Summer Eye Care | వేసవిలో మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి, ఈ చిట్కాలు చూడండి!
Summer Eye Care Tips: వేసవికాలంలో మీ కళ్ల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. మీ కళ్లు అలసిపోకుండా చల్లగా ఉండటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, తెలుసుకోండి.
Summer Eye Care Tips: కళ్ళు మనకు ఎంతో ముఖ్యమైనవే కాదు, చాలా సున్నితమైనవి కూడా. వాటిని సక్రమంగా చూసుకుంటేనే మీరు ఏదైనా సరిగ్గా చూడగలరు, మీ కంటి చూపు బాగుంటుంది. ఈ వేసవిలో మీ కళ్ల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తీవ్రమైన ఎండవేడికి మీ కళ్ళు త్వరగా అలసిపోతాయి. బయటి నుంచి వచ్చే దుమ్ము, పొగ, ఇతర కాలుష్య కారకాలు మీ కంటిలో చేరి వాటికి హాని చేయవచ్చు. అయితే సులభమైన చిట్కాలతో ఈ వేసవిలో మీ కళ్లను చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ కంటి ఆరోగ్యం కోసం ఈ వేసవిలో ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి.
బయటకు వెళ్తే సన్ గ్లాసెస్
వేసవిలో మీరు బయటకు వెళ్తే తప్పకుండా సన్ గ్లాసెస్ ధరించాలి. మీరు ధరించేవి 100% అతినీలలోహిత (UV) రక్షణ కలిగిన సన్ గ్లాసెస్ అని నిర్ధారించుకోండి. ఇవి కఠినమైన సూర్యకిరణాల నుండి మీ కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. మీ కళ్లను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏడాది పొడగునా సన్ గ్లాసెస్ వాడినా తప్పులేదు.
తలకు హ్యాట్ ధరించండి
మీరు తలకు రక్షణగా ధరించే టోపి లేదా హ్యాట్ మీ కంటిని కూడా సంరక్షిస్తుంది. మీ కళ్లపై సూర్యకిరణాలు పడకుండా కళ్లకు నీడ కల్పిస్తుంది. కాబట్టి నిండుగా ఉండే టోపిని ధరించండి.
ప్రకాశవంతమైన ఉపరితలాలు చూడకండి
వేసవిలో ఉపరితలాలు చక్కుమని మెరుస్తాయి. రోడ్డుపై వెళ్తున్నపుడు గానీ, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే బయట నుంచి వచ్చే కాంతి ప్రతిబింబాలు మీకళ్లను ప్రభావితం చేస్తాయి. దీనిని ఫోటోకెరాటిటిస్ అని కూడా పిలుస్తారు. మీరు ఫోటోకెరాటిటిస్ కు గురైతే మీ కళ్లు మండుతాయి, ఎరుపెక్కుతాయి, అస్పష్టత ఉంటుంది, తాత్కాలిక దృష్టి నష్టాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి ప్రకాశవంతమైన తలాలను చూడకుండా జాగ్రత్త పడండి. నీడ ఉన్న ప్రాంతాలను చూడండి.
మీ కళ్లను తేమగా ఉంచుకోండి
మీరు ఆరుబయట సమయం గడుపుతున్నప్పుడు, వడగాల్పులు, పొడి గాలులు మీ కళ్ళకు చికాకు కలిగించవచ్చు . ఇది పొడి కళ్లు (Dry Eyes) అనే పరిస్థితికి కారణమవుతాయి. వేసవి వాతావరణం కంటిలోని కన్నీటి పొరను ప్రభావితం చేస్తుంది, మీ కంటి ఉపరితలాన్ని పొడిగా చేస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించినట్లయితే లేదా కాలానుగుణ అలెర్జీలతో బాధపడుతుంటే పొడి కంటిని ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీ కళ్ళను రక్షించుకోవడానికి, మీ కళ్లను ఎల్లప్పుడూ తేమగా , రిఫ్రెష్‌గా ఉంచుకోండి. ఇందుకోసం కంటి వైద్యులు సూచించే ప్రత్యేకమైన కృత్రిమ కన్నీటి చుక్కలను ఉపయోగించండి.
ఆరోకరమైనవి తినండి
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారపానీయాలు తీసుకోండి. ఇవి మీ కళ్లకు కూడా మంచి పోషణ అందిస్తాయి. టొమాటోలు, గుమ్మడికాయ, పచ్చి మిరపకాయలు, పుచ్చకాయ వంటివి మీ కళ్ళను ఆరోగ్యకరంగా ఉంచడానికి పోషకాలను అందించే గొప్ప వనరులు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ కళ్ళకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి, కాబట్టి మీ విత్తనాలు, గింజలను తినడం మర్చిపోవద్దు.
అదనంగా, వేసవిలో ఎల్లప్పుడూ పుష్కలంగా నీరు త్రాగాలి. నిర్జలీకరణం కంటి ఒత్తిడికి కారణమవుతుంది, ఇది అస్పష్టమైన దృష్టి, తలనొప్పికి దారితీస్తుంది.
సంబంధిత కథనం