Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ను ఆ సమయంలో తినకూడదు, తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో డ్రై ఫ్రూట్స్ ఒక భాగమే. అయితే వీటిని తినడానికి ఒక సమయం ఉంది. కొన్ని సమయాల్లో వీటిని తింటే కొన్ని రకాల సమస్యలు రావచ్చు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తినకూడదో తెలుసుకుందాం.
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు సిఫారసు చేస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉంటారు. ఇందులోని పోషకాలు శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ మన శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. అలాగే తినకూడని సమయాల్లో వీటిని తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇవి ఏ సమయంలో తినాలో, ఏ సమయంలో తినకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో తినడం వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది.
కిస్‌మిస్‌లు
ప్రతి ఇంట్లోనూ కిస్‌మిస్‌లు ఉంటాయి. ఇవి పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైనవి. అయితే వీటిని ఉదయం పూట ఖాళీ పొట్టతో తినకూడదు. అలా తింటే రక్తంలో చక్కర స్థాయిలు అకస్మాత్తుగా పైకి పెరుగుతాయి. కాబట్టి ఖాళీ పొట్టతో వీటిని తినడం నివారించండి. వీటిని పెరుగులో భాగం చేసుకొని తినడం మంచిది. ఇవి సమతుల ఆహారంలో భాగమే అయినా ఖాళీ పొట్టతో తింటే మాత్రం చక్కెర స్థాయిలు అధికంగా పెరిగిపోతాయి.
అంజీర్
వీటిని అత్తి పండ్లు అని పిలుస్తారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అన్ని విధాలుగా మంచిదే. కానీ వీటిలో సహజంగానే చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి ఖాళీ పొట్టతో ఉదయాన్నే వీటిని తింటే కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా అనిపించడం వంటివి జరగవచ్చు. అంజీర్లను వేరే ఆహారంలో కలిపి తీసుకుంటే పోషకాలు సమతుల్యంగా ఉంటాయి. జీర్ణ అసౌకర్యం కలగకుండా ఉంటుంది.
ఖర్జూరాలు
ఖర్జూరాలు ప్రతిరోజూ రెండు నుంచి నాలుగు తినడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అయితే ఉదయం పూట అల్పాహారానికి ముందు వీటిని తినకూడదు. ముఖ్యంగా ఖాళీ పొట్టతో అసలు తినకూడదు. ఎందుకంటే దీన్లో చక్కెర ఎక్కువ శాతం ఉంటుంది. ఖర్జూరాలు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్టులు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అలా తింటే వారికి వెంటనే ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇతర ఆహారాలలో కలుపుకొని దీన్ని అల్పాహారాల్లో తినాలి. ఖర్జూరాలు ఒక్కటే తినడం మంచి పద్ధతి కాదు.
ఆప్రికాట్లు
డ్రై ఆప్రికాట్లు చూడగానే నోరూరిస్తాయి. ఒకటి తీసుకొని నమిలేయాలనిపిస్తుంది. దీనిలో పోషకాలు ఎక్కువే. అయితే ఇది కూడా సహజంగానే చక్కెర కంటెంట్ ను అధికంగా కలిగి ఉంటుంది. ఖాళీ పొట్టతో వీటిని అధికంగా తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకం కలగవచ్చు. దీన్ని చిరుతిండిగా భావించి చాలామంది ఆకలి వేసినప్పుడు వీటిని తినేస్తూ ఉంటారు. పొట్టలో ఏమీ లేనప్పుడు వీటిని తింటే జీర్ణ వ్యవస్థ అసౌకర్యంగా మారుతుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది.
ప్రూన్స్
నల్లటి ప్రూన్స్ అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. నలుపుగా ఉండే ఈ ఎండు ఫలాలు అధికంగా ఫైబర్ కంటెంట్ ను కలిగి ఉంటాయి. వీటిని ఇతర ఆహారాలతో కలిపి తింటే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అదే ఖాళీ పొట్టతో తింటే మాత్రం జీర్ణ అసౌకర్యం తప్పదు. వీటిని మితంగానే తినాలి. వీటిలో కూడా చక్కెర అధికంగానే ఉంటుంది. కాబట్టి అల్పాహారంలో భాగంగా ఖాళీ పొట్టతో తినడం మానుకోవాలి.
టాపిక్