Honey Coated Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తేనెతో కలిపి తినండి.. రుచి, ఆరోగ్యం రెట్టింపు-benefits of eating honey coated dry fruits for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Honey Coated Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తేనెతో కలిపి తినండి.. రుచి, ఆరోగ్యం రెట్టింపు

Honey Coated Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తేనెతో కలిపి తినండి.. రుచి, ఆరోగ్యం రెట్టింపు

Koutik Pranaya Sree HT Telugu
Sep 20, 2024 10:30 AM IST

Honey Coated Dry Fruits: డ్రై ఫ్రూట్స్ సాధారణంగా తినడం కన్నా తేనెతో కలిపి తినడం వల్ల మరిన్ని లాభాలు పొందొచ్చు. అవేంటో చూసి మీరూ అలవాటు చేసుకోవచ్చు.

తేనె కలిపిన డ్రై ఫ్రూట్స్
తేనె కలిపిన డ్రై ఫ్రూట్స్ (freepik)

మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తాజా కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ లాంటి ఆహారాలను తింటూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్‌ మన ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాలు చూపిస్తాయి. వాటిని తేనెలో రంగరించి తింటే ఆ ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఇలా తేనెతో కలిపి డ్రై ఫ్రూట్స్‌ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెల్సుకోండి.

శరీర ఆరోగ్యం బలోపేతం :

తేనెలోను పుష్కలంగా పోషకాలు ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్‌లోనూ సమృద్ధిగా పోషకాలు లభిస్తాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల మరింత ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

బలాన్ని ఇస్తాయి :

ఈ రెండింటిలోనూ సహజమైన చక్కెరలు ఉంటాయి. అవి మనకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. మన రోజు వారీ పనులకు అవసరమైన బలాన్ని సమకూరుస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రం దీనికి దూరంగా ఉండాల్సిందే. తేనె కూడా శరీరంలో చక్కెర స్థాయులను పెంచేస్తుంది.

జీర్ణ సమస్యలు దూరం :

చాలా మందికి జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఏం తిన్నా అరగక పోవడం, పొట్ట ఉబ్బరం, గ్యాస్‌ లాంటి సమస్యలు చాలా ఇబ్బందులు పెడుతుంటాయి. దీంతో వీరు దేన్నీ మనస్ఫూర్తిగా తినలేని స్థితికి వచ్చేస్తారు. ఇలాంటి వారు డ్రై ఫ్రూట్స్‌ని తేనెతో కలిపి తీసుకోవాలి. వీటిలో డైటరీ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి అరుగుదల సక్రమంగా కావడానికి సహకరిస్తాయి. పేగుల కదలికను వేగవంతం చేసి సజావుగా మల విసర్జన జరగడంలో సహకరిస్తాయి. దీంతో మొత్తం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగవుతుంది.

గుండెకు ఆరోగ్యం :

ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు... లాంటి డ్రై ఫ్రూట్స్‌లో పొటాషియం, ఫైబర్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు లాంటివి ఉంటాయి. వీటిని తేనెతో కలిపి తినడం వల్ల ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రక్త వృద్ధి :

రక్త హీనత సమస్యలు ఉన్న వారు రోజూ వీటిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బాదం, ఖర్జూరం, అంజీర, ఎండుద్రాక్షల్లో మినరళ్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ మనలో హిమోగ్లోబిన్‌ని పెంచేందుకు సహకరిస్తాయి.

దీర్ఘ కాలిక వ్యాధులు దూరం :

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉంటాయి. వీటితో పోషకాలు నిండిన డ్రై ఫ్రూట్స్‌ చేర్చి తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తేనెలో ఉండే లక్షణాలు శరీరంలో వచ్చే ఫ్రీ రాడికల్స్‌ని ఎదుర్కొని దీర్ఘ కాలిక వ్యాధులను దరి చేరకుండా చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

Whats_app_banner

టాపిక్