Brain Stroke: రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకునే శక్తి ఉన్న ఆహారం ఇదే
Brain Stroke: శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తే ఎంతో ప్రాణాంతకంగా మారిపోతాయి. అవి రాకుండా ముందు నుంచే అడ్డుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా బ్రోకలీని తినడం అలవాటు చేసుకోవాలి.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనిషికి వచ్చే ప్రాణాంతక సమస్యల్లో ఒకటి. ఇది ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. ఇది వైద్యపరమైన అత్యవసరమైన పరిస్థితి. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన వారిలో కొంతమంది త్వరగా రికవరీ అవుతారు. కొందరు మాత్రం జీవితాంతం వైకల్యం బారిన పడతారు. దీని బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవాలి. ముఖ్యంగా బ్రోకలీ తినడం అలవాటు చేసుకోవాలి.
రోజువారీ ఆహారంలో చేర్చాల్సిన ఆరోగ్యకరమైన ఆకుపచ్చ కూరగాయలలో ఒకటి బ్రోకలీ. బ్రోకలీని ఇష్టంగా తినేవారి సంఖ్య తక్కువే. కానీ ఇది చేసే మేలు మాత్రం ఎక్కువ. ఆస్ట్రేలియాలోని హార్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఒక అధ్యయనం ప్రకారం బ్రోకలీలో కనిపించే సల్ఫోరాఫేన్ సమ్మేళనం స్ట్రోక్ నివరణకు, చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందని తేలింది.
బ్రోకలీ ఎలా నిరోధించగలదు?
స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రవాహాన్ని ఆగడం వల్ల వచ్చే పరిస్థితి. ఇది శాశ్వత వైకల్యం లేదా మరణానికి దారితీస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రతి సంవత్సరం వేలాది మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఇది ప్రధానంగా మెదడులో రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. దీనిని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు.
అయితే, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడటానికి బ్రోకలీ ఎంతో ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం తేల్చింది. బ్రోకలీలో సహజ సమ్మేళనం ఉందని, ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, రక్తం గడ్డకట్టే సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందుల ప్రభావాన్ని కూడా పెంచుతుందని అధ్యయనం పేర్కొంది. అందువల్ల, ప్రతిరోజూ బ్రోకలీ తీసుకోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
హార్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ జుయు లియు ఒక మీడియా ప్రకటనలో, సాధారణంగా ఇస్కీమిక్ స్ట్రోక్ ఉన్న రోగికి కణజాల ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఇది 20 శాతం కేసులలో మాత్రమే విజయవంతమవుతుంది. కానీ రోగికి మందులతో పాటు బ్రోకలీలో ఉన్న సమ్మేళనంతో చికిత్స చేసినప్పుడు, ఇది 60 శాతం విజయవంతమయ్యే అవకాశం ఉంది. రక్తం గడ్డకట్టకుండా అడ్డుకోవడానికి, స్ట్రోక్ ను నివారించడానికి బ్రోకలీలో ఉన్న సమ్మేళనం కూడా ఉపయోగించాలని అధ్యయనం తేల్చింది.
బ్రోకలీ తినడం ద్వారా ఆ సమ్మేళనం శరీరంలో చేరేలా చేయవచ్చు. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ గుప్పెడు బ్రోకలీని తినడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. గందరగోళంగా అనిపిస్తుంది. సరిగా నడవలేరు. తూగుతూ పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వికారంగా, వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. మైకం కమ్మినట్టు అవుతుంది. కంటిచూపులో సమస్యలు వస్తాయి. శరీరంలోని ఒక వైపు తిమ్మరిపట్టినట్టు అవుతుంది. మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. అలాగే ఎదుటివారు చెప్పేది కూడా అర్థం చేసుకోలేరు.
టాపిక్