Cardamom: పండగకు ముందు యాలకులతో ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి, చర్మం మెరిసిపోతుంది
Cardamom: చర్మం సౌందర్యం కోసం యాలకులను వాడొచ్చు. వీటిలో ఉండే సుగుణాలు చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. యాలకులతో వివిధ రకాల ఫేస్ ప్యాక్స్, స్క్రబ్స్ ఎలా చేయొచ్చో చూడండి.
పచ్చగా, చిన్నగా మొగ్గల్లాగా ఉండే యాలకులకు భారతీయ వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. వాటి వాసన, సుగుణాల వల్ల మసాలా టీ నుంచి మొదలుకుని బిర్యానీల వరకు వాడతారు. అయితే వంటల్లోనే కాకుండా వాటికున్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల చర్మ సౌందర్యానికి అవి సాయపడతాయి. వాటిని మీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకుంటే మెరిసే చర్మం సొంతమవుతుంది. దానికోసం యాలకులను ఎలా వాడాలో చూడండి.
యాలకులను చర్మానికి ఎలా వాడాలి?
స్క్రబ్ నుంచి మాస్క్ దాకా యాలకులను రకరకాలుగా వాడుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
1. యాలకులతో ఫేస్ స్క్రబ్:
చర్మం మీదున్న మృతకణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చాలంటే స్క్రబ్ చేయడం తప్పనిసరి. ఈసారి యాలకులను వాడి స్క్రబ్ చేయండి. వెంటనే మార్పు తెలుస్తుంది. దానికోసం ఒక టీస్పూన్ యాలకుల పొడి, ఒక చెంచాడు తేనె, చెంచాడు పంచదార చాలు. వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి వలయాకారంలో రుద్దుతూ మర్దనా చేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే ఫలితం ఉంటుంది.
2. యాలకులతో హైడ్రేషన్ మాస్క్:
చర్మానికి కావాల్సిన తేమ అందితే అది ఆరోగ్యవంతంగా ఉంటుంది. లేదంటే నిర్జీవంగా మారిపోతుంది. దానికోసం చెంచాడు యాలకుల పొడి, 2 చెంచాల తేనె ఉంటే చాలు. తేనె సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంజ్ గుణాలు చర్మాన్ని తాజాగా మారుస్తాయి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటయ్యాక కడిగేసుకుంటే చాలు.
3. యాలకులతో లిప్ స్క్రబ్:
చెంచాడు యాలకుల పొడి, చెంచాడు పంచదార, చెంచాడు తేనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుని మర్దనా చేస్తే స్క్రబ్ లాగా పనిచేస్తుంది. పెదాల మీద పేరుకున్న మృతకణాలను తొలిగించి పెదాలను ఆరోగ్యంగా మారుస్తుంది. ఒక పది నిమిషాల తర్వాత కడిగేసుకుని లిప్ బామ్ రాసుకుంటే సరిపోతుంది.
4. యాలకులతో ఫేస్ ప్యాక్:
ముఖంలో తాజాదనం రావాలంటే ఈ ప్యాక్ ట్రై చేయండి. యాలకుల పొడి, పసుపు, నిమ్మరసం తీసుకుని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. పావుగంటయ్యాక చల్లటి నీటితో కడిగేసుకోండి. చర్మంలో మార్పు కనిపిస్తుంది.
5. ఫేస్ టోనర్:
చెంచాడు యాలకుల పొడిని కప్పు రోజ్ వాటర్ లో కలపండి. అలా కనీసం అరగంట నుంచి గంట పాటూ వదిలేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా వడకట్టండి. దీన్ని టోనర్ లాగా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే అవసరం ఉన్నప్పుడు దూది ఉండను ముంచి ముఖానికి రాసుకోవచ్చు.
సైడ్ ఎఫెక్ట్స్:
సాధారణంగా యాలకులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ సున్నిత చర్మం ఉన్నవాళ్లు మాత్రం ఒకసారి పరీక్షించుకుంటే మంచిది. చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడాలి. దురద, మంట, దద్దుర్లు, చర్మం ఎరుపెక్కడం లాంటివి అనిపిస్తే వెంటనే కడిగేసుకోండి. అలాగే ఎక్కువ మోతాదులో యాలకులను వాడితే చర్మం పొడిగా మారిపోతుంది. కాబట్టి తగినంత వాడితే చాలు.