Chicken Biryani: కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ వండి చూడండి, రుచికి దాసోహం అయిపోవాల్సిందే-try cooking chicken biryani with coconut milk you will be addicted to the taste ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Biryani: కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ వండి చూడండి, రుచికి దాసోహం అయిపోవాల్సిందే

Chicken Biryani: కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ వండి చూడండి, రుచికి దాసోహం అయిపోవాల్సిందే

Haritha Chappa HT Telugu
Apr 17, 2024 11:55 AM IST

Chicken Biryani: కొబ్బరిపాలతో టేస్టీ చికెన్ బిర్యానీ ఒకసారి చేసి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.

చికెన్ బిర్యాని
చికెన్ బిర్యాని (Pixabay)

Chicken Biryani: ఎప్పుడూ చికెన్ బిర్యాని ఒకేలా చేస్తే కొత్తగా ఏముంటుంది? కొబ్బరి పాలతో చేసి చూడండి. కొత్త రుచి వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది ఈ కొబ్బరిపాల చికెన్ బిర్యాని. దీన్ని చేయడం చాలా సులువు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. ఇలా ఫాలో అయితే చాలు. టేస్టీ చికెన్ బిర్యాని రెడీ అయిపోతుంది.

కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం - అరకిలో

చికెన్ - అరకిలో

ఉల్లిపాయ - ఒకటి

టమోటాలు - మూడు

దాల్చిన చెక్క - ఐదు

యాలకులు - ఆరు

లవంగాలు - ఎనిమిది

పచ్చిమిర్చి - ఐదు

జీడిపప్పు - గుప్పెడు

గరం మసాలా పొడి - అర స్పూను

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

బిర్యాని ఆకులు - రెండు

పెరుగు - రెండు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

కొబ్బరిపాలు - ఒక కప్పు

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

పుదీనా తరుగు - నాలుగు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

నెయ్యి - రెండు స్పూన్లు

నీరు - సరిపడినన్ని

కొబ్బరిపాలతో చికెన్ బిర్యాని రెసిపీ

1. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి.

2. ఈలోపు చికెన్ ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేయాలి.

3. ఆ గిన్నెలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు కలిపి ముక్కలకు బాగా పట్టించాలి.

4. మూడు గంటల పాటు పక్కన పెట్టాలి. అవి బాగా మ్యారినేట్ అవుతాయి.

5. ఆ తర్వాత పెద్ద ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.

6. ఆ నూనెలో దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, మెంతులు, యాలకులు వేసి వేయించాలి.

7. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి.

8. ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, కొత్తిమీర తరుగు, ఉప్పు, పుదీనా ఆకులు వేసి ఉడికించాలి.

9. టమోటాలు మెత్తగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉంచాలి.

10. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి.

11. ఒక పావుగంట సేపు ఉడికిస్తే చికెన్ 70% వరకు ఉడికిపోతుంది.

12. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుకోవాలి.

13. కొబ్బరిపాలను అందులో వేసి బాగా కలపాలి.

14. కొబ్బరి పాలు అన్నం ఉడకడానికి సరిపోకపోతే నీళ్లను కలుపుకోవచ్చు.

15. పది నిమిషాల పాటు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఉడికించాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.

16. ఆవిరిపోయాక మూత తీసి పైన నెయ్యిని వేసుకోవాలి.

17. అంతే కొబ్బరిపాలతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయినట్టే. దీన్ని తిని రైతాతో తింటే రుచి అదిరిపోతుంది.

ఈ కొబ్బరిపాలతో చికెన్ బిర్యానీ రెసిపీలో మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరిపాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ కూడా వారానికి రెండు మూడు సార్లు తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఇది నచ్చే రెసిపీ ఒకసారి ఇంట్లో చేసి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.

Whats_app_banner