Telugu News  /  Lifestyle  /  Ways To Make Your Partner To Love You Forever
Relationship Advice
Relationship Advice (Pixabay)

Relationship Advice | మీ భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించాలంటే ఈ పని చేయండి!

20 September 2022, 21:45 ISTHT Telugu Desk
20 September 2022, 21:45 IST

పెళ్లికి ముందు ఉన్న ప్రేమ, పెళ్లైన కొత్తలో చూపించిన శ్రద్ధ ఇప్పుడు లేదని బాధపడేకంటే అందుకు తగిన ప్రయత్నాలు చేయడం మేలు. మీ భాగస్వామి నుంచి ఎల్లప్పుడు ప్రేమను పొందేందుకు మార్గాలు చూడండి.

ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామి నుంచి పూర్తి ప్రేమను పొందాలని కోరుకుంటాడు. ఒక భర్త తన భార్య తన పట్ల అమితమైన ప్రేమను, అభిమానాన్ని ఆశిస్తాడు. అలాగే భార్య కూడా తన భర్త తనకు మాత్రమే సొంతం అని. అన్ని విషయాలలో తనకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటేనే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

అయితే చాలా వరకు జంటలను పరిశీలిస్తే.. పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో ఉండే ప్రేమ, ఆదరణ పెళ్లి తర్వాత సన్నగిల్లినట్లు కనిపిస్తుంది. ఫన్ కాస్త ఫ్రస్ట్రేషన్‌గా మారుతుంది.

ప్రేమతో పాటు గౌరవం లభించినప్పుడే ఏ బంధమైనా చిరకాలం నిలుస్తుంది. మీ భాగస్వామి మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించాలని, మీ మాటకు విలువ ఇవ్వాలని మీరు కోరుకుంటే, అందుకు కొన్ని మార్గాలను ఇక్కడ సూచిస్తున్నాం. ఈ రకమైన ప్రయత్నాలు ఇరువైపుల నుంచి ఉంటే మీ బంధం బలంగా ఉంటుంది. మీరు ఎవర్ గ్రీన్ జంటగా నిలుస్తారు. మరి అందుకు మీరు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

అప్యాయతను పంచండి

మీకు ఎవరి ప్రేమ, అప్యాయతలు దక్కకపోయినా, ఒక్క మీ జీవిత భాగస్వామి నుంచి దక్కితే మీ మధ్య ప్రేమ ఎల్లప్పుడూ చిగురిస్తూనే ఉంటుంది. ఏ బంధాన్నైనా సుదీర్ఘంగా, అందంగా ఉంచుకోవాలంటే అందుకు మీరు చూపే ఆప్యాయత, మీరు ఇచ్చే ప్రశంసలు ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. మీరు కూడా మీ బంధంలో ప్రేమ, గౌరవాన్ని నిరంతరం పొందాలనుకుంటే, మీ మాటల్లో, చేతల్లో భాగస్వామికి ఆప్యాయతను చూపండి. అవకాశం వచ్చినపుడు వారిని ప్రశంసిస్తూ ఉండండి.

ఆత్మగౌరవం ముఖ్యమే

ప్రతీ విషయంలో భాగస్వామిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మీ ఆత్మగౌరవం కూడా ముఖ్యమే. మీరు మీ భాగస్వామి చెడు ప్రవర్తనను ఎల్లవేళలా ఎదుర్కోవలసి వస్తే, ఈ అంశంపై మీ భాగస్వామితో మాట్లాడండి, వారి ప్రవర్తనతో వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పండి. మీరు మౌనంగా ఉంటే అది త్వరలోనే మీ బంధంలో చీలికకు మిమ్మల్ని లోపలి నుండి ప్రేరేపిస్తుంది. మీ భాగస్వామికి మంచి-చెడులను చెప్పే ఒక ఆత్మీయ శ్రేయోభిలాషిగా, మంచి సలహాలు ఇచ్చే ఒక మంత్రిలా మెలగాలి.

పరిమితులకు లోబడాలి

మీరు ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఇద్దరు ఒకేలా ఆలోచించగలగాలి, ఒకరు చెప్పిన దానికే కట్టుబడి ఉండాలనే రూల్ లేదు. ఇలా ఉంటే మీతో కలిసి ఉండటానికి మీ భాగస్వామి ఇబ్బంది పడతారు, మీ నుంచి స్వేచ్ఛను కోరుకుంటారు. మీరిద్దరూ ఒకరి ఇష్టాలు, అయిష్టాల గురించి బాగా తెలుసుకోవాలి. అలాగే కొన్ని హద్దులు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీరిద్దరూ ఒకరి మనోభావాలను మరొకరు గాయపరచుకోలేరు.

అర్థం చేసుకోండి

అర్థం చేసుకోవటం అనేదే ఒక క్లిష్టమైన సబ్జెక్ట్. మీ భాగస్వామి బలాలను తెలుసుకోండి, బలహీనతలను అర్థం చేసుకోండి. వారిలో మీకు నచ్చని విషయాలు ఏమున్నాయో, నెమ్మదిగా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. వారిని మీరు అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు చేసుకోగలరు? ఇందుకు సమయం పడుతుంది. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదేమైనా చేయి వీడకుండా కలిసి ఒక్కటిగా నడవండి.