Brinji Rice Recipe | బ్రింజీ రైస్.. బిర్యానీలాంటి రుచి, క్షణాల్లో తయారీ!-watching binge and eating brinji rice is a perfect combo check recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brinji Rice Recipe | బ్రింజీ రైస్.. బిర్యానీలాంటి రుచి, క్షణాల్లో తయారీ!

Brinji Rice Recipe | బ్రింజీ రైస్.. బిర్యానీలాంటి రుచి, క్షణాల్లో తయారీ!

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 01:01 PM IST

సమయం లేనపుడు అన్నంతో త్వరగా ఏదైనా చేసుకోవాలనుకుంటే Brinji Rice Recipe ఇక్కడ ఉంది. బిర్యానీ లాంటి టేస్ట్ ఉంటుంది.

Brinji Rice Recipe
Brinji Rice Recipe (Unsplash)

బిర్యానీ అంటే తెలియని వారు ఉండరు, చాలా మందికి ఫేవరెట్ వంటకం అది. అయితే ఈ బిర్యానీ కంటే ముందు తమిళనాడులో బ్రింజీ రైస్ చాలా ప్రసిద్ధి. అయితే ఇది పూర్తిగా శాకాహార వంటకం. బిర్యానీ ఆకు, కొన్ని సుగంధ ద్రవ్యాలు, కూరగాయలతో కలిపి చేసే ఈ రైస్ బిర్యానీని పోలిన రుచి, సువాసనను కలిగి ఉంటుంది. తక్కువ సమయంలోనే త్వరత్వరగా ఈ రైస్ డిష్ చేసుకోవచ్చు.

ఈ డిష్‌లో వివిధ రకాల కూరగాయలు, కొబ్బరి పాలు, మసాలా దినుసులు ఉన్నందున ఇది ఒక మంచి పోషకాహారం కూడా అవుతుంది. మనకు త్వరగా చేసుకోగలిగే ఖిచ్డీ ఎలా అయితే ఉంటుందో, దీనిని కూడా అదే విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రింజీ రైస్ తయారీకోసం ఉపయోగించే పదార్థాలు దీని రుచిని మారుస్తాయి.

ఉదయం లంచ్ బాక్స్ సిద్ధం చేసేటపుడు గానీ లేదా సాయంత్రం ఆలస్యంగా వచ్చిన సందర్భంలో ఛటుక్కున ఈ బ్రింజీ రైస్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా కూరలు సిద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఆలస్యం చేయకుండా బ్రింజీ రైస్ ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలేమిటో తెలుసుకోండి. బ్రింజీ రైస్ రెసిపీ ఈ కింద చూడండి.

Brinji Rice Recipe కోసం కావలసిన పదార్థాలు

  • 2 కప్పుల బాస్మతి బియ్యం
  • గ్రీన్ మసాలా పేస్ట్ 2 స్పూన్స్
  • 1 బిర్యానీ ఆకు
  • 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • 1/2 కప్పు టమోటా ముక్కలు
  • 1/2 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు
  • 1/2 కప్పు క్యారెట్ ముక్కలు
  • 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు
  • 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు
  • 1/2 కప్పు పచ్చి బఠానీలు
  • 1/4 కప్పు కప్పు తరిగిన ఫ్రెంచ్ బీన్స్
  • 2 కప్పుల కొబ్బరి పాలు
  • 1/2 కప్పు నీరు
  • ఉప్పు అవసరం మేరకు
  • 1 అంగుళాల దాల్చిన చెక్క
  • 2 లవంగాలు
  • 2 ఆకుపచ్చ ఏలకులు
  • 3 టేబుల్ స్పూన్లు నూనె

బ్రింజీ రైస్ తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో బియ్యం కడిగి నానబెట్టండి, మరొక వైపు ఒక బ్లెండర్‌లో చేతినిండా కొత్తిమీర, చేతి నిండా పుదీనా, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 టీస్పూన్ ఫెన్నెల్ తీసుకొని కొన్ని నీళ్లు కలిపి మసాలా పేస్ట్‌ను సిద్ధం చేయండి.
  2. ఇప్పుడు 3 లీటర్ ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేడి చేయండి. మీరు నూనెకు బదులుగా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు.
  3. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు అలాగే ఇతర సుగంధ దినుసులు వేసి వేయించండి.
  4. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయలను వేసి బాగా వేగించండి.
  5. ఇప్పుడు కూరగాయలను, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  6. ఆపైన సిద్ధం చేసిన గ్రీన్ మసాలా పేస్ట్, కొన్ని కరివేపాకులను వేసి వేయించండి.
  7. ఇప్పుడు ఒక కప్పు నీరు, కొబ్బరి పాలు పోసి బాగా కలపండి.
  8. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి, ఒక కప్పు నీరు పోసి మూతపెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

అంతే రుచికరమైన బ్రింజీ రైస్ రెడీ. పెరుగు లేదా రైతాతో కలిపి తినండి, రుచిని ఆస్వాదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం