Thotakura Vellulli Karam: తోటకూర వెల్లుల్లి కారం... ఈ రెసిపీ ఒక్కసారి చేసుకుని చూడండి, అన్నంలో అదిరిపోతుంది
Thotakura Vellulli Karam: తోటకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎప్పుడూ ఒకేలా వండుకుంటే రుచిగా ఉండదు, ఒకసారి ఇలా వెల్లుల్లి కారం వేసి తోటకూర వేపుడు చేయండి... అది అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది.
Thotakura Vellulli Karam: పప్పు టమాటా వండుకున్నప్పుడు దానికి జతగా ఈ తోటకూర వెల్లుల్లి కారం చేసుకుని చూడండి. పప్పన్నంలో ఈ తోటకూర రెసిపీని నంజుకుని తింటే ఆ టేస్టే వేరు. అలాగే అన్నంలో ఈ వేపుడను కలుపుకున్నా రుచిగా ఉంటుంది. తోటకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల పిల్లలకు పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఇప్పడు చూద్దాం.
తోటకూర వెల్లుల్లి కారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
తోటకూర - మూడు కట్టలు
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అరస్పూను
పచ్చి శెనగపప్పు - అరస్పూను
ఎండు మిర్చి - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి కారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ధనియాలు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
జీలకర్ర - ఒక స్పూను
ఎండుమిర్చి - నాలుగు
ఉప్పు - చిటికెడు
తోటకూర వెల్లుల్లి కారం రెసిపీ
1. ముందుగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి.
3. వాటిని మిక్సీజార్లో వేయాలి. అందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా రుబ్బుకోవాలి. అంతే వెల్లుల్లి కారం రెడీ అయినట్టే.
4. ఇప్పుడు తోటకూర వెల్లుల్లి కారం వండేందుకు సిద్ధమవ్వాలి.
5. కళాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు వేసి వేయించుకోవాలి.
6. అందులోనే సన్నగా తరిగిన తోటకూరను అందులో వేసి వేయించాలి. పసుపును కూడా వేసి కలుపుకోవాలి.
7. రుచిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
8. తోటకూర దగ్గరగా మగ్గాక వెల్లుల్లి కారం పొడిని వేసి కలుపుకోవాలి.
9. చిన్న మంట మీద ఉంచితే వేపుడు రెడీ అయిపోతుంది.
10. దీన్ని అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది.
తోటకూర తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అధిక బరువు ఉన్న వారు తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. తోటకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి, రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఇందులో ఉండే పీచు ఎంతో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లలకు తోటకూర తినిపించడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.
ఇక ఇందులో వాడిన వెల్లుల్లిలో మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని విషాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. పొట్ట నొప్పి వంటివి రాకుండా ఉంటాయి.
టాపిక్