Kotimeera: ఇంట్లోనే కొత్తిమీరను మట్టి లేకుండా నీటితో పెంచేయండిలా, చాలా సింపుల్ పద్ధతి ఇది-this is a very simple way to grow coriander at home with water without soil ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kotimeera: ఇంట్లోనే కొత్తిమీరను మట్టి లేకుండా నీటితో పెంచేయండిలా, చాలా సింపుల్ పద్ధతి ఇది

Kotimeera: ఇంట్లోనే కొత్తిమీరను మట్టి లేకుండా నీటితో పెంచేయండిలా, చాలా సింపుల్ పద్ధతి ఇది

Haritha Chappa HT Telugu
Nov 04, 2024 12:06 PM IST

Kotimeera: కొత్తిమీర ప్రతి వంటకి అవసరమైనది. ప్రతి కూరా, బిర్యానీలో కొత్తిమీరను చల్లితేనే రుచి వచ్చేది. అయితే ఇంట్లోనే కొత్తిమీరను చాలా సులువుగా ఎలా పెంచాలో తెలుసుకోండి.

కొత్తిమీర పెంచడం ఎలా?
కొత్తిమీర పెంచడం ఎలా?

కొత్తిమీర లేకపోతే ఏ బిర్యానీకి సువాసన రాదు. ఏ కూర కూడా పూర్తికాదు. ఏది వండినా చివర్లో రెండు స్పూన్ల కొత్తిమీర తరుగు పడాల్సిందే. అందుకే కొత్తిమీర డిమాండ్ పెరిగిపోతుంది. నిజానికి దీన్ని ప్రతిరోజు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సింపుల్ గా పండించుకోవచ్చు. కొంతమంది ఇంట్లో పండించడం వల్ల మట్టి ఇంట్లో చేరుతుందని భయపడతారు. ఇక్కడ మేము మట్టి అవసరం లేకుండా నీటిలోనే కొత్తిమీరను సింపుల్‌గా ఎలా పెంచాలో చెప్పాము. ఇది ఫాలో అయిపోండి.

మట్టి లేకుండా కొత్తిమీర పెంచడం

మట్టి లేకుండా మొక్కలను పెంచే పద్ధతిని హైడ్రోపోనిక్ అంటారు. ఇదొక రకమైన వ్యవసాయం అనే చెప్పాలి. కేవలం నీటితోనే ఈ మొక్కలను పెంచుతారు. కొత్తిమీరను కూడా ఈ హైడ్రోపోనిక్ పద్ధతిలో పెంచవచ్చు.

కొత్తిమీరను మట్టి లేకుండా నీటితోనే పెంచేందుకు ఏమేం కావాలో తెలుసుకోండి. కొన్ని ధనియాల గింజలు, ఒక పాత్ర, ఆ పాత్రలో పట్టే మెష్ గిన్నె అంటే రంధ్రాలు ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి. ఇవి ఉంటే చాలు మట్టి అవసరం లేకుండా ధనియాలను సులువుగా పెంచవచ్చు.

ధనియాల గింజలను తీసుకొని వాటిని కాస్త దంచి ముక్కలుగా చేయండి. అలానే పొడిలా చేసేయవద్దు విత్తనాలన్నీ విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నీటిని వేయండి. ఆ నీరు పరిశుభ్రమైనవని నిర్ధారించుకోండి. ఎందుకంటే మనం మట్టి లేకుండా కొత్తిమీరని పెంచాలనుకుంటున్నాం. కాబట్టి నీటిలో అత్యవసరమైన పోషకాలు ఉండడం చాలా అవసరం. మీరు తాగే నీటిని ఈ కొత్తిమీరని పెంచడానికి ఉపయోగిస్తే మంచిది. నీటితో నిండిన గిన్నె మీద రంధ్రాలు ఉన్న గిన్నె పెట్టండి. మెష్ గిన్నెలోకి కూడా నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఆ నీటిలో దంచుకున్న ధనియాలను కూడా వేయండి.

విత్తనాలు నీటిలో మునిగేలా ఉండాలి, లేకుంటే విత్తనాలు మొలకెత్తడం కష్టమైపోతుంది. ఈ మొత్తం గిన్నెను రోజులో మూడు నాలుగు గంటల పాటు సూర్యకాంతి తగిలేలా ఉంచండి. సూర్యకాంతి తగిలితేనే విత్తనాలు మొలకెత్తుతాయి. ఇలా 20 రోజులు పాటు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరు విత్తనాల నుంచి చిన్నవేర్లు ఆకులు పెరగడం గమనిస్తారు. ఆ సమయంలో గిన్నెలో నీటిని మార్చండి. కింద ఉన్న గిన్నెను తీసి నీళ్లు మార్చి మళ్లీ ఆ గిన్నెలో పెట్టూయాలి. దీనికి ఎలాంటి ఎరువులు అవసరం లేదు. మీరు మరీ వేయాలనుకుంటే నీటి ఆధారిత ఎరువులు లభిస్తాయి. ఇవి ద్రవ రూపంలో ఉంటాయి. లేదా పొడి రూపంలో ఉంటాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఎరువులను ఆ నీటిలో కలిపితే సరిపోతుంది.

నీటి నుంచి వచ్చే పోషకాలు, సూర్యకాంతి, నీరు కలిసి కేవలం రెండు నెలల్లోనే కొత్తిమీర గుబురుగా పెరిగేలా చేస్తాయి. పైన కొత్తిమీర ఆకులను కత్తిరించి మొక్కలు మాత్రం అలాగే ఉంచండి. తరచు నీటిని మారుస్తూ ద్రవపదార్థ రూపంలో ఎరువును జోడిస్తూ ఉండండి. మరి కొన్ని రోజులపాటు కొత్తిమీర ఆకులను అందిస్తూనే ఉంటుంది. ఇలా పండించడం వల్ల మీకు ఇంట్లో మట్టి చేరదు. పైగా ఈ పద్దతి ఎంతో ఆరోగ్య కరం కూడా.

Whats_app_banner