Silent Brain Stroke: సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, ఇవి ఎందుకు వస్తాయంటే
Silent Brain Stroke: మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఎక్కువ కాలం జీవించగలుగుతారు. కానీ సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ ఈ మధ్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తుందో, ఎవరికి వస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దీని లక్షణాలు, చికిత్స గురించి కూడా అవగాహన పెంచుకోవాలి.
మెదడు ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ముఖ్యంగా మెదడుకు బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ లో ప్రధాన రకం సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్. ఈ నిశ్శబ్ధ బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికి, ఎప్పుడు వస్తుందో ముందుగా అంచనా వేయడం కష్టమే. అందుకే దానికి ‘సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్’ అని పిలుస్తారు.
సాధారణ బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా కాకుండా నిశ్శబ్ద మెదడు స్ట్రోక్ ఎలాంటి లక్షణాలు చూపించవు. దీన్ని నిశ్శబ్ద సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలుస్తారు, నిశ్శబ్ద మెదడు స్ట్రోక్ వచ్చే ముందు హఠాత్తుగా బలహీనంగా అనిపిస్తుంది, మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ రాఘవేంద్ర రామదాసి హెచ్‌టి లైఫ్ స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "బ్రెయిన్ స్ట్రోకులు మెదడు కణజాలానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితి అభిజ్ఞా క్షీణతకు దారితీస్తాయి. భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్న చిన్న స్ట్రోకులు కూడా వచ్చిపోతుంటాయి. నిశ్శబ్ద స్ట్రోకులు మెదడులోని ఒక భాగంలో ఎటువంటి లక్షణాలను కలిగించకుండా సంభవిస్తాయి. నిశ్శబ్ద స్ట్రోకులు రావడం వల్ల సమీప భవిష్యత్తుతో పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీ మెదడుకు తీవ్రంగా హాని కలిగిస్తుంది’ అని చెప్పారు.
సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయి?
మెదడులోని ఒక భాగానికి రక్త ప్రవాహం తాత్కాలికంగా ఆగినప్పుడు నిశ్శబ్ద మెదడు స్ట్రోకులు సంభవిస్తాయి. ఇది కణజాల మరణానికి దారితీస్తుంది. రక్తం గడ్డకట్టడం, రక్త నాళాలు ఇరుకుగా మారడం, అథెరోస్క్లెరోసిస్ (ధమనులలో ఫలకం ఏర్పడటం) వల్ల సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది.
సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎవరికి వస్తాయి?
వృద్ధులు: వయస్సు ప్రధాన ప్రమాద కారకం. సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను వేగవంతం చేస్తుంది.
అధిక రక్తపోటు: హైబీపీతో ఉన్న వారు సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
డయాబెటిస్: మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
హృదయ సంబంధ వ్యాధులు: గుండె జబ్బులు వచ్చిన వారు లేదా కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నా కూడా వారి వారసులకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిశ్చల జీవనశైలి: శారీరక శ్రమ చేయకుండా ఎక్కువ సేపు కూర్చున్నవారిలో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ సంకేతాలు
సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ సాధారణంగా ఎలాంటి లక్షణాలను చూపించవు. అయితే సూక్ష్మంగా పరిశీలిస్తే మాత్రం కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. జ్ఞాపకశక్తి ఒక్కోసారి కోల్పోవడం, అభిజ్ఞా క్షీణత, మూడ్ స్వింగ్స్, శరీరంలో సమన్వయం తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రాణాంతకమా?
సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ వెంటనే ప్రాణాంతకం కానప్పటికీ, అవి భవిష్యత్తులో అతి పెద్ద సమస్యకు కారణంగా మారవచ్చు. అవి పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మెదడు పనితీరును క్రమంగా బలహీనంగా మారుతుంది.
సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా….
రక్తపోటును నిర్వహించండి: ఆరోగ్య సమస్యలను నివారించడానికి రక్తపోటును అదుపులో ఉంచుకోండి. పెరగకుండా చూసుకోండి.
డయాబెటిస్ నియంత్రణ: ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకోండి. డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు అధికంగా తినాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతి రోజూ అరగంట వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.
ధూమపానం, మద్యపానం: సిగరెట్ తాగడం, మద్యం తాగడం… ఈ రెండూ హానికరమైన అలవాట్లు. ఇవి రెండూ స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.
టాపిక్