Thursday Motivation : అంబానీ జీవితంలో ఉన్నవి రోజుకు 24 గంటలే.. మనకు కూడా అంతే..-thursday motivation we have 24 hours time in a day you must have time auditing in life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : అంబానీ జీవితంలో ఉన్నవి రోజుకు 24 గంటలే.. మనకు కూడా అంతే..

Thursday Motivation : అంబానీ జీవితంలో ఉన్నవి రోజుకు 24 గంటలే.. మనకు కూడా అంతే..

Anand Sai HT Telugu
May 30, 2024 05:00 AM IST

Thursday Motivation In Telugu : జీవితంలో విజయవంతమైన వ్యక్తులకు, ఇతరులకు కూడా ఉండేవి 24 గంటలే. కానీ ఎప్పుడూ మనం మాత్రం సమయం లేదు అని ఫిర్యాదులు చేసుకుంటాం. కానీ సరైన ప్రణాళిక ప్రకారం వెళితే 24 గంటలు కూడా సరిగా వాడుకోవచ్చు.

సమయం విలువ తెలుసుకోండి
సమయం విలువ తెలుసుకోండి

విలువైనవి అంటే మనం చాలా విషయాలకు చెబుతాం. కానీ ఈ ప్రపంచంలో సమయం అంత విలువైనది మరొకటి లేదు. ప్రాణాన్ని కూడా డిసైడ్ చేసేది సమయమే. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తే కాస్త ముందుగా తీసుకొచ్చి ఉంటే.. బతికించేవాళ్లమని చెబుతారు. అంటే ఇక్కడ కూడా సమయమే మనిషి బతుకును డిసైడ్ చేస్తుంది. సమయం విలువను గుర్తించినవారే ఈ ప్రపంచంలో విజయం సాధిస్తారు. గడిచిన ప్రతి క్షణం తిరిగి పొందలేం.

సమయం వృథా, సమయం లేదు అనే పదాన్ని మనం రోజుకు ఎన్నిసార్లు ఉపయోగిస్తామో ఆలోచించండి. దేనికీ సమయం లేదు, అస్సలు సమయం లేదు, నిద్రించడానికి కూడా సమయం లేదు అని విని.. విని విసుగు వస్తుంది. సమయం మీద ఫిర్యాదు చేయని వ్యక్తులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారే జీవితంలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే వారికి సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసు.

నిజంగా చెప్పాలంటే సమయం లేదు అనే పేదరికంలో అందరం పడి చస్తున్నాం. సమయం ఉంది.. పని చేయాలి అనుకున్నవారు.. ధనవంతులు అవుతున్నారు. ఏ పని చేసినా, ఎలా చేసినా 24 గంటల్లో లేదా నిద్రపోయే సమయం మినహా మిగిలిన సమయంలో పూర్తి చేయలేని స్థితిని సమయ పేదరికం అని అనుకోవచ్చు.

సమయ పేదరికం అంటే ఒక వ్యక్తికి పనులు చేయడానికి తగినంత సమయం లేదు అని అర్థం. ఇది చాలా సాధారణమైనది. సమయం లేదు అనే విషయం కేవలం మీ అభివృద్ధిని మాత్రమే కాదు.. మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఎందుకంటే ఇది ఆహారపు అలవాట్లను మార్చగలదు. ఏది పడితే అది తినేలా చేస్తుంది. చివరకు ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా సమయం లేదు అనే పరిస్థితిలోకి వస్తారు.

జీవితంలో గొప్ప గొప్ప వాళ్లకు కూడా సమయం 24 గంటలే ఉంటుంది. అంతెందుకు మన అందరికీ తెలిసి అంబానీకి కూడా 24 గంటలే. కానీ ఆయన మాత్రం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసి ఉంటుంది. సరైన ప్రణాళిక ఉంటుంది. మనకు లేనిది అదే.

రోజులో కొంచెం ఎక్కువ సమయం ఉంటే బాగుండు అని చాలా మంది కోరుకుంటారు. 24 గంటల కంటే ఎక్కువ సమయం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? దానికోసం మీరు ఎంత ప్రయత్నించినా కుదరదు. కానీ అందుబాటులో ఉన్న సమయాన్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటే, సమయం సరిపోదు అనే ఫిర్యాదు ఉండదు.

పని చేయడానికి ప్రయత్నించే ముందు మీరు ఒక రోజులో మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో గుర్తించండి. దీనిని టైమ్ ఆడిటింగ్ అని పిలవవచ్చు. ప్రతి చిన్న విషయానికి వెచ్చించే సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సమయాన్ని ఇలా చెక్ చేసుకుంటే.. సమయాన్ని ఆదా చేయడానికి ఎక్కడ మార్పులు చేయవచ్చో మీకు తెలుస్తుంది. ఉదాహరణకు, వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని మీరు గుర్తిస్తే, దాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి.

సమయాన్ని ఆదా చేయడానికి ఉత్తమ మార్గం ఇతరుల సమయాన్ని లాక్కోవడం. ఇది ఎలా అంటారా? ఉదాహరణకు, ఇంటి పనుల్లో మీకు సహాయం చేయమని ఒకరిని అడగండి. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా మాత్రమే కాకుండా, ఇంటి పనులు, ఆఫీసు పనులను ఇతరులతో పంచుకోవడం కూడా సమయాన్ని ఆదా చేయడానికి గొప్ప మార్గం.

సమయం వృథా అనే భావనను తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి మనం సాధించిన విజయాలను రాయడం. ప్రతిరోజూ మనం ఏం సాధించామో తెలుసుకోవడం మనకు ఆత్మ తృప్తిని ఇస్తుంది. ఈ అలవాటు ప్రతిరోజూ కొత్త పనులను తీసుకోకుండా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. జీవితంలో నో చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే చాలా దరిద్రాలు నో చెప్పడం ద్వారానే పోతాయి. మీకు అవసరంలేని పని ఎవరైనా అడిగితే నో చెప్పేయండి. అలా అయితే మీకు చాలా సమయం సేవ్ అవుతుంది

WhatsApp channel