Vellulli Rasam: రోగ నిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి రసం, ఇలా చేయండి-vellulli rasam recipe in telugu know how to make this healthy recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vellulli Rasam: రోగ నిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి రసం, ఇలా చేయండి

Vellulli Rasam: రోగ నిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి రసం, ఇలా చేయండి

Haritha Chappa HT Telugu
Mar 27, 2024 05:35 PM IST

Vellulli Rasam: వేసవిలో వచ్చే కొన్ని రోగాలను తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి రసం ఎలా చేయాలో తెలుసుకోండి. రెసిపీ ఇక్కడ ఉంది.

వెల్లుల్లి రసం రెసిపీ
వెల్లుల్లి రసం రెసిపీ

Vellulli Rasam: వేసవిలో అనేక రకాల రోగాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఆ వ్యాధులను తట్టుకోవాలంటే శరీరం సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. శరీరానికి రోగనిరోధక పెంచే ఆహారాన్ని అందించాలి. వెల్లుల్లి రసాన్ని వారంలో నాలుగైదు సార్లు తినడం ద్వారా శక్తిని పెంచవచ్చు. ఈ వెల్లుల్లి రసాన్ని చాలా సులువుగా చేయవచ్చు. దీని రెసిపీ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి రసం రెసిపీకి కావలసిన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు - 15

పచ్చిమిర్చి - రెండు

టమోటో - ఒకటి

చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో

జీలకర్ర - అర స్పూను

ఎండుమిర్చి - రెండు

ఆవాలు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఇంగువ- చిటికెడు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

నీళ్లు - సరిపడినన్ని

కారం - అర స్పూను

పసుపు - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

మెంతులు - పావు స్పూను

నువ్వులు - ఒక స్పూను

శెనగపప్పు - రెండు స్పూన్లు

ధనియాలు - ఒక స్పూను

వెల్లుల్లి రసం రెసిపీ

1. వెల్లుల్లి రసం తయారు చేయడానికి ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకోవాలి.

2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు, జీలకర్ర, ధనియాలు, శెనగపప్పు, నువ్వులు వేసి వేయించుకోవాలి.

3. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

4. వెల్లుల్లి రసానికి కావలసిన మసాలాపొడి రెడీ అయినట్టే.

5. ఇప్పుడు చింతపండును నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

6. టమోటోలను మిక్సీలో వేసి ఫ్యూరీలా చేసుకోవాలి.

7. పచ్చిమిర్చిని కూడా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి.

8. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా రోటిలో దంచి పక్కన పెట్టుకోవాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

10. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.

11. అందులోనే కరివేపాకులు, ఇంగువ కూడా వేసి వేయించాలి.

12. ఆ తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి.

13. వెల్లుల్లి రెబ్బలు వేగుతున్నప్పుడే మంచి వాసన వస్తాయి.

14. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి.

15. చింతపండు నానబెట్టుకున్న నీటిని వేసి చింతపండును బయట పడేయాలి.

16. ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

17. మద్యస్థ మంట మీద పావుగంటసేపు మరిగించాలి.

18. ఆ తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే వెల్లుల్లి రసం రెడీ అయినట్టే.

19. దీన్ని అన్నంలో వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.

20. పిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన దానిలో వెల్లుల్లి రసం ఒకటి.

వెల్లుల్లి ఏ కాలమైనా మన ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే. సీజనల్ వ్యాధులను తగ్గించే శక్తి దీనికి ఉంది. శీతాకాలంలో వచ్చే వ్యాధులకే కాదు వేసవికాలంలో వచ్చే వ్యాధులకు కూడా చెక్ పెడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది కొవ్వును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వారు వెల్లుల్లితో చేసిన ఆహారాలను అధికంగా తినడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చు.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను, విషాలను తొలగించే శక్తి వెల్లుల్లికి ఉంటుంది. వెల్లుల్లిని మెత్తగా దంచి పేస్టులా చేసి నూనెలో వేయించి, చిటికెడు పసుపు, ఉప్పు వేసి కలుపుకొని అన్నంతో ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. పొట్టనొప్పి రాకుండా అడ్డుకుంటుంది. పిల్లలకు ఎలాగైనా వెల్లుల్లితో చేసిన వంటకాలను తినిపించడం అలవాటు చేయాలి. ప్రతిరోజు వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను వెల్లుల్లి తగ్గిస్తుంది. కాబట్టి గుండెపోటు వంటిది రాకుండా ఉంటాయి. అలాగే రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు కూడా రావు. అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా వెల్లుల్లి ముందుంటుంది. కాబట్టి తరచూ వెల్లుల్లి రసాన్ని తయారు చేసుకొని తినడం అలవాటు చేసుకోండి.

Whats_app_banner