Women After Marriage। పెళ్లి తర్వాత ఆడవారి శరీరాకృతిలో మార్పు ఎందుకొస్తుంది?-reasons why most of women s body changes after marriage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Reasons Why Most Of Women's Body Changes After Marriage,

Women After Marriage। పెళ్లి తర్వాత ఆడవారి శరీరాకృతిలో మార్పు ఎందుకొస్తుంది?

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 05:25 PM IST

పెళ్లి తర్వాత చాలా మంది పురుషుల్లో ఎలాంటి మార్పు కనిపించదు. అయితే ఆడవారిలో మాత్రం ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వారు బరువు పెరుగుతారు. వారి శరీరాకృతిలోనూ మార్పు వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి, చూడండి.

Women After Wedding - Representational Image
Women After Wedding - Representational Image (Unsplash)

పెళ్లి తర్వాత స్త్రీ, పురుషులిద్దరి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పులు శారీరకంగానూ, మానసికంగానూ ఉండవచ్చు. ముఖ్యంగా వారి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. అయితే పెళ్లి తర్వాత వచే ఈ మార్పులు పురుషుల కంటే మహిళల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. పెళ్లయ్యాక మహిళల్లో ఊబకాయం మొదలవుతుంది. పెళ్లికి ముందు స్లిమ్ ఫిజిక్‌ను కలిగి ఉండే మహిళలు పెళ్లయిన కొన్నేళ్లలోనే బరువు పెరగడం ప్రారంభిస్తారు. వారి శరీర ఆకృతిలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

ది ఒబేసిటీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వివాహం అయిన ఐదు సంవత్సరాలలో దాదాపు 82% జంటలు కనీసం 5 నుండి 10 కిలోల బరువు పెరుగుతారని వెల్లడైంది. ఇందులో ఎక్కువశాతం మహిళలే ఉంటారు. పురుషుల కంటే మహిళలే వేగంగా బరువు పెరుగుతారు. మరి పెళ్లి తర్వాత అమ్మాయిలే ఇలా ఒక్కసారిగా బరువు ఎందుకు పెరుగుతారు? కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారంలో మార్పు

పెళ్లి తర్వాత మహిళల ఆహారంలో మార్పు వస్తుంది. వారు అంతవరకు తమ పుట్టింట్లో తినేదానికి భిన్నంగా తినాల్సి వస్తుంది. తమ ఇష్టానుసారం కాకుండా భర్త, అత్తమామల ఎంపిక ప్రకారం ఆహారంలో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. వంట చేసేటపుడు అందరి మెప్పు పొందడం కోసం రుచికరంగా వంట చేసేందుకు నూనె, నెయ్యి, మసాలాలు ఎక్కువగా వాడతారు. అలాగే ఆహారం వృధాగా పోకూడదు. ఈ క్రమంలో ఎక్కువ తినాల్సి రావచ్చు. ఆహారం విషయంలో మారిన ఈ ప్రాధాన్యతలు ఆడవారి బరువు పెరగడానికి కారణం అవుతుంది.

ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్ష్యం

పెళ్లికి ముందు అమ్మాయిలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడం కోసం వ్యాయామం చేస్తారు, రుచికంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ శరీరాకృతి, అందం విషయంలో అస్సలు రాజీపడరు. ఇక పెళ్లి తర్వాత అన్నింటిని వదిలివేస్తారు. వారి జీవనశైలిలో మార్పు వస్తుంది. ఈ కారణంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది.

హార్మోన్ల హెచ్చుతగ్గులు

పెళ్లయ్యాక లైంగిక జీవితంలో చురుగ్గా ఉండడం వల్ల అమ్మాయిల శరీరంలో హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. పిల్లల కోసం చికిత్సలు, మెడిసిన్స్ తీసుకోవాల్సి రావచ్చు. అదే సమయంలో, గర్భనిరోధక మాత్రలు ఉపయోగించాల్సి రావచ్చు. వీటి కారణంగా కూడా ఆడవారు బరువు పెరుగుతారు.

పెళ్లి తర్వాత ఒత్తిడి

పెళ్లయ్యాక కొత్త వాతావరణానికి తగ్గట్టుగా ఆడపిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆడవారి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఈరకంగా వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒక వేళ వారు పనిచేసే వారైతే ఆఫీసు టెన్షన్లతో మరింత ఒత్తిడి ఉంటుంది. ఈ కారణంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది.

ఇతర కారణాలు

పెళ్లి తర్వాత శారీరక, మానసిక ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ ఉండకపోవచ్చు. అదే సమయంలో ఉపవాస దీక్షలు, పూజలు, వ్రతాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి బంధువుల నుంచి ఆహ్వానాలు ఎక్కువ అవుతాయి, ప్రయాణాలు ఎక్కువవుతాయి. విందులు, వినోదాలు పెరుగుతాయి. ఇవన్నీ వారి బరువును అమాంతం పెంచేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం