Chicken Fry: వెల్లుల్లికారంతో చికెన్ ఫ్రై చేయండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది
Chicken Fry: నాన్ వెజ్ ప్రియులకు చికెన్‌తో చేసిన వంటకాలు అంటే చాలా ప్రీతి. ఎప్పుడూ ఒకేలాంటి వేపుళ్ళు చేసే కన్నా... కొత్తగా వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రైను చేసి చూడండి. రుచి అదిరిపోతుంది.
Chicken Fry: చికెన్ ఫ్రై పేరు వింటేనే ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోవడం ఖాయం. ఎప్పుడూ ఒకేలాగా చికెన్ వేపుడు, చికెన్ కర్రీ, చికెన్ బిర్యాని చేసుకునే బదులు ఒకసారి కొత్తగా వెల్లుల్లి కారాన్ని వేసి చికెన్ ఫ్రై చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. వెల్లుల్లి కారం విడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చికెన్ ఫ్రై లో ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేస్తే ఆ వేపుడు మరింత రుచిగా మారుతుంది. ఇది కేవలం సాంబార్ అన్నంతో, బిర్యానితోనో జతగా తినేందుకే కాదు... స్నాక్స్ గా తినేందుకు ఉపయోగపడుతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది.
వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకిలో
టమోటా - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నిమ్మరసం - అరస్పూను
నీరు - తగినన్ని
నూనె - మూడు స్పూన్లు
వెల్లుల్లి కారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
యాలకులు - రెండు
జీలకర్ర - ఒక స్పూను
మిరియాలు - అర స్పూను
లవంగాలు - నాలుగు
కారం - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
ధనియాలు - రెండు స్పూన్లు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై రెసిపీ
1. ముందుగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర ,మిరియాలు, ధనియాలు అన్నీ ఒకసారి వేయించి మిక్సీ జార్లో వేయాలి.
2. అందులోనే కారం, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి పొడి చేసుకోవాలి.
3. అంతే వెల్లుల్లి కారం రెడీ అయినట్టే. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి సిద్ధం చేసుకోండి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. నూనె వేడెక్కాక చికెన్ వేసి కలపాలి.
6. పైన మూత పెట్టి కాసేపు ఉంచితే చికెన్ లోని నీరు దిగుతుంది.
7. ఆ నీరు బాగా ఇంకిపోయాక ఉల్లిపాయలు, టమోటోలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు,కారం, ఉప్పు, కరివేపాకులు వేసి బాగా వేయించాలి.
8. చిన్న మంట మీద పెట్టి దీన్ని ఫ్రై చేయాలి.
9. తర్వాత వెల్లుల్లి కారం పేస్టును కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి.
10. చివర్లో కొత్తిమీర తరుగును, కరివేపాకులను జల్లుకొని స్టవ్ కట్టేయాలి.
11. అది చల్లారాక నిమ్మ రసాన్ని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
12. ఇది వేడి వేడిగా తింటే నోరూరిపోతుంది.
సాధారణ చికెన్ ఫ్రై కన్నా.. ఇలా వెల్లుల్లి కారాన్ని వేసిన చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. చికెన్‌తో పాటు వెల్లుల్లిలోని పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడినవారు కచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేస్తే మంచిది. ఇది శరీర బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. ఈ రెసిపీలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
టాపిక్