Kaju Pakodi: జీడిపప్పు పకోడీ ఇలా ఇంట్లోనే చేయండి, అందరూ ఇష్టంగా తింటారు
Kaju Pakodi: జీడిపప్పు పకోడీ చేయడం చాలా కష్టం అనుకుంటాం, కానీ సులువుగా దాన్ని ఇంట్లోనే వండుకోవచ్చు. దీని రెసిపీ చాలా సులభం. పిల్లలు ఇష్టంగా తింటారు.
Kaju Pakodi: సాయంత్రమైతే పకోడీలు, బజ్జీలు తినేవారి సంఖ్య ఎక్కువే. పకోడీలలో ఖరీదైనది జీడిపప్పు పకోడీ. దీన్ని కొంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకసారి ఇంట్లోనే వండి చూడండి. టేస్టీగా ఉంటుంది. పైగా దీన్ని చేయడం చాలా సులువు. జీడిపప్పు పకోడీ చేశారంటే ముక్క మిగలకుండా అందరూ తినేస్తారు. కేవలం 20 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. జీడిపప్పు పకోడి రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
జీడిపప్పు పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
జీడిపప్పు - అరకప్పు
శెనగపిండి - ముప్పావు కప్పు
నెయ్యి - ఒక స్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
బియ్యప్పిండి - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకు - గుప్పెడు
అల్లం తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
ఇంగువ - చిటికెడు
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
జీడిపప్పు పకోడీ రెసిపీ
1. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోండి.
2. అందులోనే జీడిపప్పులను కూడా వేసి కలపండి.
3. ఇప్పుడు ఆ గిన్నెలో ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ నూనె, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపండి.
4. ఇప్పుడు నీరు వేసి మందంగా వచ్చేలా కలుపుకోండి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
6. నూనె వేడెక్కాక జీడిపప్పు మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోండి.
7. అవి బంగారు రంగులోకి మారేవరకు వేయించి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
8. టిష్యూ పేపర్లో ఈ జీడిపప్పు పకోడీలను వేస్తే అదనపు నూనెను పీల్చేసుకుంటుంది.
9. అంతే జీడిపప్పు పకోడీ రెడీ అయినట్టే.
10. దీన్ని పుదీనా చట్నీతో తిన్నా, సాస్ తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి చట్నీలు లేకపోయినా ఇవి రుచికరంగానే ఉంటాయి.
జీడిపప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి జీడిపప్పులు తినడం చాలా అవసరం. ఎవరైతే యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడతారో వారు జీడిపప్పులు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే డయాబెటిస్‌తో ఉన్నవారు కూడా జీడిపప్పులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ పప్పులో కాపర్, జింక్ ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు జీడిపప్పుతో చేసిన పకోడీలు తినిపించడం వల్ల ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అవి టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలు వద్దనకుండా తినేస్తారు. జీడిపప్పు పకోడీ రెసిపీ చాలా సులువు. బయటకొనే కన్నా ఇంట్లో చేయడం వల్ల మీకు డబ్బు మిగులుతుంది కూడా.