Protein Dosa: పిల్లల కోసం పోషకాలు నిండిన ప్రోటీన్ దోశ, ఇలా చేసి పెట్టండి వారికి నీరసమే రాదు-nutritious protein dosa for kids know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Protein Dosa: పిల్లల కోసం పోషకాలు నిండిన ప్రోటీన్ దోశ, ఇలా చేసి పెట్టండి వారికి నీరసమే రాదు

Protein Dosa: పిల్లల కోసం పోషకాలు నిండిన ప్రోటీన్ దోశ, ఇలా చేసి పెట్టండి వారికి నీరసమే రాదు

Haritha Chappa HT Telugu
Nov 01, 2024 11:30 AM IST

Protein Dosa: పిల్లల కోసం ఆరోగ్యకరమైన ఆహారాలు పెట్టేందుకే తల్లిదండ్రులు ప్రాముఖ్యతను ఇస్తారు. అలాంటి వారి కోసమే ఇక్కడ ప్రోటీన్ దోశ రెసిపీ ఇచ్చాము. దీన్ని పిల్లలకు ఉదయం పూట చేసి పెడితే వారు రోజంతా చురుగ్గా ఉంటారు.

ప్రొటీన్ దోశె రెసిపీలు
ప్రొటీన్ దోశె రెసిపీలు

పిల్లలకు దోశలు అంటే ఎంతో ప్రాణం. ఎప్పుడూ ఒకేలాంటి దోశెలు కాకుండా ఓసారి భిన్నంగా ప్రోటీన్ దోశ పెట్టి చూడండి. ఇది రుచిగా ఉండటమే కాదు, పిల్లలకు రోజంతా చురుకుదనాన్ని, శక్తిని అందిస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. వైద్యులు కూడా ప్రోటీన్ నిండిన ఆహారాన్ని అధికంగా తినమని చెబుతారు. ఇది కేవలం పిల్లల కోసమే కాదు బరువు తగ్గాలనుకునే పెద్దలు కూడా ఈ ప్రోటీన్ దోశను తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రోటీన్ దోశ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము, రెసిపీని ఫాలో అయిపోండి.

ప్రోటీన్ దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు

బ్రౌన్ రైస్ - ఒక కప్పు

పెసరపప్పు - అర కప్పు

కందిపప్పు - పావు కప్పు

మినప్పప్పు - పావు కప్పు

వేరుశెనగ పలుకులు - పావు కప్పు

పచ్చిశనగపప్పు - అర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

జీలకర్ర - ఒక స్పూను

అల్లం - చిన్న ముక్క

పచ్చి మిర్చి - నాలుగు

ప్రోటీన్ దోశ రెసిపీ

1. బ్రౌన్ రైస్, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పల్లీలను ముందుగానే శుభ్రంగా కడిగి నీళ్లలో నానబెట్టుకోవాలి.

2. దాదాపు ఐదారు గంటల పాటు నానితేనే ఇవి మెత్తగా అవుతాయి.

3. కాబట్టి రాత్రి సమయంలోనే వీటిని నానబెట్టుకోవాలి. ఉదయం లేచాక ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్ లో వేసి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

4. కావలసినంత నీటిని పోసుకోవాలి.

5. ఈ మొత్తం పప్పుల మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.

6. స్టవ్ మీద పెనం పెట్టి ఈ మిశ్రమాన్ని రెండు గరిటెలను వేసి దోశలాగా పరుచుకోవాలి.

7. దీన్ని రెండు వైపులా కాల్చి సర్వ్ చేసుకోవాలి.

8. ఈ ప్రోటీన్ దోశతో పాటు కొబ్బరి చట్,నీ టమోటో చట్నీ ఏది తిన్నా కూడా రుచిగానే ఉంటుంది.

9. ఇందులో అన్ని రకాల పప్పులు ఉన్నాయి.

10. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

11. ఒకసారి ఈ పిండిని రుబ్బుకుంటే రెండు మూడు రోజులు పాటు తాజాగా ఉంటుంది. అయితే ఫ్రిజ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

దీనిలో మనం బ్రౌన్ రైస్, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు వాడాము. ఇవన్నీ కూడా ప్రోటీన్ నిండిన పోషకాలు అలాగే శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల రోజంతా ప్రోటీన్ వల్ల శరీరానికి శక్తి అందుతూనే ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రోటీన్ దోశ చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

Whats_app_banner