధుగణం సంఖ్య ఎంతైతే ఏం.. కష్టకాలంలో ఒంటరిగానే నీ పయనం!

Manda Vikas HT Telugu
Oct 27, 2022 06:34 AM IST

Thursday Thoughts : నువ్వు విందు భోజనం పెడతానంటే వంద మంది వస్తారు, అదే నీకు అవసరం వచ్చింది రమ్మంటే ఏ ఒక్కరూ రారు. బంధుగణం సంఖ్య ఎంతుంది అనేది ముఖ్యం కాదు, మనం కఠిన సమయాల్లో ఉన్నప్పుడు మన వెన్నుతట్టే వారు ఒక్కరైనా, ఉన్నారా లేదా అనేది ముఖ్యం.

Thursday Thoughts- Walk alone
Thursday Thoughts- Walk alone (Unsplash)

Thursday Thoughts : 'ధన మూలం ఇదం జగత్' అని మీరు వినే ఉంటారు. అంటే ధనం తోనే నడుస్తుంది ఈ ప్రపంచం అంతా అనే అర్థం వస్తుంది. నిన్నటి ప్రేమలు, బంధుత్వాలు నేడు ఎక్కడ వెతికినా కానరావు. డబ్బు ఉంటేనే విలువ ఇస్తున్న సమాజం మనది. నా బలగం, బంధుగణం పరిమాణం చాలా పెద్దది, రేపు నాకు ఏం జరిగినా నన్ను చూసుకోవటానికి నా వాళ్లు ఉన్నారు, నాకోసం వస్తారు, నన్ను చూసుకుంటారు అనే భావనలో ఉంటే పొరపాటే. ఇప్పుడు సమాజం మారింది, మనుషులు మారారు. నువ్వు ఎంత సహాయం చేసినా.. పని పూర్తయిన తర్వాత నిన్ను మర్చిపోతారు. మళ్లీ నీ సహాయం అవసరమైతే తప్ప నిన్ను గుర్తుంచుకోరు. నువ్వు సహాయం చేశావు కాబట్టి, నీకు సహాయం చేస్తారనే నమ్మకం లేదు. నీకు కష్టం వస్తే నీకు నువ్వుగా తీర్చుకోవాలి.

నువ్వు విందులు, వినోదాలు ఇచ్చేటపుడు నిండుగా వచ్చే జనం, నువ్వు కష్టంలో ఉన్నావని పిలిస్తే ఏ ఒక్కరూ రారు, ఏ ఒక్కరి నుంచి స్పందన ఉండదు. కష్టకాలంలో నీ పయనం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుందని గుర్తుంచుకో.

నీ కష్టం ఇంకొకరికి ఇష్టం, నువ్వు ఎదురీదే గడ్డు పరిస్థితులు వేరొకరికి వినోదాన్ని పంచుతాయి. నీ చుట్టూ ఉన్నవారు నీకు నీతిబోధ చాలానే చేస్తారు. కానీ సమయం వచ్చినపుడు వారు చెప్పిన విలువలకే తూట్లూ పొడుస్తారు. నీ చుట్టూ ఉన్నవారిలో ఏ ఒక్కరూ నిజం కారు. కాలం నీకు పెట్టే పరీక్షల్లో ఒక్కొక్కరి అసలు రంగులు బయటపడతాయి. నున్ను ఆకాశానికి ఎత్తేసే వారే, నీ వెనక ఉండి నువ్వు పాతాళంలోకి ఎప్పుడు పడతావో అని గోతులు తొవ్వుతారు. నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు సంపాదిస్తేనే నీకు విలువిస్తారు, నువ్వు వారి కోసం ఖర్చు చేసి, వారి అవసరాలు తీర్చినపుడే నీ బంధుగణం నీకు మద్ధతు ఇస్తారు. పెడితే పెళ్లి కోరతారు, పెట్టకపోతే చావు కోరతారు. ధనం మీద ఆశ పెరిగినపుడు సొంత వారు కూడా పరాయివారవుతారు.

కాబట్టి నీ జీవితానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ అన్ని నువ్వే. నీ రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు నుంచే బాటలు పరుచుకో. నీ సొంత కాళ్ల మీద నువ్వు నిలబడు. అందరితో కలిసి మెలిసి ఉండి, అందరూ చెప్పేది విని, నీ దారిలో నువ్వు వెళ్లు. నీ వెంట ఎవరూ లేకపోయినా నీ ఆత్మవిశ్వాసం పైనే నమ్మకం ఉంచు. అప్పుడు నీకు జీవితంలో తిరుగే ఉండదు.

WhatsApp channel

సంబంధిత కథనం