Coconut Water Or Milk: బరువు తగ్గడానికి కొబ్బరి నీరు, కొబ్బరి పాలు మేలు చేస్తాయా?
Coconut Water Or Milk: బరువు తగ్గడానికి డైట్‌లో కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు చేర్చుకోవడం ఎంత వరకూ మంచిదనే సందేహం ఉంటుంది. ఆ వివరాలు, పోషక విలువలు, వాటి ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకోండి.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా పెరిగిపోయి ఊబకాయంతో బాధ పడుతున్నారు. అలాంటి వారు అనారోగ్య కారణాల వల్ల మళ్లీ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆహారంలో మార్పులు, వ్యాయామాల ద్వారా వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్ట పడుతూ ఉంటారు. ఇలాంటి ఆలోచనల్లో ఉన్న వారు చాలా మంది కొబ్బరి నీటిని తాగేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గేందుకు కొబ్బరి పాలు ఉపయోగపడతాయా? లేదంటే కొబ్బరి నీళ్లా? అంటే.. అందుకు ఆరోగ్య నిపుణులు ఏమి చెబుతున్నారంటే..
కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు:
శరీరంలోని అదనపు కొవ్వులు అన్నీ తగ్గి సరైన ఆకృతిలో ఉండేందుకు కొబ్బరి నీరు, కొబ్బరి పాలు రెండూ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మిగిలిన చక్కెరలతో నిండిన ఎనర్జీ డ్రింక్‌ల కంటే ఇవి బరువు తగ్గేందుకు ఎంతగానో సహకరిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువ. అలాగే ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అందువల్ల జీర్ణ, జీవ క్రియలు మెరుగవుతాయి. తద్వారా కొవ్వులు కరిగి బరువు తగ్గేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
కొబ్బరిని మిక్సీ చేసి వడగట్టడం ద్వారా కొబ్బరి పాలను తీస్తారు. వీటిలో పోషకాలు మరింత ఎక్కువగా లభిస్తాయి. అయితే కొబ్బరి నీళ్లలోనూ అంతే ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇవి రెండూ కూడా బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి ఆప్షన్లేనని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల డైటింగ్‌లో ఉన్నా కూడా కాస్త రుచికరంగా ఆహారాలను తీసుకోవచ్చని అంటున్నారు. ఆహారం మధ్యలో, ఆహారంలో కూడా కొబ్బరి పాలను చేర్చుకోవచ్చు. వాటితో తొందరగా కడుపు నిండినట్లూ అనిపిస్తుంది. కొబ్బరిపాలు, నీళ్లతో రకరకాల రిఫ్రెషింగ్ డ్రింకులూ చేసుకుని తాగొచ్చు.
డైట్ ప్లాన్ ఎలా ఉండాలి?
బరువు తగ్గాలనుకునే వారు ఇవి రెండింటినీ నిరభ్యంతరంగా డైట్‌లో భాగంగా తీసుకోవచ్చు. అయితే బరువు తగ్గుదల అనేది మరిన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొబ్బరి నీరు, పాలు తీసుకున్నంత మాత్రాన తగ్గుదల కనిపిస్తుందని లేదు. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలను మితంగా తీసుకుంటూ ఉండాలి. అందుకోసం ప్రత్యేకంగా డైట్ ప్లాన్‌ని ప్రణాళిక చేసుకోవాలి. అందులో ఈ కొబ్బరి నీరు, పాలకు చోటివ్వాలి. అందువల్ల తక్కువగా తిన్నా పోషకాహారాన్ని తినగలుగుతారు. అలాగే రోజూ అర గంట నుంచి గంట సేపు వ్యాయామాలు చేయాలి. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, శీతల పానీయాల్లాంటి వాటికి దూరంగా ఉంటూ ఆహారం తీసుకోవడం చాలా తగ్గించాలి. అప్పుడు మాత్రమే శరీరం పేరుకు పోయిన కొవ్వుల్ని శక్తి కోసం కరిగించుకోవడం మొదలు పెడుతుంది. ఇలా కాకుండా ఎప్పటి లాగానే సాధారణంగా కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినేస్తూ, కదలిక లేకుండా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు.